పుణ్యతీర్థం
విష్ణుమూర్తి శేషశయనుడై భక్తుల మొరలను ఆలకిస్తూశ్రీరంగనాయకితో కొలువుతీరిన క్షేత్రం... శ్రీరంగం.విశాల ప్రాంగణం... ఎత్తయిన గోపురాలు...దేవతామూర్తుల సముదాయం...దేవాలయంలోనే పట్టణం... ఇవీ ఈ క్షేత్రం విశేషాలు.‘రంగ రంగ రంగపతి రంగనాథానీ సింగారాలే తరచాయె శ్రీరంగనాథా’... అని అన్నమయ్య సంకీర్తన చేసింది ఈ క్షేత్రం గురించే!
శ్రీరంగనాథుడు, రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం– శ్రీరంగం. ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యన ఉన్న ఒక ద్వీపం. ‘శ్రీరంగం’ అనే ఊరిలో దేవాలయం లేదు. ‘శ్రీరంగ దేవాలయం’లోనే శ్రీరంగం అనే ఊరు ఉంది. దేవాలయం ఊరు కలగలిసినదే – శ్రీరంగం. దీనిని వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి శయనమూర్తిగా దర్శనమిస్తాడు. క్షీరసాగరంలో పవళించిన శ్రీమహావిష్ణువు నాభి నుంచి పద్మంలో జన్మించిన బ్రహ్మ ఇక్కడ కనపడడు. సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే స్వామివారిని పూజిస్తారని ఈ క్షేత్రానికి సంబంధించిన గాథలు చెబుతున్నాయి. స్వామి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధి నిర్వర్తిస్తాడనీ, శ్రీరంగంలో శయనిస్తాడనీ తెలుస్తోంది. విశిష్టాద్వైత స్థాపకుడు రామానుజాచార్యులు శ్రీరంగంలోనే అనేక సంవత్సరాలు ఉండి, స్వామి సేవలో పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం
దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు కి.మీ. పొడవైన ప్రాకారంతో ఈ దేవాలయం నిర్మితమై, ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా చరిత్రలో నిలిచింది. ఇక్కడ 50 పైచిలుకు పరివార దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. స్వామివారి రాజగోపురం 236 అడుగుల ఎత్తు కలిగి (ఆసియాలోనే అతి పెద్ద రాజగోపురం), 13 అంతస్థులతో శోభాయమానంగా ఉంటుంది. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలు ఉండగా, తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుడిని ప్రతిష్ఠించారు. దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా, మూలస్థానంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రాంగణంలోనే వసతి సముదాయాలు, వాణిజ్య సముదాయాలు కలిగిన ఆలయం ఇది. కంబోడియాలోని అంకోర్‌వాట్ మందిరం వైశాల్యంలో దీని కంటే పెద్దదే అయినప్పటికీ, ఆ దేవాలయం శిథిలావస్థలో ఉంది. కానీ ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతి పెద్ద హిందూ దేవాలయం మాత్రం శ్రీరంగమే.
అమ్మవారితో....
కావేరీ నదీ తీరాన మూడు ప్రసిద్ధ రంగనాథ దేవాలయాలు ఉన్నాయి. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణంలో ఆది రంగడు, శివసముద్రంలో మధ్య రంగడు, శ్రీరంగంలోని రంగనాథస్వామి మందిరంలో అంత్య రంగడు. శ్రీరంగంలోని మండపాన్ని భోగమండపం అంటారు. రామ, కృష్ణావతారాలను విభవ అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు ఈ క్షీరాబ్ధి నాథుడే మూలమని ఆళ్వారులు విశ్వసిస్తారు.
విభీషణుడికి రాముడిచ్చిన విగ్రహం
వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ సంతుష్టుడై తాను ఆరాధించేది శ్రీరంగనాథుడిననీ, కనుక నీవు కూడా ఆరాధించమనీ ఆ ఆరాధనను ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించాడు. అలా రంగనాథ ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. సీతాపహరణం తరువాత విభీషణుడు రావణుడితో విభేదించి, రాముని శరణు కోరి ఆశ్రయం పొందాడు. విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రావణ వధ అనంతరం తమ ఆరాధ్య దైవం అయిన రంగనాథుడి విగ్రహాన్ని అతడికి ఇస్తూ ‘లంకకు తీసుకెళ్లు. కాని దారిలో ఎక్కడా ఈ విగ్రహాన్ని నేల మీద ఉంచకూడదు’ అని వివరించాడు. కానీ విభీషణుడు ఉభయ కావేరుల మధ్యనున్న ద్వీపంలో విశ్రమించేందుకు విగ్రహాన్ని దించి తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆశ్చర్యంగా ఆ విగ్రహం రాలేదు. ఈ సంగతి తెలిసిన ఆ ప్రాంత పాలకుడు ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చి, ‘స్వామివారు ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నందున ఇక్కడే దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడదాం’ అన్నాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కునకు తిరిగారని స్థల పురాణం చెబుతోంది.
చంద్రగిరికి చేరిన ఉత్సవమూర్తి
ఇక్కడ గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తిని పెరియ పెరుమాళ్ అనీ, ఉత్సవమూర్తిని నంబెరుమాళ్ అనీ అంటారు. ఒకానొక సమయంలో తురుష్కుల వలన ఉపద్రవం ఏర్పడినప్పుడు శ్రీరంగనాథుల ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతానికి చేర్చారనీ, ఆ సమయంలో మరొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించార నీ చరిత్ర.
బంగారు స్తంభాలు...
