![నిన్నలా నువ్వులా!](/styles/webp/s3/article_images/2017/09/4/81469126166_625x300.jpg.webp?itok=dq3WXJYY)
నిన్నలా నువ్వులా!
అందరిలో ఫ్రాక్ ఉంటుంది చిన్నప్పుడు వేసుకున్న నాన్న కొనిపెట్టిన అమ్మ తొడిగించిన అన్నయ్య సవరించిన అందరూ మెచ్చిన ఫ్రాక్ ఉంటుంది. పెళ్లీడు వచ్చిన మేనకోడలిని చూసిన మేనమామ ‘ఏంట్రా! నిన్ననే నిన్ను ఫ్రాక్‌లో చూసినట్టు అనిపిస్తుంది’ అన్నమాట అందరిళ్లలో వినపడేదే! బాల్యానికి సీతాకోక చిలుక రెక్కలలాంటివి ఫ్రాక్‌లు. ఫ్రాక్ వేసుకుంటే నిన్నలా ఉంటావు. నువ్వులా ఉంటావు. నవ్వుతూ ఉంటావు.
చిన్నపిల్లలే కాదు టీనేజ్, యంగేజ్ అతివల డ్రెస్ జాబితాలోనూ ఎప్పుడూ వింటూ ఉండే పేరు ఫ్రాక్. ముచ్చటగా పురివిప్పిన నెమలిలా నయనానందం చేసే పొట్టి డ్రెస్‌నే ఫ్రాక్‌గా చెబుతుంటాం. లాంగ్‌గా ఉండే ఫ్రాక్‌ని గౌన్‌గా పలుకుతుంటారు. అలాగే చైల్డ్ డ్రెస్ లేదా లైట్ ఓవర్ డ్రెస్ అని కూడా అంటుంటారు. 16వ శతాబ్దిలో ఈ డ్రెస్ పుట్టినప్పటికీ దశల వారీగా అడుగులు వేస్తూ ఇంత దూరం ప్రయాణించడానికి చాలానే కష్టపడింది ఫ్రాక్. 20వ శతాబ్దం వరకు ఉమెన్స్ గౌన్ లేదా ఫ్రాక్ అనే పేరు స్థిరపడటానికి రకరకాల రూపాలు మార్చుకుంది.
16-17వ శతాబ్దిలో ఫుల్ లెంగ్త్‌తో.. లూజ్ ఔటర్ గార్మెంట్‌గా ఫార్మ్ వర్కర్స్‌కోసం బ్రిటన్ లో పుట్టింది ఫ్రాక్. మందపాటి క్లాత్, పెద్ద కాలర్ నెక్‌తో భారంగా ఉండేది. దీనిని మగవారే వాడేవారు.
18వ శతాబ్దిలో బ్రిటన్, అమెరికాలో మెన్స్ కోసం అన్‌ఫిటెడ్ ఫ్రాక్స్ వచ్చాయి. 19వ శతాబ్ది నాటికి బ్రాడ్ కాలర్, వెయిస్ట్ పాకెట్స్.. వంటి అదనపు హంగులు చేరాయి. దీనిని ‘ఫ్రాక్ కోట్’గా పురుషులు ధరించేవారు. వీటి పొడవు మోకాళ్ల వరకు, ఇంకా కింది వరకు కూడా ఉండేవి.
నావికులు, చేపలు పట్టేవాళ్లూ ఈ తరహా ఫ్రాక్ కోటును ఉపయోగించేవారు. 19 శతాబ్ది చివరలో 20 శతాబ్ది మొదట్లో సరైన ఫిటింగ్ అవసరం లేని, సౌకర్యంలో తిరుగులేని గార్మెంట్‌గా అతివల దుస్తులలో చేరింది. నాటి నుంచి ఎన్నో హంగులు దిద్దుకొని ఇలా అందంగా మగువల చేత మన్ననలు అందుకుంటూనే ఉంది.