పిల్లల ఆరోగ్యం కోసం... ఈ జాగ్రత్తలు! | Health care for children ... this! | Sakshi
Sakshi News home page

పిల్లల ఆరోగ్యం కోసం... ఈ జాగ్రత్తలు!

Published Fri, Feb 19 2016 10:31 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

Health care for children ... this!

లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
 
మా బాబు వయసు పన్నెండేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్‌లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరగడంతో పాటు ఊబకాయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి.
 - నళిని, కందుకూరు

 ఈమధ్య ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు పత్రికలూ, టీవీల వంటి వాటి ద్వారా అందుతూ ఉన్నాయి. కానీ ఇంకా చాలా మంది అంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. దాంతో పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

 పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతో పాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ర్పభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు పన్నెండేళ్ల పాటు జరిగిన అధ్యయనంలో తెలుస్తోంది. 2003లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలు 12.8 శాతం ఉండగా... 2015 నాటికి వారి సంఖ్య 26.6 శాతానికి పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇలా పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం ద్వారా పిల్లలను పైన పేర్కొన్న లైఫ్‌స్టైల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్‌డ్ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు.
 
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్
లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్
కిమ్స్ హాస్పిటల్స్
సికింద్రాబాద్
 
న్యూరాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 50 ఏళ్లు. నాకు కాళ్లు పాదాల నుంచి మోకాళ్ల వరకు తిమ్మిర్లుగా ఉంటున్నాయి. నేను నాలుగు నెలలుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను. కింద కూర్చొని టక్కున పైకి లేవలేకపోతున్నాను. చేతులు కూడా బలహీనమైపోతున్నాయి. ఎన్ని మందులు వాడినా రోజురోజుకీ బలం తగ్గిపోతోంది. చేతులు, కాళ్లు సన్నబడిపోతున్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పగలరు.
 - రమేశ్, నిడదవోలు

మీకు షుగర్, హైబీపీ వంటివి ఉన్నాయా లేదా అన్నది మీ ఉత్తరంలో తెలపలేదు. షుగరు వ్యాధి ఉన్నవారిలో కూడా మీరు చెబుతున్న లక్షణాలు ఉండవచ్చు. షుగరు లేదంటే మీకు క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీ న్యూరోపతీ (సీఐడీపీ) అనే జబ్బుతో బాధపడుతుండవచ్చు. నరం మీద ఉండే పైతొడుగు ఊడిపోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది. ఇది వచ్చిన వాళ్లకు కాళ్లు, చేతులతో తిమ్మిర్లు ఉండటం, నడుస్తున్నప్పుడు పాదాలకు స్పర్శ తెలియకపోవడం, కళ్లు మూసుకుంటే కింద పడిపోవడం, కింద కూర్చొని పైకి లేవలేకపోవడం, చేతులలోని బరువైన వస్తువులను తలపైకి ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నర్వ్ కండక్షన్ స్టడీ అనే పరీక్ష ద్వారా ఈ జబ్బు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. కొన్ని రక్తపరీక్షల ద్వారా ఏ కారణం వల్ల ఇలా నరాలు దెబ్బతిన్నాయన్న విషయం తెలుసుకోవచ్చు. స్టెరాయిడ్ ఇంజెక్షన్, ప్లాస్మా పెరిసిసి, ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్ ద్వారా ఈ జబ్బును తగ్గించవచ్చు. అయితే ఆ తర్వాత కూడా కొన్ని నెలల నుంచి, సంవత్సరా పాటు టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ జబ్బును దాదాపు నయం చేయవచ్చు. మీరు కొన్ని నెలల నుంచి ఈ జబ్బుతో బాధపడుతున్నారని చెబుతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా న్యూరాలజిస్ట్‌కు చూపించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకుంటే ఇది నయమయ్యే అవకాశాలు ఎక్కువ.

మా అబ్బాయికి పదేళ్లు. ఆరో ఏడాది నుంచి నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కూర్చొని పైకి లేవలేకపోతున్నాడు. కాళ్ల పిక్కలు లావయ్యాయి. మా అబ్బాయికి జబ్బు నయమయ్యే అవకాశం ఉందా? నాది, మా ఆయనది చాలా దగ్గరి సంబంధం. మేనరికం వల్ల ఈ జబ్బు వచ్చిందంటున్నారు. నిజమేనా?
 - సుశాంతి, నకిరేకల్లు

 
మీ అబ్బాయి డీఎమ్‌డీ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. మేనరికం వంటి దగ్గరి సంబంధాలలో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల, జన్యుపరమైన కారణాలతో ఈ జబ్బు వచ్చిందన్న మాట వాస్తవమే. ఇది చిన్నవయసులోనే ప్రారంభమై, పిల్లలకు పదిహేనేళ్లు వచ్చేసరికి పూర్తిగా బలహీనమయ్యేలా చేస్తుంది. దీనికి సరైన మందులంటూ ఏవీ లేవు. ఈ జబ్బు తీవ్రతను స్టెరాయిడ్స్ వల్ల తగ్గించవచ్చు. అయితే వాటిన సైడ్‌ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫిజియోథెరపీ ద్వారా కండరాలు బలహీనం కాకుండా చేయవచ్చు. ఒకసారి వచ్చాక జబ్బును తగ్గించడం సాధ్యం కాదు. మీరు అధైర్యపడకుండా ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
డాక్టర్ మురళీధర్ రెడ్డి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
డర్మటాలజీ కౌన్సెలింగ్
 నా వయసు 48 ఏళ్లు. నా కుడిచెంప మీద మూడువారాల క్రితం ఒక మొటిమ వచ్చింది. దాన్ని గట్టిగా నొక్కాను. అప్పట్నుంచి దాని పరిమాణం పెరిగి నల్ల మచ్చలా మారింది. చాలా అసహ్యంగా కనిపిస్తోంది. నాకు తగిన చికిత్స సూచించండి.
 - నవీన్, అనంతపురం  

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది ‘యాక్నే వల్గారిస్’అలా అనిపిస్తోంది. దాన్ని గిల్లకండి. అలా చేస్తే ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. మీరు కొన్నిరోజులు  అజిథ్రోమైసిన్ 500 ఎంజీ వంటి యాంటీబయాటిక్ మాత్రలను మూడురోజులకు ఒకసారి చొప్పున మూడు వారాల పాటు వాడాలి. మీరు క్లిండామైసిన్, అడాపలీన్  కాంబినేషన్ ఉండే జెల్‌ను రోజూ రాత్రివేళ మొటిమపై రాయండి. ఎస్‌పీఎఫ్ 40 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్‌ను ప్రతి మూడు గంటలకోసారి చొప్పున ప్రతిరోజూ ముఖంపై రాసుకోండి.
 
 నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. అది ఆనుకునే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయినా ఎలాంటి  ఫలితం లేదు. ముక్కుకు ఇరువైపుల ఉన్న ఈ మచ్చలు తగ్గిపోయే మార్గం చెప్పండి.
 - ధరణి, విశాఖపట్నం

 కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది రాసుకోపోవడం (ఫ్రిక్షన్) వల్లఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి.  మీకు వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్ లెన్స్ వాడండి  కోజిక్ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి  అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డెర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డెర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి
హైదరాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement