కురులకు నిగనిగలు...
బ్యూటిప్స్
శిరోజాల అందానికి, ఆరోగ్యానికి ఇంట్లోనే చేసుకోదగిన మేలైన చిట్కాలు... టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నాలుగు కప్పుల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడి, శిరోజాలు మృదువుగా అవుతాయి. ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లే సమస్య తగ్గుతుంది. కురుల మృదుత్వం పెరుగుతుంది. పెరుగులో పెసరపిండి కలిపి, రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు మృదువుగా అవుతాయి.
ఆలోవెరా జెల్‌ను రాత్రి పడుకునేముందు మాడుకు పట్టించి, మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడటమే కాకుండా, చుండ్రు తగ్గుతుంది.ఎర్రని బంతిపూలను వేసి, బాగా మరిగించిన కప్పుడు నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి. జుట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి ఇది ఆర్గానిక్ హెయిర్ డైలా ఉపయోగపడుతుంది.బీట్‌రూట్‌ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.