
కళాత్మకం : బుద్ధునికో ఇకబెనా!
పూల తోటలో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారా? అనిపిస్తుంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువై ఉన్న బుద్ధుని వర్ణచిత్రాలను చూస్తే! ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన వ్యాపార కుటుంబంలో జన్మించిన అనీశ టాండన్ ఎం.బి.ఏ చేశారు. ఇకబెనా ఇంటర్నేషనల్ కార్యదర్శిగా ఇకబెనా శిక్షణాతరగతులనూ నిర్వహిస్తున్నారు. పెయింటింగ్‌ను ప్రవృత్తిగా స్వీకరించారు. బుద్ధుని జీవితంలోని ముఖ్యఘట్టాలను ఇరవై పెయింటింగ్‌లుగా వేసి చంద్రునికో నూలుపోగు అన్నట్లుగా, ఒక్కో పెయింటింగ్ ఎదురుగా ఒక్కో పుష్పాలంకరణను అమర్చారు. ‘సమ-సంబుద్ధ’గా పరిమళభరితంగా ఎగ్జిబిషన్‌ను తీర్చిదిద్దిన అనీశ టాండన్‌తో ఇంటర్వ్యూ...
‘ఇకబెనా’ అంటే ఏమిటి?
బుద్ధుడు ఉద్యానవనప్రియుడు. ఆయన తత్వమూ ఆయన ఇష్టపడే పరిసరాల్లా ఆహ్లాదకరమైనదే. బుద్ధుడిని... తెంపిన పూలతో కాకుండా మొక్కలతో, లతలతో సజీవంగా ఉన్న పుష్పాలతో గౌరవించడం బౌద్ధంలో ఒక ఆరాధనా విధానం. ఈ పద్ధతి మన దేశం నుంచే క్రీ.శ. 6వ శతాబ్దిలో జపాన్‌కు చేరింది. కొలను సమీపంలో నివసించే ఒక భిక్షువు జీవించిన పూలతో బుద్ధుని ఆరాధించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అతని పేరుతో రూపొందిన ‘ఇకబెనా’ (ఇక=కొలను, బెన=సాధువు) పుష్పాలంకరణ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.
‘ఇకబెనా’లో మీ కృషి గురించి చెప్పండి?
ఏమీ తెలియని బాల్యంలోనే ‘ఇకబెనా’ అందమైన అమరికకు ఆకర్షితురాలినయ్యాను. ఓహర స్కూల్ ఆఫ్ ఇకబెనా, జపాన్ నుంచి డిప్లమా పొందాను. ప్రస్తుతం ఇకబెనా క్లాసెస్ తీసుకుంటున్నాను. వర్క్‌షాప్స్, డెమోలు నిర్వహిస్తున్నాను. శ్రీనగర్ కాలనీలోని ‘ఆశ్రయ్ ఆకృతి’, జూబ్లిహిల్స్‌లోని ‘నచికేత తపోవన్’ వంటి అండర్ ప్రివిలేజ్డ్ బాలల స్కూల్స్‌లో ‘ఇకబెనా’ నేర్పుతున్నాను. వినలేని, మాట్లాడలేని బాలలు ‘ఇకబెనా’ సౌందర్యానికి ముగ్ధులవుతారు!
ఆర్ట్‌ను ఇకబెనాను కలపాలనే ఆలోచన ఎలా వచ్చింది?
బుద్ధుని ఆరాధనలో ప్రాముఖ్యత పొందిన ఇకబెనాను బుద్ధుని పెయింటింగ్‌లతో సమన్వయపరిస్తే బావుంటుంది కదా అనిపించింది. ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో ఈ ప్రక్రియను తొలిసారిగా నేను మాత్రమే చేశానని పలువురు క్యూరేటర్స్, ఆర్ట్ లవర్స్ అంటున్నారు. సాధారణ వీక్షకులు సైతం గ్యాలరీకి వచ్చినట్లు లేదు, ప్రార్థనా స్థలానికి వచ్చినట్లుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెయింటింగ్‌లు వాటి ముందుంచిన ఇకబెనాల గురించి చెప్పండి!
బుద్ధుని జీవితాన్ని నేను అర్థం చేసుకుని నా వ్యక్తీకరణను కళాభిమా నులకు చూపాలని మొత్తం ఇరవై పెయింటింగ్‌లు వేశాను. ఇకబెనాలో ప్రతి కొమ్మకు, రెమ్మకు పువ్వుకు సంకేతాలుంటాయి. ఉదాహరణకు కొమ్మలోని రెండు కాండాలలో ఒకటి భూమి, మరొకటి ఆకాశం. ప్రతి పువ్వుకూ, రంగుకూ సంకేతాలుంటాయి. హేకా స్లాంటింగ్, ఇన్‌క్లైనింగ్ ఫాం, సర్క్యులర్ ఫాం, మోరీ బన ప్లాంటింగ్, డ్రిఫ్ట్ ఉడ్-రింపా తదితర అమరికలను బుద్ధుని జీవితంలోని వివిధ ఘట్టాలకు సంకేతంగా అమర్చి ఆయా పెయింటింగ్‌ల ముందు ఉంచాను. బుద్ధుని జ్ఞానోదయాన్ని సూచిస్తూ కలువపూలతో ‘రైజింగ్ స్టయిల్’ అమరికను ఉంచాను. రావిచెట్టు క్రింద జ్ఞానోదయాన్ని పొందడాన్ని సూచిస్తూ పెయింటింగ్‌లో కొలనులో రావిచెట్టు ప్రతిబింబాన్ని చూపిస్తూ ‘రావిచెట్టు’ ఆకులు, లతలతో ఇకబెనాను అమర్చాను. ఏసియాటిక్ లిలీ, జెర్‌బ్రా, గ్లాడియోల్డీ, మొరి మోనో, కరోండా, పీపల్ తదితర పుష్పాలను చిత్రించి, అమర్చిన ఈ ప్రదర్శన కళాప్రేమికుల్లో ఇకబెనా పట్ల ఆసక్తిని కలుగజేస్తుందని ఆశిస్తున్నాను.
ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?
ఇరవై పెయింటింగ్‌ల ఇమేజెస్‌తో పుస్తకాన్ని, డీవీడీని రూపొందించాలని భావిస్తున్నాను. ఒక్కో పెయింటింగ్‌ను పరిచయం చేయడం, సంబంధించిన ఇకబెనాను ఎలా రూపొందించిందీ, వాటి అమరికల వెనుక ఉన్న శాస్త్రీయత, కళాత్మకత గురించి వివరించడం, అంతిమంగా ఇకబెనా పట్ల పాఠకులు ఆకర్షితులయ్యేందుకు దోహదపడడం రాబోయే పుస్తకం ఉద్దేశం. లతలను, పువ్వులను సేకరించి అందంగా అలంకరించాలనే ఆసక్తి ఏర్పడితే, మన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలించడం అలవాటవుతుంది. ప్రకృతిని పరిశీలించే అలవాటు ఏర్పడితే పరిరక్షించుకోవాలనే చైతన్యమూ కలుగుతుంది కదా!
- పున్నా కృష్ణమూర్తి