గర్భాలయంలో శ్రీరంగనాథుని ఎదుట ఉన్న బంగారు స్తంభాలను తిరుమణైత్తూణ్ అంటారు. ప్రసాదాలు స్వీకరించే ప్రదేశానికి గాయత్రి మండపం, గర్భాలయానికి ముందున్న ప్రదేశానికి చందన మండపం, ప్రదక్షిణకు తిరువణ్ణాళి ప్రదక్షిణం అని పేరు.
ప్రాకారాలు...
మొదటి ప్రాకారంలో ద్వారపాలకుడు, యాగశాల, విరజా బావి, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఉన్నాయి. రెండో ప్రాకార గోపుర ద్వారంలో పవిత్రోత్సవ మండపం, దొర మండపం ఉన్నాయి. ఇక్కడ ఉన్న విరజా మండపం క్రింది నుంచి విరజానది ప్రవహిస్తోందని పండితులు చెబుతారు. విణ్ణప్పం అంటే అభ్యర్థన జరిగే మండపంలో ధ్వజారోహణ మండపం కూడా ఉంది. ఇక్కడ స్తంభాల మీద ఉన్న వినీత ఆంజనేయస్వామి వరాలివ్వగల శక్తిమంతుడని చెబుతారు. మూడవ ప్రాకారాన్ని అలినాడన్ తిరువీధి అంటారు. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి, వెలుపల వాలి సుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్ సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉంది. ప్రాకారానికి ఎడమ భాగంలో ధాన్యం కొలిచే మండపం, దీని ప్రక్కన నంజీయర్ సన్నిధి ఉన్నాయి. ఈ ప్రాకారంలో ఇంకా చంద్ర పుష్కరిణి, పొన్న చెట్టు, వేదవ్యాస సన్నిధి, వరదరాజస్వామి సన్నిధి, వైకుంఠనాథన్ సన్నిధి, సూర్య పుష్కరిణి... వంటివి ఎన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరం పది దినాలు శ్రీరంగనాథులు కొలువుతీరే వేయి కాళ్ల మండపం ఉంది. దీనిని సహస్రస్థూణా మండపం అంటారు. ఈ మండపంలో స్వామి వేంచేసి ఉండే స్థలానికి తిరుమామణి మండపం అని పేరు.
ఉత్సవాలు..
ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనం సుప్రసిద్ధం. ఉగాది, విజయదశమి మొదలైన ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ప్రతి నిత్యం ఉత్సవ సంబరమే.
లౌకికవాదానికి ప్రతీక...
ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఇక్కడ మూర్తిని ఢిల్లీకి తరలించాడనీ, సుల్తాన్ కుమార్తె స్వామి భక్తురాలిగా మారిందనీ, అనంతరం ఈ విగ్రహాన్ని రామానుచార్యులు శ్రీరంగానికి తీసుకువచ్చాడనీ, సుల్తాన్ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైందని చెబుతారు. ఇందుకు ప్రతీకగా ఇప్పటికీ పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధరించి, కనిపిస్తారు. రోటీలను నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా ఉంది. షేక్ చినమౌలానా ఈ ఆలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. ఈయనది ప్రకాశం జిల్లా కరవది గ్రామం.
ఈ దేవాలయంలో గరుడాళ్వార్ 25 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు. 30 మీటర్ల పొడవాటి వస్త్రంతో స్వామిని అలంకరిస్తారు. అతి సుందరమైన శిల్పకళతో ఒక మండపం ఇక్కడి గరుడాళ్వార్‌కి ఉంది. ఈ ఆలయంలో మాత్రమే శ్రీరంగనాథస్వామిని భక్తిప్రపత్తులతో ఆరాధించిన మహమ్మదీయ రాణి తుళ్లకునాచ్చియార్ చిత్రం ఉంది. ఈ ఆలయంలో భగవద్ శ్రీరామానుజాచార్య స్వామి పార్థివ దేహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో కొన్నాళ్లు భద్రపరిచారు. ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం ప్రాకృతిక ఉపద్రవాల అంచున ఉంది. గతంలో చాలాసార్లు డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ వారి దాడులను తట్టుకుని కాలపరీక్షకు నిలబడింది.
శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సాధ్యం కాని ఇంతటి బృహత్తరమైన ఆలయాన్ని ఆ రోజుల్లో మనవారు ఎలా నిర్మించగలిగారో అంతుచిక్కదు. ఆలయంలో ఉన్న వెయ్యి స్తంభాల మండపం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇన్ని స్తంభాలను ఎంత మంది శిల్పులు, ఎలా నిర్మించారో అంతు చిక్కదు. బరువైన రాళ్లను ఎత్తయిన ప్రదేశాలోకి ఏ విధంగా తీసుకువెళ్లారన్నది సమాధానం లేని ప్రశ్న.
దర్శన వేళలు...: ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మధ్యాహ్నం 12 నుంచి 1.5 మధ్య తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 మధ్య పూజ జరుగుతుంది. ఈ సమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6 నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే 50 రూపాయలు టికెట్ కొనుగోలు చేయాలి. శీఘ్ర దర్శనం కావాలనుకుంటే 250 రూపాయల టికెట్ కొనాలి.
సౌకర్యాలు...: వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేట్ హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి. సాధారణ హోటల్స్ నుంచి ఫైవ్‌స్టార్ హోటల్స్ వరకు చాలా అందుబాటులో ఉన్నాయి.
ఇలా చేరుకోవచ్చు...
తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగానికి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇక్కడి నుంచి దూరం కేవలం 9 కి.మీ. పావుగంటలో చేరుకోవచ్చు. తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగానికి 15 నిమిషాలలో చేరుకోవచ్చు. చెన్నై నుంచి తిరుచిరాపల్లి 333 కిలోమీటర్లు.
– డా. పురాణపండ వైజయంతి
శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే మోహనం...
Published Tue, Jan 3 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
Advertisement