
గ్రీన్ టీతో మొటిమలూ తగ్గుతాయి!
పరిపరి శోధన
ఇప్పటికే గ్రీన్ టీ వల్ల కలిగే అనేక ఉపయోగాలు చాలా మందికి తెలిసిన విషయమే. సరికొత్త అధ్యయనం వల్ల ఇప్పుడు మరో అంశం కూడా ఈ జాబితాకు తోడైంది. గ్రీన్ టీ తాగే మహిళల ముఖం నుంచి మొటిమలు తుడిచిపెట్టుకుపోతాయంటున్నారు పరిశోధకులు. మరీ ముఖ్యంగా ముక్కు, గదమ ప్రాంతాల్లోని మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రతిరోజూ గ్రీన్‌టీ తాగడం వల్ల కేశంలోని అంకురప్రాంతంలో ఉండే నూనె స్రవించే గ్రంథుల వద్ద బ్యాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా అంతగా పెరిగే అవకాశం ఉండదంటున్నారు తైవాన్‌లోని నేషనల్ యాంగ్ మింగ్ యూనిర్సిటీకి చెందన పరిశోధకులు.
గ్రీన్-టీలోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం ఇలా మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలోనూ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. దీనికి తోడు ఆ పోషకంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) గుణం సైతం మొటిమలు రాకుండా ఉండేలా చేసేందుకు దోహదం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.