ఆకలికి భేష్...
గుడ్‌ఫుడ్
జీలకర్ర ప్రధానాహారంగా కాకపోయినా... ఆహారానికి మంచి రుచి, సువాసన (ఫ్లేవర్) రావడానికి ఉపయోగపడే దినుసు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. వాటిలో కొన్ని... తాలింపులో జీలకర్ర పడగానే ఒక మంచి సువాసనతో మనకు ఆహ్లాదం చేకూరుతుంది. జీలకర్రలో ఉండే క్యుమినాల్డిహైడ్ అనే రసాయనమే దీనికి కారణం. ఇది మన లాలాజల గ్రంథులను ఉత్తేజపరచి ఆకలిని పెంచుతుంది.
పైన పేర్కొన్న ప్రక్రియ జరగగానే జీలకర్ర ఉండే థైమాల్ అనే మరో రసాయనం జీర్ణప్రక్రియకు అవసరమైన బైల్, ఇతర జఠరరసాలు ఊరేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది. అందుకే ఆకలి లేనివారు, అరుగుదల సమస్యలు ఉన్నవారు జీలకర్ర వాడితే ప్రయోజనం ఉంటుంది. జీలకర్ర గ్యాస్‌ట్రబుల్‌ను తగ్గిస్తుంది. త్రేన్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు మనం తీసుకునే ఆహారాల్లో జీలకర్రను వాడితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
జీలకర్రలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే వారు కోల్పోయే ఐరన్ తిరిగి భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్ ఎక్కువగా అవసరం కాబట్టి వారు వాడటం కూడా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్స్‌ను జీలకర్ర తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.