
అల్లం... ఆర్థరైటిస్ మందు
గుడ్‌ఫుడ్
మనకు జలుబు చేసినట్లు అనిపించగానే మొదట చేసే పని మామూలు టీకి బదులు, జింజర్ టీ తాగడమే. అంటే అల్లంలో ఏవో వైద్యపరమైన అద్భుతాలు ఉన్నాయన్న విషయాన్ని సమాజమే మనకు పరోక్షంగా నేర్పిస్తుందన్నమాట. ఇలా మనకు పెద్దగా తెలియకుండానే అల్లాన్ని జలుబుకు విరుగుడుగా వాడుతుంటాం. ఇదొక్కటే కాదు అల్లంతో ప్రయోజనాలు ఎన్నెన్నో...
అల్లానికి ఉండే ఓ విచిత్రమైన రుచి, వాసనలకు (ఫ్లేవర్‌కు) కారణం దానిలోని జింజెరాల్ అనే స్వాభావికమైన రసాయనం. దాని వల్ల మనకు ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జింజెరాల్ అన్న ఆ శక్తిమంతమైన పదార్థంలో నొప్పి, వాపు, మంటను తగ్గించే గుణంతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. వికారం, వాంతులను అరికట్టే గుణం ఉన్నందున వేవిళ్లతో సతమతమయ్యే మహిళలకూ, సీ సిక్‌నెస్‌తో బాధపడే పురుషులకు ఆ సమస్య తీరడానికి అల్లంతో చేసిన పదార్థాలు ఇస్తారు. అంతేకాదు... కీమోథెరపీ తీసుకుంటున్న వారిలో కనిపించే వికారాన్ని నివారించడానికి కూడా అల్లాన్ని ఉపయోగిస్తారు.
గొంతునొప్పి, గొంతులో ఇబ్బంది ఉన్నవారికి ఆ సమస్య తగ్గడం కోసం అల్లం ఘాటు ఉన్న పదార్థాలను ఇస్తారు. అల్లానికి ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం (వాపు, నొప్పి, మంటను తగ్గించడం) వల్ల దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు ఇస్తుంటారు. అల్లం గుండెజబ్బులను నివారించడంతో పాటు రక్తంలో చక్కెరపాళ్లను తగ్గిస్తుంది. అల్లం జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.