స్వర్గనరకాలు భూమి మీదే ఉన్నాయి! | hell and heaven presents on earth! | Sakshi
Sakshi News home page

స్వర్గనరకాలు భూమి మీదే ఉన్నాయి!

Published Fri, Aug 15 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

స్వర్గనరకాలు భూమి మీదే ఉన్నాయి!

స్వర్గనరకాలు భూమి మీదే ఉన్నాయి!

పరమార్థం
 
జీవితంలో సుఖం ఒక్కటే ఉండాలనుకునే వారికి అడుగడుగునా అసంతృప్తే మిగులుతుంది. అనుభవాలు నరక సదృశం అవుతాయి.జీవితంలో దొరికిన దానితో సంతృప్తి పడేవారికి, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోగలిగిన వారికి అనుక్షణం స్వర్గమే.
 
మనలో చాలామంది స్వర్గనరకాలను నమ్ముతారు. అవి నిజంగా ఉన్నాయా? అనే ప్రశ్న కూడా ఒకోసారి మనకు కలుగుతుంది. అయితే పైలోకాల మాట ఎలా ఉన్నా ‘‘భూమి మీద నువ్వున్నది స్వర్గమా? నరకమా? అన్నది నీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఒకరికి మనశ్శాంతి లేదు. ఎవరో ఏదో అన్యాయం చేశారనో, మరేదో కారణం వల్లనో అతడి మనసు గాయపడింది. అలజడి, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, అసూయ, ద్వేషం, కోపం.. ఇలా ఎన్నో అతడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.
 
అంటే ఇప్పుడు అతడి మనసు నరకప్రాయం అయిందని అర్థం. ఇక్కడ నమ్మకంతో పని లేదు. అతడికది స్వానుభవం. ఇంకొకరి మనస్సులో నిర్మల ప్రశాంతత, ప్రేమ, కరుణ.. ఇలాంటివి నెలకొని ఉన్నాయి. ఇక్కడా నమ్మకంతో పనిలేదు. ఒక అపురూమైన అనుభూతితో మనసు నిండి ఉంటుంది. అదే అతడికి స్వర్గం. అతడికది స్వానుభవం.
 
ప్రతి అనుభూతినీ పరిపూర్ణ సంతోషభావంతో గ్రహించగలిగిన స్థితప్రజ్ఞుడు ఎంతటి దుఃఖ భాజనుడితోనైనా నిశ్శబ్దంగా సంభాషించగలుగుతాడు. అతడి దుఃఖంలో పాలుపంచుకుంటాడు. సుఖాల్ని అందరికీ పంచిపెడతాడు. అతడిని అతడి నరకంలోంచి లాగి, తన స్వర్గంలోకి వెంటపెట్టుకుని వెళతాడు.
 
ఇది సుఖపడే కాలం, ఇది బాధపడాల్సిన సమయం అంటూ ఎవరికీ జీవితంలోనూ ఎక్కడా రాసిపెట్టి ఉండవు. అంతా వ్యక్తి వర్తమాన స్థితిపై ఆధారపడి ఉంటుంది. తాను పరిమళాల్ని వెదజల్లాలని ఏ పువ్వూ ప్రత్యేకంగా అనుకోదు. అందరిని తన సువాసనలతో సరిసమానంగా సంతోషపరచడం దానికది ప్రకృతి ధర్మం. అలాగే తనకు ఉన్నంతలో తోడి వారి అవసరాలు తీర్చడం ఒక నిర్మల నిస్వార్థ హృదయానికి జన్మతో వచ్చే త్యాగ గుణం.
 
స్వార్థంతో, అహంకారంతో, అసూయతో తాను సుఖపడకుండా, ఇతరులనూ సంతోషపెట్టకుండా తన బతుకును దుఃఖభరితం చేసుకునే మనిషి జీవితం అతడికే కాకుండా అందరికీ దుర్భరమే. మనిషి మరణానంతరం స్వర్గ నరకాల్లో దేనికి ప్రస్థానం జరుపుతాడో అన్న మీమాంసతో వర్తమానాన్ని అశాంతి పాలు చేసుకోనవసరం లేదు. ఇక్కడే ఈ భూమి మీదే స్వర్గ నరకాలలో దేనిని ఎంపిక చేసుకోవాలన్నా ఆ భగవంతుడు మనిషికి సమానమైన అవకాశాలు అడుగడుగునా సమకూరుస్తూనే ఉంటాడు. దేనిలో ప్రవేశించటమా అన్నది మనిషి చేతుల్లోనే ఉంది.
- శొంఠి. విశ్వనాథం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement