వద్దంటే వద్దనే | How To Make The Festival Of Colours Memorable | Sakshi
Sakshi News home page

వద్దంటే వద్దనే

Published Wed, Mar 20 2019 12:27 AM | Last Updated on Wed, Mar 20 2019 12:27 AM

How To Make The Festival Of Colours Memorable - Sakshi

అంతేగా! వద్దంటే వద్దనే. ‘అర్థమైంది లెద్దూ. హోలీక్కూడానా!’.. అంటారా? అవును.. హోలీక్కూడానే. ‘టేకిటీజీ.. ఇట్స్‌ హోలీ’ అని తప్పించుకోలేం. ‘రంగు పడబడుతుంది’. బాయ్స్‌ మిమ్మల్నే. వినపడుతోందా? హోలీ కదా.. చూసీ చూడనట్లు పోతార్లెమ్మని చేతుల మీద, చెంపల మీద.. ఇంకా ఎక్కడెక్కడైనా... అమ్మాయిల్ని టచ్‌ చేశారా.. ‘అమిత్‌ ఇల్లు ఇదేనా?’ అని షీ టీమ్స్‌ దిగిపోతాయి. 

అమిత్‌ ఎవరనేనా! అర్జున్‌రెడ్డి లవర్‌ ప్రీతికి హోలీరంగులు పూసి వెళ్లిన అమిత్‌. అర్జున్‌రెడ్డి వెళ్లి కుమ్మేస్తాడు. గుర్తొచ్చిందా? రంగులు పూసి వెళ్లాక ఆ పిల్ల ఏడుస్తుంటే అర్జున్‌రెడ్డి వస్తాడు. నేరుగా ప్రీతి దగ్గరకి వెళ్లకండా, అక్కడున్న జూనియర్‌ స్టూడెంట్స్‌ దగ్గరికెళ్లి.. ఏం జరిగిందీ, ఎక్కడ పూసిందీ అడుగుతాడు. ఎక్కడెక్కడ పూసి వెళ్లాడో బిక్కుబిక్కుమంటూ చెప్తారు వాళ్లు. తర్వాతి సీన్‌లో అమిత్‌ దవడ పగిలిపోతుంది.‘ప్రతి అమ్మాయికీ ఓ అర్జున్‌రెడ్డి ఉంటాడు.. ఆమెకు ఇష్టం లేకుండా రంగు పూస్తే, పూసినవాడి దవడ పగలగొడతాడు’ అని కాదు ఈ సన్నివేశంలోని నీతి. ఇష్టం లేకపోతే రంగులు పూయొద్దని, రంగునీళ్లు చల్లొద్దని. ఇష్టం లేదని ఎలా తెలుస్తుంది? చెప్తారు వాళ్లు. ‘సారీ బ్రో’ అనో, ‘నాకిష్టం లేదు నో’ అనో చెప్తారు. నోటితో చెప్పలేకపోయినా ‘స్టే అవే ఫ్రమ్‌ మీ’ అనే ఫీలింగ్‌ వాళ్ల ముఖంలో కనిపిస్తుంది. అది నోటీస్‌ చెయ్యాలి. చెయ్యకుండా.. అమ్మాయి హోలీ అడుతోందని ఆమె దగ్గరకు వెళ్లి.. హోలీరే, హోలీరే అని గెంతులేస్తే.. వంతులవారీగా వచ్చి ఒకటిచ్చిపోతారు.. అమ్మాయికి అయినవాళ్లు, కానివాళ్లు కూడా.

