ఆటిజం తగ్గుతుందా? | health councling | Sakshi
Sakshi News home page

ఆటిజం తగ్గుతుందా?

Published Tue, Oct 18 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

ఆటిజం తగ్గుతుందా?

ఆటిజం తగ్గుతుందా?

హోమియో కౌన్సెలింగ్

 

మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి.  - నిహారిక, కొత్తగూడెం
ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు,  ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు  ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు.  మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు...  అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం  నలుగురిలో కలవడలేకపోవడం  ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం  వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

 

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్

 

కొలెస్ట్రాల్ అదుపు చేసుకోవడం ఎలా?
కొలెస్ట్రాల్ కౌన్సెలింగ్

నా వయసు 48 ఏళ్లు. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే రక్తంలో పెరిగిందని రిపోర్డు వచ్చింది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వస్తాయని అందరూ అంటున్నారు. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపు చేసుకోవాలో సలహా ఇవ్వండి.  - యాదగిరి, నకిరెకల్లు
కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇందులోని ఎల్‌డీఎల్ అనే రకాన్ని చెడుకొలెస్ట్రాల్‌గా చెబుతారు. ఎందుకంటే సాధారణంగా రక్తనాళాలు ఒక మంచి రబ్బర్ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా మంచి ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్‌డీఎల్ అనేది రక్తనాళంలోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగగలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్క్లిరోసిస్ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఇది రక్తనాళంలోపల గారలా పేరుకుపోతున్న చెడుకొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడుకొలెస్ట్రాల్ చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతాయి. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు.

 
ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్‌ఎటాక్ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ అయినా హెచ్‌డీఎల్ పెరుగుతుంది. అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి.

 

డాక్టర్  సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement