నా వయసు 35. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. నాకు భయం ఎక్కువ. మా ఆఫీసులో మా బాస్ పిలిస్తే నాకు
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. నాకు భయం ఎక్కువ. మా ఆఫీసులో మా బాస్ పిలిస్తే నాకు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మా బాస్‌తో మాట్లాడి బయటకు వచ్చాక మళ్లీ సాధారణంగా మారిపోతుంటాను. ఒక్కోసారి లిఫ్టు ఎక్కినప్పుడు అది మధ్యలో ఆగిపోతుందేమో అనే భయం గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకేమైనా గుండె జబ్బు ఉందేమో అని అనుమానం కలుగుతుంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు.
- రవికుమార్, బెంగళూరు
మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు ఫోబియా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎక్కువగా భయపడినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మీరు తెలిపిన లక్షణాలతో పాటు నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రావడం వంటి లక్షణాలు కూడ కనిపిస్తే గుండె జబ్బు ఉన్నట్లు అనుమానించవచ్చు. కేవలం భయం కలిగినప్పుడు మాత్రమే చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు భయం పోవడానికి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది.
ప్రతి విషయానికి ఎక్కువగా భయపడటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముందు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటూ భయం నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించండి. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే త్వరగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో గానీ, మీ వంశంలో గానీ ఎవరికైనా గుండె జబ్బులు వచ్చి ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటూ రెగ్యులర్ వ్యాయామం చేస్తూ ఉండండి. దాంతో చాలా వరకు గుండె జబ్బులు దరిచేరకుండా చూసుకోవచ్చు. ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. ఇటీవల హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. అది తగ్గడానికి నేను ఏం చేయాలో సూచించండి.
- వై. రమణ, గుంటూరు
లివర్ కొవ్వుకు కోశాగారం లాంటిది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వుపదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్.
ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు.
మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు తరుచూ చేపలను (వారానికి 100-200 గ్రాములు) తీసుకోవడం మంచిది మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.
జనరల్ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నాకు కుడి చేయి విపరీతంగా లాగుతోంది. నా చేయి నిస్సత్తువ అయిపోయినట్లుగా ఉంది. మెడ దగ్గర నొప్పి వస్తోంది. కళ్లు తిరుగుతూ ఉన్నాయి. కిందపడిపోయినట్లుగా అనిపిస్తోంది. గత మూడు నెలలుగా ఈ నొప్పి ఇలాగే ఉంది. అప్పుడప్పుడూ నొప్పి నివారణ మందులు వాడుతున్నాను. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గి మళ్లీ వస్తోంది. నాకు తగిన పరిష్కారం చూపించండి.
- కామేశ్వరరావు, భద్రాచలం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే బహుశా సర్వికల్ స్పాండిలోసిస్ కారణంగా వెన్నెముక అరిగి, అది వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరంపై ఒత్తిడి పడి మీకు నొప్పి వస్తుండవచ్చు. మీరు బీటాహిస్టిన్, గాబాంటిన్, మిథైల్ కోబాలమైన్ వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. మెడకు సంబంధించిన వ్యాయామాలు తెలుసుకొని, వాటిని చేయాలి. దాంతో మెడకండరాలు బలపడి నొప్పి నరాలపై వెన్నుపూసల వల్ల కలిగే నొప్పి తగ్గేందుకు అవకాశం ఉంది. మీరు ఒకసారి ఫిజీషియన్‌ను సంప్రదించండి.
నాకు 48 ఏళ్లు. చాలాకాలంగా సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. ఉదయం లేవగానే చాలాసేపు తుమ్ములు వచ్చి, ముక్కు, కళ్ల నుంచి ధారగా నీరు కారుతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది.
- ఎమ్. సుబ్బారావు, విశాఖపట్నం
సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఉదయంవేళల్లో చలిగాలికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. చలిగాలి వల్ల సైనస్ రంధ్రాలు మూసుకుపోయి ఒకవిధమైన తలనొప్పి (మైల్డ్ హెడేక్) తో బాధపడతారు. మీలో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి విటమిన్-సి టాబ్లెట్స్ వాడటం, యాంటీ అలర్జిక్ మందులు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు సరిపడని వాతావరణానికి వీలైనంత దూరంలో ఉండండి. మీకు బాగా ఇబ్బందిగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటంతో పాటు ఆవిరిపట్టడం (స్టీమ్ ఇన్‌హెలేషన్), నేసల్ డీ-కంజెస్టెంట్స్ వంటి మందులను డాక్టర్ సూచిస్తారు. మీరు ఒకసారి ఫిజీషియన్‌ను సంప్రదించండి.