కుక్కను చూసి మొరుగుతాడు..!
అతడి పేరు రూడీ రాక్. మిమిక్రీలో దిట్ట. ప్రత్యేకించి జంతువుల అరుపులను అనుకరించడంలో నేర్పరి. దాదాపు ఐదారు శునకజాతుల అరుపులను ప్రాక్టీస్ చేశాడు. ఆ జాతుల శునకాలను మచ్చిక చేసుకొని.. వాటి దగ్గర అచ్చం అలాగే అరిచాడు. (మొరిగానని అతడు అంటాడు). వాటిల్లో ఒక్కో శునకం ఒక్కో విధంగా రియాక్ట్ అయ్యింది. కొన్నేమో బెదిరి పారిపోయాయి. తమకు అలవాటు అయిన మనిషి మాట్లాడకుండా అచ్చంతమలాగే మొరిగే సరికి అవి షాక్ అయి పారిపోయాయి.
మరికొన్ని ఏమో రాక్ పై విరుచుకుపడ్డాయి. అతడు ఉన్నట్టుండి మొరిగే సరికి అవి కూడా అందుకు దీటుగా స్పందిం చాయి. మరికొన్ని జాతి కుక్క పిల్లలు మాత్రం అర్థం కానట్టుగా ప్రవర్తించాయి. రాక్ మొరుగుతున్నట్టుగా అరుస్తున్నా.. ఆ శబ్దాన్ని అవి అర్థం చేసుకోక అతడిని తమ యజమానిగా భావించి ఆడుకోవడానికి ప్రయత్నించాయి.
ఇంకొన్ని మాత్రం ఆ వీడియో సెటప్‌ను, రాక్ అరుపులను చూసి ‘ఏం జరుగుతోందిక్కడ..’అన్నట్టుగా చూశాయి. దాదాపు ఐదారు శునకజాతులతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రాక్ రూపొందించి యూ ట్యూబ్ లోకి అప్‌లోడ్ చేసిన ఈ వీడియో అందరినీ అలరిస్తోంది. ఈ వీడియోలో రాక్ శునకాలను అనుకరించడం ఒక ఎత్తు అయితే.. ఇతడి అరుపులను చూసి శునకాలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు మరో ఎత్తు.