ఫుట్‌బాల్‌లో ఏ జట్టు ఆడుతున్నా... అభిమానుల చూపు సహజంగా పదో నంబర్ జెర్సీ వైపే వెళుతుంది. మనకు పూర్తిగా తెలియని జట్టు బరిలోకి దిగినా 10వ నంబర్ ధరించిన ఆటగాడు కచ్చితంగా స్టార్ అయి ఉంటాడనేది ఓ నమ్మకం. ఫుట్‌బాల్‌లో ఈ నంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఇది. దీనికి తగ్గట్లే... పదో నంబర్ జెర్సీలు ధరించిన వాళ్లంతా సూపర్ స్టార్స్ అయ్యారు.
ఒకప్పుడు సాకర్‌లో జెర్సీ నంబర్లకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. అయితే సంఖ్యాశాస్త్రంపై ఆటగాళ్లు ఎక్కువగా దృష్టిపెట్టడంతో జెర్సీ నంబర్లపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఫుట్‌బాల్‌లో 10వ నంబర్ జెర్సీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. సాకర్ దిగ్గజం పీలే దగ్గరి నుంచి నేటి నెయ్‌మార్ వరకు అంతా పదో నంబర్ జెర్సీపై మనసు పారేసుకున్న వాళ్లే. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కలేదు. పీలే, మారడోనా, జిదానే ‘నం.10’ తో అద్భుతాలు సృష్టించారు. రొనాల్డినో, కాకాతో పాటు లియోనెల్ మెస్సీ, వేన్‌రూనీ ఇదే కోవలోకి వస్తారు. 2014 ప్రపంచకప్‌లో ఆయా జట్లకు చెందిన, పదో నంబర్ జెర్సీ ధరించిన స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. నెయ్‌మార్, మెస్సీ, స్నైడర్, కరీం బెంజెమా, పొడోల్‌స్కీ, రోడ్రిగ్వెజ్ లాంటి ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో తమ ప్రతిభతో అభిమానుల్ని కట్టిపడేశారు.
బేస్‌బాల్‌తో ఆరంభం
సాధారణంగా మైదానంలో జట్లను వారు వేసుకునే జెర్సీ రంగులతో గుర్తిస్తాం. కానీ ఆటగాళ్లను గుర్తించడానికి వారు వేసుకునే జెర్సీలకు నంబర్లే ఆధారం. అయితే ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపైన నంబర్లు ముద్రించడం బేస్‌బాల్‌తో ఆరంభమైంది. ఫుట్‌బాల్‌లో ఇది 1928లో మొదలైంది. ఆర్సెనల్-షెఫీల్డ్ మధ్య జరిగిన క్లబ్ మ్యాచ్‌లో తొలిసారిగా జెర్సీలకు నంబర్ల విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇక ఆటగాళ్లకు నంబర్లను స్టార్టింగ్ ఫార్మేషన్ ఆధారంగా కేటాయించేవాళ్లు. గోల్ కీపర్‌కు 1, రైట్ ఫుల్‌బ్యాక్‌కు 2, లెఫ్ట్ ఫుల్‌బ్యాక్‌కు 3, ఇలా జట్టులో ప్రతీ ఆటగాడికి వరుస క్రమంలో నంబర్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. 1 నుంచి 23 వరకు ఆటగాళ్లు తమకు నచ్చిన నంబర్లను ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో జట్టులోని స్టార్ ప్లేయర్‌కి, సీనియర్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వీళ్లు తమకు నచ్చిన జెర్సీ నంబర్‌ను ఎంపిక చేసుకున్న తర్వాతే మిగిలిన వాళ్లకు అవకాశం దక్కుతుంది.
హోదాకు చిహ్నం !
సాకర్‌లో స్టార్ హోదా అంత ఈజీగా రాదు.. ఆటగాడు అద్బుత ప్రతిభ కలిగినవాడై ఉండాలి. మైదానంలో చురుగ్గా కదలాలి.. ప్రత్యర్థి రక్షణశ్రేణిపై దాడులు చేయాలి.. జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాలి. జట్టు బరువు బాధ్యతలను కూడా మోయాలి. ఇదంతా ఓ సాధారణ ఆటగాడి వల్ల కాని పని. అదే స్టార్ ఆటగాడైతే.. ఏదైనా చేయగల సమర్థుడు. అందుకే సాకర్‌లో పదో నంబర్ జెర్సీ ఆ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ‘నం.10’ జెర్సీ ధరించడమంటే హోదాకు చిహ్నంగా భావిస్తారు ఆటగాళ్లు. ఈ జెర్సీ వేసుకునే అవకాశం దక్కిందంటే ఆ ఆటగాడికి జట్టులో గౌరవం ఉన్నట్లే. ఈ నంబర్ దక్కినవాళ్లు తమ స్టేటస్ ఏంటో ప్రత్యేకంగా చాటుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్కీ నంబర్ జెర్సీ వేసుకునే అవకాశం అంతకుముందు తామేంటో నిరూపించుకున్న వాళ్లకే దక్కుతుంది. మొత్తానికి జట్టు ఏదైనా చాలా ఏళ్ల నుంచి 10వ నంబర్ జెర్సీ ధరించే అవకాశం స్టార్లకే దక్కుతోంది.
సచిన్ ‘10’డూల్కర్
సాకర్‌లో జెర్సీ నంబర్లకు విపరీతమైన క్రేజ్ ఉన్నా.. క్రికెట్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టార్ క్రికెటర్లు వేసుకునే జెర్సీలు, వారి నంబర్లపైన మాత్రమే అభిమానులకు అమితాసక్తి. క్రికెట్‌లో ప్రస్తుత, మాజీ క్రికెటర్లలో సచిన్ తన పదో నంబర్ జెర్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ ఆరంభంలో మాస్టర్ 99 నంబర్ జెర్సీని ధరించేవాడు. అయితే తన పేరులోని టెండూల్కర్‌లోని ‘10’ను లక్కీ నంబర్‌గా మార్చుకున్నాడు. ప్రారంభం నుంచి కాకపోయినా... రిటైరయ్యే వరకు సచిన్ ఈ నంబర్‌తోనే మైదానంలో అద్భుతాలు సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించిన సచిన్ ఈ లీగ్ నుంచి తప్పుకున్నాక అతను వేసుకున్న పదో నంబర్ జెర్సీని వేరే ఆటగాడికి జట్టు యాజమాన్యం కేటాయించలేదు. సచిన్ గౌరవార్థ్ధం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక క్లబ్ సాకర్‌లోనూ జట్టు యాజమాన్యాలు తమ ఆటగాళ్లు రిటైరైనప్పుడు అతని గౌరవార్థానికి సూచనగా వారు వేసుకునే జెర్సీ నంబర్లను ఎవరికీ కేటాయించడం లేదు. దీన్నిబట్టి స్పోర్ట్స్‌లో జెర్సీ నంబర్లకు ఉన్న ప్రాధాన్యం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.
- శ్యామ్ తిరుక్కోవళ్లూరు
‘దస్’ కా దమ్!
Published Fri, Jul 11 2014 11:31 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
Advertisement