అసలు వాళ్లంతా ఎందుకు? అమ్మాయే ఛెళ్లుమనిపిస్తుంది. ఎవరు సహిస్తారు? ఎవరో స్ట్రేంజర్‌. ముక్కూముఖం తెలీదు. మనుపు మాట్లాడింది లేదు. ఎప్పుడూ కలుసుకున్నది లేదు. బైక్‌ మీద వచ్చి, రంగులు చల్లేసి, రయ్‌మని వెళ్లిపోతే.. ఎక్కడో ఒకచోట దొరక్కపోతారా?! ఫోన్‌లో ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిపుచ్చుకుని లటుక్కున పట్టేస్తాయి షీ టీమ్స్‌. చిన్న కంప్లయింట్‌ చాలు. బాయ్స్‌.. పండగ పూట భయపెట్టడం కాదిది. భద్రం చెప్పడం. వంకల కోసం చూసే మీలోని కుంకలు కొందరు అమ్మాయిల్ని టచ్‌ చెయ్యడానికి హోలీ మంచి టైమ్‌ అనుకుంటారు. వాళ్లకు చెప్పండి. టైమ్‌ బాగోలేకపోతే కలర్‌ఫుల్‌ ఫెస్టివల్‌ కాస్తా.. బ్లాక్‌ అండ్‌ ఫెస్టివల్‌ అయిపోతుంది. నేరాల్ని, ఘోరాల్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చూపిస్తుంటారు కదా టీవీల్లో.. అలా! అమ్మాయిలు అబ్బాయిల్లా కాదు. వాళ్లు కొంచెం స్పేస్‌ కోరుకుంటారు. ఆ స్పేస్‌లోకి సొంతవాళ్లైనా రాకూడదనుకుంటారు. ‘ఆ స్పేస్‌ తగ్గించడానికే కదా హోలీ పండగ’ అనేవాళ్లూ ఉండొచ్చు.

కానీ పండగ కన్నా స్పేస్‌ ముఖ్యం అని అమ్మాయి అనుకున్నప్పుడు ఆమె స్పేస్‌ని రెస్పెక్ట్‌ చెయ్యాల్సిందే. టచ్‌ చెయ్యకూడదు. రద్దీ సిటీబస్సులో అనుకుని నిల్చున్నట్లు, అమ్మాయి పక్కన సీటు దొరికింది కదా అంటుకుని కూర్చున్నట్లు.. అదే ఫార్ములాతో హోలీ రోజు రంగులతో ఆమె స్పేస్‌లోకి చొరబడితే.. మన రంగు మన మీద పడినట్లే. శ్రీ కృష్ణుడు కూడా తెలిసిన ఆడవాళ్లతోనే హోలీ ఆడాడు కానీ, అపరిచిత మహిళల దాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఎంత ఆడినా ఆ గోపికలతోనే.. ఆ రాధమ్మతోనే. నందగ్రామం కృష్ణుడి బర్త్‌ప్లేస్‌. అక్కడికి దగ్గర్లోని బర్సానా విలేజ్‌ రాధమ్మ స్వగ్రామం. యూపీలోని ఈ రెండు ప్రాంతాలకీ హోలీ ఆడ్డం కోసమే పనిగట్టుకుని మరీ విదేశీ టూరిస్టులు వస్తుంటారు.

వాళ్లలో వాళ్లే హోలీ ఆడతారు. లోకల్‌ వాళ్లను టచ్‌ కూడా చెయ్యరు! అదొక భక్తిపారవశ్యపు ఉల్లాసంలా ఉంటుంది తప్ప స్వేచ్ఛగా టచ్‌ చెయ్యడానికి వీసాతో వచ్చినట్లు ఉండదు. మర్యాదగా ఉంటారు. గౌరవంగా ఉంటారు. వాళ్లతో మనవాళ్లూ అలాగే ఉంటారు. ఎవరైనా ఇష్టపడితే చెంప మీద చిన్న చిలకరింపు పొడి. అంతే. ఎక్కువగా బ్లూ, పింక్‌ రంగులు ఉంటాయి. హోలీకి ఒకరోజు సరిపోవడం లేదని ఇప్పుడు పదిరోజులు ఆడుతున్నారు. పండుగలు ఏవైనా.. మనుషుల మధ్య, మతాల మధ్య హద్దులు చెరిపేయడానికే. దీపావళి, ఈద్, క్రిస్మస్‌. కలిసిమెలిసి చేసుకునే పండుగలు. హోలీ కూడా అలాంటిదే. అంతరాలు లేని రంగుల లోకంలో విహరించడం. అయితే ఆ విహారంలో ‘టచ్‌’ అనే అపశృతి దొర్లకుండా జాగ్రత్త పడాలి. 

రంగునీళ్లు.. కర్రదెబ్బలు.. లడ్డూ ముక్కలు!
హోలీ పండగ అంటే ఎక్కడైనా రంగునీళ్లు చల్లుకోవడం చూశాం కానీ, ఇదేంటీ ఈ మహిళలు ఇలా కర్రలు తీసుకుని ఫెడేల్‌ ఫెడేల్మని కొడుతున్నారు..? నిజానికి వాళ్లు కొట్లట్లేదు కానీ, కొట్టినంత పని చేస్తున్నారంతే! సరదా సరదాగా కర్రలపెళ్లిలా సాగే ఈ ఉత్సవానికే లామార్‌ హోలీ అని పేరు. ఈ ఆచారం ఈ నాటిది కాదు. ద్వాపరయుగం నాటిది. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికల మీద రంగులు కలిపిన నీళ్లు చల్లబోతే, వారందరూ కలసి కృష్ణుడిని బెదిరించడానికి కర్రలు తీసుకుని వెంటబడ్డారట. కృష్ణుడంతటి వాడు రంగునీళ్లక్కడ వదిలేసి పరుగందుకున్నాడట. కృష్ణుడు వెళ్లిపోయాడులే, ఇక తమ మీద రంగునీళ్లు పడవని గోపికలు ఆ కర్రలన్నింటినీ పక్కన పడేసి కుచ్చిళ్లు దోపుకుని పనిలోకి దిగబోతుండగా అందరి కళ్లూ కప్పి ఎక్కడినుంచి వచ్చాడో ఏమో కృష్ణుడు వాళ్ల మీద రంగునీళ్లు పోయనే పోసేశాడట. దాంతో వాళ్లు చిరుకోపంతో మళ్లీ కర్రలందుకుని తరుముతుంటే, నగర వీధుల్లోకి పరుగుదీశాడట కృష్ణుడు. ఇది నగర ప్రజలందరి కంటా పడడంతో వాళ్లందరూ కూడా ఇదేదో బాగుందని ఆటలాడారట. అదే హోలీ వేడుక.

ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలతో, తమ నగరాన్ని ‘మధురంగా’ మార్చివేసిన అలనాటి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పోగొట్టుకోకుండా కొనసాగిస్తున్నారు మధురానగర వాసులు.  హోలీకి సరిగ్గా వారం రోజుల ముందు పురుషులందరూ కలసి బర్సానాలో మూడేళ్ల వాళ్లనుంచి మూడుకాళ్ల వాళ్లదాకా వయోభేదం లేకుండా పురుషులందరూ కలసి బకెట్లలో, కూజాల్లో, క్యానుల్లో... ఇలా తమ చేతికందిన వాటిలో రంగులు కలిపిన నీళ్లను నింపుకుని పాటలు పాడుకుంటూ వరసయిన, మనసైన మగువల వెంబడి పడతారు. వారు కూడా చిన్నా చితకా తేడా లేకుండా వెదురు కర్రలను చెక్కి, నున్నగా లాఠీల్లా తయారు చేసి, తమ వెంటపడుతున్న వాళ్లను కొడతామన్నట్లు బెదిరిస్తారు. మీ కర్ర దెబ్బలకు మేమేమీ భయపడేది లేదంటూ మీదికొచ్చి మరీ రంగునీళ్లు పోసేవాళ్లను తలా రెండు తగిలిస్తారు.

ఆ కర్రదెబ్బలు తగలకుండా తోలుతో తయారు చేసిన డాలు వంటి దానిని అడ్డం పెట్టుకుని కొందరు, నాలుగు దెబ్బలు తగిలితే తగిలినాయిలే, తమకు వరసైన వారిని రంగునీళ్లలో ముంచెత్తుదాంలే మరికొందరు రంగునీళ్లు చల్లుతూనే ఉంటారు. అదో సరదా వాళ్లకి. దీనినే లామార్‌ హోలీ పిలుస్తారు అక్కడివాళ్లు. తమ చేత ఇలా కర్ర దెబ్బలు తిన్న మగవాళ్లకి లడ్డూలు తినిపిస్తారు ఆడవాళ్లు. దానికి లడ్డూ హోలీ అని పేరు. ఇక అసలు సిసలు హోలీ రోజున మాత్రం అందరూ రంగేలీ మహల్‌ వద్ద కాచుకుని కూర్చుంటారు రంగులతో, రంగునీళ్లతో, మొతం్త మీద ఈ పండుగ చాలా ఉల్లాసంగా జరుగుతుంది బార్సానా, మధురలలో. 

– డి.వి.ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement