ఉదయం వేళ మడమ నొప్పి!
హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 35 ఏళ్లు. నా బరువు 75 కేజీలు. ఆర్నెల్ల నుంచి ఉదయం లేవగానే మడమలో విపరీతమైన నొప్పి కారణంగా నడవలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే బరువు తగ్గాలని అన్నారు. ఎక్స్–రే తీసి, ఎముక పెరిగిందని అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – మాలతి, హైదరాబాద్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మడమ సమస్య. మన కాళ్లలో ప్లాంటార్ ఫేషియా అనే కణజాలం ఉంటుంది. అడుగులు వేసే సమయంలో ఇది కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో ప్లాంటార్ ఫేషియా చిన్న చిన్న దెబ్బలకూ డ్యామేజ్ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. మడమలో మేకులతో గుచ్చినట్లు, కత్తులతో పొడిచినట్లుగా ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది అరుదైన సమస్య కాదు. ప్రతి పదిమందిలో ఒకరు దీనితో బాధపడుతుంటారు.
కారణాలు : ∙ఊబకాయం / బరువు ఎక్కువగా ఉండటం ఎక్కువసేపు నిలబడటం, పనిచేస్తూ ఉండటం ∙చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ చురుకుగా పనిచేయడం ∙ హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో వచ్చే నొప్పికి ఇది ముఖ్యకారణం).
లక్షణాలు : ∙మడమలో నొప్పి అధికంగా వస్తుంది ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది ∙కండరాల నొప్పులు
వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్
చికిత్స : హోమియో విధానంలో ప్లాంటార్ ఫేషిౖయెటిస్‌కి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి, తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో రస్టాక్, పల్సటిల్లా, బ్రయోనియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
యానల్‌ఫిషర్ తగ్గుతుందా?
నా వయసు 63 ఏళ్లు. మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. ఆపరేషన్ లేకుండా హోమియోలో దీనికి చికిత్స ఉందా?
– హనుమంతరావు, కాకినాడ
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం కారణంగా మలవిసర్జన సాఫీగా జరగదు. అప్పుడు విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు వస్తాయి. ఈ పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువ. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది.
లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన తర్వాత మరో రెండు గంటల పాటు మలద్వారం దగ్గర నొప్పి, మంట.
వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్
చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. ఏ సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
మాటిమాటికీ యూరినరీ ఇన్ఫెక్షన్... మళ్లీ రాకుండా ఉంటుందా?
నా వయసు 28 ఏళ్లు. బరువు నార్మల్‌గానే ఉన్నాను.కానీ ఈ మధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. డాక్టర్ని సంప్రదిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ అన్నారు. ఇది మళ్లీ రాకుండా తగ్గుతుందా?– ఒక సోదరి, ఖమ్మం
మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.
అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు.
లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్ అంటారు.
కారణాలు : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు.
లక్షణాలు : మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం
చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి హోమియో మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్