
షూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన పికూ సినిమాలో అమితాబ్ మోషన్ టెన్షన్‌కి దీపికా పదుకొనే రియాక్షన్
ప్రేమ కడుపులో దాచిపెట్టుకుంటే సరిపోదు. అలా చేస్తే ప్రేమ కూడా మురిగిపోతుంది. ఎందుకంటే ప్రేమకీ కోపానికీ పెద్ద తేడాలేదు. కోపం మనసులో వుంచుకుంటే బుర్ర పాడైపోతుంది. ప్రేమ మనసులో వుంచుకుంటే బొర్ర పాడవుతుంది. సినిమా చూసి బయటకు వచ్చిన చాలా మందికి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినంత రిలీఫ్ వుంది. మోషన్‌లో ఇంత ఎమోషన్ ఉందని పికూ చెప్పింది.అతడు కలకత్తా నుంచి బయటపడ్డాడు కానీ అతడి నుంచి కలకత్తా మాత్రం బయట పడలేదు.
టాయిలెట్ గది మూసుకొని ఉంది. లోపల ముసలి తండ్రి ఉన్నాడు.బయట కూతురు గస పోసుకుంటూ అతణ్ణి తిట్టి పోస్తోంది. ‘ఈ ముసలాయన ఊరికే ఉండలేడా? ఎందుకు చీటికి మాటికి నా ప్రాణం తీస్తాడు? ఈ వయసులో సైకిల్ వేసుకొని ఎక్కడకు వెళ్లినట్టు? కింద పడి ఏ కాలో చెయ్యో విరిగితే ఎవరు పడాలి? ఇప్పుడు చూడండి. ఏం ఎరగనట్టుగా లోపలికెళ్లి తలుపేసుకున్నాడు. ఇంకాసేపటికి మొదలవుతుంది గోల. మొదట ఊపిరాడ్డం లేదు అంటాడు. ఆ తర్వాత ఛాతీలో నొప్పి అనో గుండెకు తూట్లు పడ్డాయనో’....
లోపల పెద్ద చప్పుడయ్యింది. కూతురు ఆశ్చర్యపోయి తిట్టడం ఆపేసింది. అది ఫ్లష్ చేసిన చప్పుడు. తండ్రి తన జీవితంలో అంత పెద్దగా ఎప్పుడూ ఫ్లష్ చేసి ఎరగడు. తలుపు తెరుచుకుంది. తండ్రి బయటికొచ్చాడు. అతడు తండ్రి కాదు. విశ్వాన్ని జయించిన అలెగ్జాండర్.
‘ఏంటీ’... అంది కూతురు కుతూహలంగా. ‘అయ్యింది. ’ ‘అవునా?’‘అవును. ఇంత హాయిగా సుఖంగా సులభంగా ఎప్పుడూ అవలేదు. నెవర్. ఆహా... ఎంత నిశ్చింతగా ఉంది’ పొట్ట మీద చేతులేసుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. పెదాల మీద చిర్నవ్వు. కూతురు కూడా కోపాన్ని వీడి తండ్రినే చూస్తూ మెల్లగా నవ్వింది.
డెబ్బయ్యేళ్ల ముసలాడతడు. ఒక్కతే కూతురు. ఆషొ, మాషో, భాషో అని షకారాలు మాట్లాడే బెంగాలీ కుటుంబం. కలకత్తా నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడింది. తండ్రికి కూతురు, కూతురికి తండ్రి, వాళ్లకో పనివాడు. అంతే. తెల్లవారుతుంది. కాఫీ టీ అనే శబ్దాలు వినిపించవు. కూతురి గొంతు నుంచి ఒకటే మాట- అయ్యిందా? టాయిలెట్ నుంచి తండ్రి అదే సమాధానం- లేదూ. కడుపు మందం అతనికి. రోజూ పొద్దున్నే అవదు. ఒక్కోసారి రెండు మూడు రోజులకు కూడా అవదు. వయసు వల్ల ఉబ్బరమో లేక లోపల అది ఉండిపోవడం వల్ల ఉబ్బరమో తెలియదుకాని ముసలాయనికి ఎప్పుడూ కడుపు ఉబ్బరంగానే ఉంటుంది. అమ్మాయ్... డాక్టర్‌గారికి ఒకసారి ఫోన్ చెయ్... పోనీ మందేం మార్చాలో అడుగు... లేదంటే తిండేమైనా మార్చమంటావా..... రోజూ సవాలక్ష ప్రశ్నలు. ఆఫీస్‌లో ఉంటే మెసేజ్‌లు. ఒక్క సమాధానం కోసం. కాదు... ఒక్క సంతృప్తికరమైన విరేచనం కోసం. అవదు. అవకపోవడం వల్ల ముసలాయనకి ఇరిటేషన్. పనిమనిషి ఫినాయిల్ ఎత్తుకుపోయిందని తిడతాడు. పక్కింటామె మాటవరసకి పలకరిస్తే కరుస్తాడు. ఇంటికి స్వయంగా భార్య చెల్లెలు వచ్చినా పుల్లవిరుపు మాటలే. అందరికీ ఆయన యాగీ తెలుసు. కాని ఇంటికి రాక తప్పుతుందా? వయసొచ్చిన కూతురి కోసం. తండ్రి కోసం అన్నీ వదులుకున్న పికూ అనే ఆ ఆడపిల్ల కోసం.
ముసలాయనికి అన్నీ అనుమానం. అలోపతి
వాడడు. హోమియోపతే పడాలి. ఏదంటే అది తినడు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఖిచిడీయే తినాలి. ప్రతి పూట బిపి చెకింగ్ తప్పదు. దాంతోపాటు కూతురు ఎవరితోనైనా ప్రేమా పెళ్లీ అంటుందేమోననే చెకింగూ తప్పదు. ‘నువ్వు ఇలాగే ఉండు. స్వతంత్రంగా ఉండు. అవసరాల కోసం కావాలంటే ఎవరితోనైనా సంబంధం పెట్టుకో. కాని పెళ్లి మాత్రం చేసుకోకు’... ఇదీ ముసలాయన గోల. వచ్చిన సంబంధం అంతా పాడు చేస్తుంటాడు. కూతురికి ఇదంతా నలుగుబాటు. తండ్రిని వదులుకోలేదు. అలాగని ఇంకొకరిని కోరుకోకుండా ఉండనూ లేదు. ఆ చిరాకు అందరి మీదా చూపిస్తుంటుంది. పెద్ద పెద్ద కళ్లు, పలుచటి పెదాలు... ఏం లాభం? నవ్వే మర్చిపోయింది. ఒకటే టెన్షన్. తండ్రి టెన్షన్. తండ్రికి? కూతురు టెన్షన్. నిజంగా ఈ చిక్కుముడి వీడదా?
అయితే ఇది చిక్కుముడి కాదు. ఊరితో ముడిపడిన ముడి. పేగుతో ముడిపడిన ముడి. మూలాలతో ముడిపడిన ముడి. ఆ ముడి అర్థం కాకపోతే కథ అర్థం కాదు. ‘నాకు నా భార్యంటే ఇష్టమే. ఆమెను ప్రేమిస్తా. కాని ఆమె నా కూతురికి ఇవ్వాల్సినంత ప్రేమ ఇవ్వలేదు’ అనంటాడు ముసలాయన ఒక సందర్భంలో. కూతురంటే అంత ప్రేమ అతడికి. భార్య చనిపోయింది. కూతురు తల్లిలేని పిల్ల అయ్యింది. అందుకని తనే తల్లీదండ్రీ అయ్యాడు. కూతురు ఎదిగొచ్చింది. ఆర్కిటెక్ట్ అయ్యింది. ఢిల్లీకి చేరుకుంది. ఆమెను వదిలి ఎలా ఉండగలడు. కనురెప్పలా వెంటపడి వచ్చాడు. అయితే అందుకోసం తాను పుట్టి పెరిగిన కలకత్తా నగరాన్ని, ఆ ఇరుకు వీధులని, ఆ రంగు వెలసిన ట్రామ్‌లని, తల్లి పేరు మీద తండ్రి ఎంతో ఇష్టపడి కట్టించిన ఎర్రరంగు గోడల ‘చంపాకుంజ్’ అనే బంగ్లాని వదల్లేక వదిలి వచ్చేశాడు. ఆ వెలితి ఉండిపోయింది. అప్పటికీ ఢిల్లీలో బెంగాలీలు ఎక్కువగా ఉండే చిత్తరంజన్ పార్క్ ఏరియాలో చేరాడు. ఇంట్లో రామకృష్ణ పరమహంస, శారదాదేవి పటాలు పెట్టుకున్నాడు.
బెంగాలి మాటా తీరూ వదల్లేదు. తిండీ తిప్పా మార్చలేదు. అయినా సరే వెలితే. ఏళ్ల తరబడి వచ్చిన అలవాట్లు ఉంటాయి. చాదస్తాలు ఉంటాయి. పైగా చెవుడు. అల్లుడెవడైనా వస్తే తనను యాక్సెప్ట్ చేస్తాడో చెయ్యడో... ఈ ముసలాణ్ణి ఎక్కడైనా వదిలించుకో అని కూతురికి దూరం చేస్తాడో ఏమో అదొక భయం. వయసు మీద పడింది... చావుకు దగ్గరవుతున్నాడు... మంచాన పడి కూతురికి శ్రమ ఇస్తాడో ఏమో... ప్రాణం మీదకు వస్తే ఆస్పత్రుల్లో పెట్టి ఆ సర్జరీలు ఈ సర్జరీలు అని హింసిస్తారో ఏమో... బతికించడానికి చంపుతారో ఏమో... ఇదొక అనుమానం. ఇవన్నీ పక్కనపెట్టి కలకత్తాలోని బంగ్లాని కూతురు అమ్మేద్దామని చూస్తోంది. ఎంత పెద్ద నిర్ణయం. మూలాల్ని పెకలించి వేస్తుందా? వద్దు అని గట్టిగా చెప్పగలడు. కాని వినకపోతే? అదొక ఆందోళన. పాపం సాదాసీదా స్వచ్ఛమైన మనిషి కదా. ఈ మలినాలన్నీ మెదడులో చేరాయి. అది మలబద్ధకంగా మారింది. క్రానిక్ కాన్‌స్టిపేషన్. దీని నుంచి విముక్తం కావాలి.
తనకు అర్థమైపోయింది. మొన్న ఒక పెగ్గు బిగించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాక బండి తుదకు చేరింది అని తెలిసిపోయింది. అందుకే కూతురిని శతపోరి కలకత్తా బయల్దేరదీశాడు. విమానంలో కాదు. ట్రైన్‌లోనూ కాదు. ట్యాక్సీలో. కాని వీళ్ల భయానికి ఒక్క డ్రైవరూ దొరకడు. క్యాబ్ కంపెనీ ఓనరే దయతలచి డ్రైవర్‌గా వస్తాడు. కూతురులాగే అతడూ ముసలయాన్ని పైపైన చూశాడు. పైగా విరేచనానికి సలహాలు కూడా ఇచ్చాడు. తులసీ, పుదీనా నీళ్లలో వేసి వేడి చేసి తాగండి. ఊహూ. విరేచనం కాదు. ఇండియన్ పద్ధతిలో కింద కూచున్నట్టుగా కూచోండి. ఊహూ. అప్పుడూ కాదు. పోనీ ప్రతీదీ గేదలానో ఆవులానో బాగా నమిలి మింగండి. దీనికీ ఊహూనే.
కలకత్తా వచ్చింది. మాతృభూమి గాలి అచ్చు అమ్మలాగే ముసలాయన ముఖాన్ని తాకింది. ఆ ఊరు ఆ వీధులు ఆ మనుషులు... తనవాళ్లు. ఆ గంగ. తనది. ఆ సమున్నత హౌరా వంతెన. తనదే. మరుసటిరోజు తెల్లవారుజామున పనివాడి సైకిల్ తీసుకొని సంతోషంగా కలకత్తా వీధులన్నీ తిరిగాడు. ఆ వీధుల నిండా ఎన్ని జ్ఞాపకాలో. బాల్యపు జ్ఞాపకాలు, తల్లిదండ్రుల జ్ఞాపకాలు, భార్య జ్ఞాపకాలు, తానంటూ ఒక మనిషిగా జీవించిన జ్ఞాపకాలు... వాటిని గుండెల నిండా నింపుకున్నాడు. మనసు నిండింది. ఆత్మ నిండింది. కడుపు కూడా. ఇంటికి వచ్చాడు. విరేచనం. సుఖ విరేచనం. ఇంతకాలం వేధిస్తున్న వెలితి, అసౌకర్యం తల్లిదండ్రుల సన్నిధి వంటి తన ఇంటికి చేరుకున్నాక ఆ ముసలాయనకు తీరింది. ఆ మరుసటిరోజు తెల్లవారుజామున టాయిలెట్ అవసరం ఏర్పడలేదు. కలకత్తా ఆయువు ఒకటి కలకత్తాలో కలిసిపోయింది.
ఇంట్లో అమ్మ ఉంటుంది. నాన్న ఉంటాడు. అమ్మా నాన్నలు ఉంటారు. ఏదో నస పెడుతుంటారు. కాని జాగ్రత్తగా వినాలి. వాళ్ల మాటలకు అర్థాలు వేరు. వారి కోపానికి అర్థాలు వేరు. వారి ఆందోళనలకు అర్థాలు వేరు. వారి అశ్రువులకు కూడా అర్థాలు వేరు. జుట్టు తెల్లబడ్డ పసివాళ్లు వారు. పాలపళ్లు రాని కన్నబిడ్డలను కళ్లల్లో పెట్టుకుని పెంచి పెద్దవాళ్లనూ ప్రయోజకులనూ చేసి అలసిపోయి ఇప్పుడు పసివాళ్లయిపోయి ఉంటారు. వాళ్ల చిన్న చిన్న వెలితులు కూడా పెద్ద సమస్యలైపోతాయి. కొంచెం పట్టించుకోవాలంతే. మా అమ్మ కదూ... బుజ్జికదూ అనాలంతే. అంతకు మించి ఆశించరు.
తండ్రి మనసులో ఉన్న వెలితి ఏమిటో కూతురు కనిపెట్టింది. బంగ్లా అమ్మలేదు. అంతేకాదు, కర్మంతరాల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి తండ్రి ఆత్మ సంతోషపడేలా మరో చిన్న పని కూడా చేసింది. అప్పటి వరకూ వాళ్ల ఇంటి పేరు- ఆఏఅఓఅఖ ్కఅఔఅఇఉ.
బెంగాలీ ఉచ్ఛారణకు తగినట్టుగా ‘అ’ బదులు ‘ై’ పెట్టి దానిని ఆఏఅఓైఖ ్కఅఔఅఇఉగా మార్చింది.ఆమె మారినట్టే. ఇక మనం మారాల్సి ఉంది.
- సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి