
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే.. స్కిన్ షో కచ్చితంగా చేయాల్సిందేనా? పొట్టి దుస్తులు ధరించి.. తెరపై అందాలను ప్రదర్శిస్తేనే ‘స్టార్’ హోదా వస్తుందా? అంటే కాదని బల్లగుద్ది చెప్పొచ్చు. ‘నీకేం తెలుసు..‘ఎక్స్‌పోజింగ్’చేస్తేనే సినిమా చాన్స్‌లు వస్తాయట’ అని ఎవరైనా అంటే..వారికి సాయి పల్లవి (Sai Pallavi) గురించి చెప్పండి. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం నటనతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. సంప్రదాయ దుస్తులతోనే నటించి ‘స్టార్’ హీరోయిన్‌గా ఎదిగింది. అలా అని గ్లామర్ షో చేస్తున్నవారిని తప్పు పట్టడం లేదు. కానీ గ్లామర్ షో చేస్తేనే స్టార్ హోదా వస్తుందనుకోవడంలో నిజం లేదని సాయి పల్లవి నిరూపించింది.

అయితే సాయి పల్లవి మొదటి నుంచి పొట్టి దుస్తులకు వ్యతిరేకం కాదు. కానీ ఆమె తెరపై అలాంటి డ్రెస్సుల్లో కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. గతంలో ఓ సారి పొట్టి దుస్తులతో టాంగో డ్యాన్స్ చేసిందట. ప్రేమమ్ సినిమా తర్వాత ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయిందట. అయితే అందులో అందరూ తన ప్రదర్శనను చూడకుండా.. డ్రెస్సింగ్‌పై విమర్శలు చేశారట.

నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ చూసి తనకే ఎలాగో అనిపించి.. ఇకపై పొట్టి దుస్తులు ధరించ కూడదని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాయి పల్లవి. అంతేకాదు ఎంత పెద్ద సినిమా అయినా సరే.. అసౌకర్యంగా ఉండే దుస్తులు ధరించకూడదని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది.
సినిమా విషయాలకొస్తే.. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. దీంతో పాటు శివకార్తికేయన్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.