స్వాతంత్య్రానికి సుముహూర్తం... | Good Muhurtham For Indian Independence Announcement | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రానికి సుముహూర్తం...

Published Thu, Aug 15 2013 12:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

స్వాతంత్య్రానికి  సుముహూర్తం...

స్వాతంత్య్రానికి సుముహూర్తం...

మన దేశానికి 1947 ఆగస్టు 14 చివరి ఘడియల్లో.. 15 తేదీ ప్రారంభ ఘడియల్లో స్వాతంత్య్రం వచ్చింది.

మన దేశానికి 1947 ఆగస్టు 14 చివరి ఘడియల్లో.. 15 తేదీ ప్రారంభ ఘడియల్లో స్వాతంత్య్రం వచ్చింది. అంటే 14 వ తేదీ అర్ధరాత్రిన బిటిష్  ప్రభుత్వం నుంచి మనదేశానికి అధికార బదిలీ జరిగింది. మనదేశం తరపున మన రాజ్యంగ అసెంబ్లీ అధికారాన్ని స్వీకరించింది. మరి ఇదంతా ఆ అర్ధరాత్రే ఎందుకు జరిగినట్లు? 14వ తేదీన కాని, 15వ తేదీ ఉదయం కాని ఎందుకు జరగన ట్లు? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇలా జరగటం వెనుక చాలా ఆసక్తికరమైన వ్యవహారమే ఉంది.
 
 1947 ఆగస్టు 15న భారతీయులకు అధికార బదిలీ జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే  భారతీయులకు విశ్వాసాలు, నమ్మకాలు ఎక్కువ. గ్రహాల స్థితిగతులు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయనే బలమైన విశ్వాసం ఉంది. అందుకే శుభకార్యాలకే కాక పనుల ప్రారంభాలకు, రాకపోకలకు కూడా శుభఘడియల కోసం తిథి, నక్షత్రాలు చూస్తుంటారు. ఇలాంటి నమ్మకాల నేపథ్యంతో ఆనాటి కొందరు జాతీయ నాయకులకు ఆగస్టు 15 మంచిదేనా అని తెలుసుకోవాలనిపించింది. వెంటనే పండితులను సంప్రదించారు. ఆగస్టు 15 శుక్రవారం చతుర్ధశి. పైగా రాత్రి ఏడున్నర గంటల తరువాత అమావాస్య కనుక ఆ రోజు మంచిది కాదని పండితులు స్పష్టం చేశారు.  14వ తేదీ ఎంతో శుభదినమని తెలిపారు.
 
 ఆ తరువాత 17వ తేదీ మంచిదన్నారు. దీంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆ ప్రముఖులకు అంతుపట్టలేదు. పోని 14వ తేదీనే అధికార మార్పిడి జరిపిద్దామా అంటే ఆ రోజు లార్డ్‌మౌంట్‌బాటన్ కరాచీలో పాకిస్తాన్‌కు అధికార మార్పిడి కార్యక్రమంలో ఉంటారు. ఆ రోజు మధ్యాహ్నానికిగానీ ఆయన ఢిల్లీకి బయలుదేర రు. పైగా  ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రమని   బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది.
 
 ఈ సంకట స్థితిపై తర్జన, భర్జనలు జరుగుతున్న సమయంలో ప్రముఖ చరిత్రకారుడు, మలయాళ పండితుడు, హిందూమతాచారాలు, సాంప్రదాయాలపై విస్తృతమైన, లోతైన పరిజ్ఞానం కలిగిన  కె.ఎం.పణిక్కర్ ఒక పరిష్కారం సూచించారు. సమస్య పరిష్కారం కోసం అర్ధరాత్రి ముహుర్తం పెట్టారు ఆయన. పణిక్కర్ పరిష్కారం ప్రకారం రాజ్యంగ సభ శుభదినమైనటువంటి  14వ తేదీ రాత్రి 11-30 గంటలకు సమావేశమవుతుంది. సరిగ్గా 12 గంటలు కొట్టగానే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వీకరిస్తుంది.
 
 దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించినట్లు ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ఇచ్చినట్లు అవుతుంది. అధికార మార్పిడి జరిగే ఆ ఘడియలు గ్రహస్థితులను సంతృప్తి కలిగించేవి, బ్రిటిష్ ప్రభుత్వానికి తేదీలను మార్చాల్సిన అవసరం లేనివి కావడంతో ఆ పరిష్కారం అందరికి ఆమోదయోగ్యమైంది.
 
 - కోట తరుణ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement