‘నేను బిజినెస్ చేస్తాను’’ అంది రీతూ. కౌశిక్ ఆశ్చర్యంగా చూశాడు. ‘‘కుదురుతుందా!’’ అన్నాడు కౌశిక్.నిజానికైతే వాళ్లుంటున్న ప్రాంతాన్ని బట్టి, వాళ్లు పెట్టి పెరిగిన కుటుంబాల వాతావరణాన్ని బట్టి, అతడు ‘‘ఏం అక్కర్లేదు. ఇంట్లో పడుండు’’ అనే మాట అనాలి.హరియాణా.. మిగతా దేశానికి కొంచెం డిఫరెంట్. అక్కడి మగాళ్లు ‘మగపుట్టక పుట్టాం’ అన్నట్లు ఉంటారు. ఆడవాళ్లు ‘ఆడజన్మ’ అని సరిపెట్టుకునేలా ఉంటారు. రీతూ, కౌశిక్‌లది హరియాణాలోని సోనీపత్. గ్రామమే కానీ, మరీ పల్లెలా ఉంటుంది. కుదురుతుందా అన్నాక, ‘‘పల్లెలో ఏం బిజినెస్ నడుస్తుంది రీతు’’ అని నవ్వాడు కౌశిక్.రీతూకు హ్యాండ్‌బ్యాగులు డిజైన్ చెయ్యడం వచ్చు. ఎప్పుడో టెన్త్‌లో ఉండగా నేర్చుకుంది. ఊళ్లోకి ఎవరో వచ్చారు.. విద్య నేర్చుకుంటే ఉపాధి ఉంటుందని ఏవో రెండు మూడు పనులు ఊళ్లో ఆడవాళ్లకు నేర్పించి వెళ్లారు.
నేర్చుకున్న వాళ్లలో రీతూ కూడా ఉంది. పదహారేళ్లకే పెళ్లి కావడంతో రీతూ లోపల ఆ విద్య అలా మెలకువగా ఉంది.ఇప్పుడు ఆమె వయసు 31. ఇద్దరు పిల్లలు. ఇప్పుడామె బిజినెస్ ఉమన్. నెలకు ఇంతని సంపాదిస్తోంది. ఎంత సంపాదిస్తోందో తర్వాత. సంపాదన ఎలా మొదలైందో తెలిస్తే భలే వింతగా ఉంటుంది. అమ్మాయిల్లోని ఆసక్తికి, నైపుణ్యానికి కాస్త హెల్పింగ్ హ్యాండ్ దొరికితే ఇట్టే అల్లుకునిపోతారని తెలిసి ముచ్చటేస్తుంది. ఈ ముచ్చటకేం గానీ.. రీతూ లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా మొదలైందో చూడండి. ‘‘నేను బిజినెస్ చేస్తాను’’ అని అడిగిందని కదా రీతూ గురించి మనం చెప్పుకున్నాం. ఇది ఐదేళ్ల నాటి సంగతి. ‘‘కుదురుతుందా’’ అని భర్త అడిగిన తర్వాత, ‘కుదుర్చుకుంటాను’’ అని చెప్పిన తర్వాత.. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ల డిజైనింగ్‌లు చెయ్యడం, వాటిని కుట్టి, ఫినిషింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. మొదటి కస్టమర్ ఒక పురుషుడు.
ఎవరంటే.. ఆమె భర్తే. ‘‘రీతూ మేడమ్ ఎంతకు అమ్ముతారు?’’ అని సరదాగా అడిగాడు. తర్వాత వాళ్ల ఆఫీస్‌లోని వాళ్లకు చెప్పాడు. తర్వాత చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. వారిలో.. చదువుకున్న అమ్మాయిలు ఉంటారు కదా.. వారు రీతూకు గైడెన్స్ ఇచ్చారు. ‘‘అక్కా.. బాగుంది, అయితే డిగ్రీ చదివితే.. నీకు బాగా పనికొస్తుంది’ అని చెప్పారు. ‘‘డిగ్రీలో చేరేదా’’ అని భర్తను అడిగింది రీతూ... ‘బిజినెస్ చేసేదా?’ అని అడిగిన విధంగానే. ‘‘కష్టమవదు కదా..’’ అన్నాడు. నవ్వింది. అతడిని ఆఫీస్‌కి, పిల్లల్ని స్కూల్‌కి పంపి తనూ, ప్రైవేట్ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఎంట్రన్స్ టెస్ట్ రాసి, నేరుగా డిగ్రీలో చేరి చదివింది.
పాసైంది. 2016లో పట్టా చేతికొచ్చింది. ‘‘అక్కా.. ఇప్పుడు చూస్కో నీ బిజినెస్ ఎలా డెవలప్ అవుతుందో. ఫ్లిప్‌కార్ట్‌తో టై అప్ అవ్వు’’ అని సలహా ఇచ్చారు. అప్పట్నుంచీ రీతూ ప్రాడక్ట్ మొత్తం ఆన్‌లైన్ అమ్మకాలకే. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌కి. మంచి డిజైన్‌లు, మంచి క్వాలిటీ ఉండడంతో రీతూ హ్యాండ్ బ్యాగులకు ఫ్లిప్‌కార్ట్‌లో గిరాకీ పెరిగింది. భర్త, చుట్టుపక్కల అమ్మాయిలు, చదివిన డిగ్రీ.. ఇవే కాదు ఫ్లిప్‌కార్ట్‌లోని ‘నైపుణ్యాల అభివృద్ధి విభాగం’ కూడా రీతూకు గైడెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఆదాయం.. (చెబితే బాగుంటుందా? మగవాళ్ల ఇన్‌కమ్ అడక్కూడదంటారు. ఆడవాళ్ల ఇన్‌కమ్‌ను మాత్రం మనం ఎందుకు చెప్పుకోవాలి? అయినా సరే.. చెప్పుకోవాల్సిందే.) ప్రస్తుతం ఆమె ఆదాయం నెలకు.. ఎనిమిది లక్షల రూపాయలు! ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని జీతాలు కలిపితే ఇంత మొత్తం వస్తుంది! చిన్న టీమ్‌తో కలిసి పనిచేస్తోంది రీతూ.
ఆమె పుట్టింటి పేరు రీతూపాల్. ఆ పేరుతోనే ‘రీతూపాల్ కలెక్షన్’తో తన బ్రాండ్‌కు ఒక ఇమేజ్ తెచ్చుకుంది. డబ్బు కాదు కానీ, ‘‘నా పేరు అందరూ చెప్పుకోవాలి’’ అని ఆమె ఆశ. అది పెద్ద ఆశేం కాదు. ఇప్పటికే రీతూపాల్ హ్యాండ్‌బ్యాగ్స్‌కి ఒక గుర్తింపు వచ్చింది. ఒక్కో బ్యాగ్ ధర.. ఫీచర్స్‌ని బట్టి 200 నుంచి 15 వందల రూపాయల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మొదటి నెలలో రీతూ సంపాదన 11 లక్షలు! ఆ లెక్క ఆమె చూసుకోలేదు. తర్వాతి నెల నుంచీ ఆమె చేతికొస్తున్న డబ్బు 7 నుంచి 8 లక్షల మధ్య నిలకడగా ఉండడం మొదలైంది. ఆ లెక్కా చూసుకోలేదు రీతూ. మరేం చూసుకుంటోంది. నెలకు కనీసం 20 లక్షలైనా సంపాదించాలని నవ్వుతూ అంటోంది.రీతూ.. బిజినెస్ ప్రయత్నాల్లో ఉందని తెలిసినప్పుడు బంధువులంతా ‘అవ్వ’ అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. ఇప్పుడూ నొక్కుకుంటున్నారు.. ‘అవునా.. మన రీతూ అంత సంపాదిస్తోందా?’ అని.
Comments
Please login to add a commentAdd a comment