మీ మాటకి విలువ ఉండే కాలమిది | In order to survive in the value of your recs | Sakshi
Sakshi News home page

మీ మాటకి విలువ ఉండే కాలమిది

Published Fri, Aug 21 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

మీ మాటకి విలువ ఉండే కాలమిది

మీ మాటకి విలువ ఉండే కాలమిది

ఆగస్టు 22 నుంచి 28 వరకు
టారో బాణి
 
 ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
వృత్తిపరమైన విషయాల్లో స్థిరత్వాన్ని. నిలకడతనాన్నీ పాటించి, అధికారాన్ని, అజమాయిషీనీ పొందుతారు. వ్యాపారం బాగా వృద్ధి అవుతుంది. ఇంతకాలంగా మీ అభివృద్ధికి చేయూతనిచ్చిన వారికి మీ కృతజ్ఞత చూపాల్సిన సమయమిది. జీవితమన్నాక ఒడిదొడుకులు సహజం. చిన్న చిన్న ఇబ్బందులకే భయపడితే ఆనందాన్ని ఆస్వాదించగలమా? కలిసొచ్చే రంగు: పింక్
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
వృత్తిపరమైన పనులతోటీ, ప్రాపంచిక విషయాలతోటీ వారమంతా తీరికలేకుండా గడుపుతారు. ఇల్లు కట్టుకోవాలని లేదా ఉన్న ఇంటిని ఆధునీకరించుకోవాలని ఆలోచన వస్తుంది. పనిలో ఒక కొత్త అవకాశం వస్తుంది.  పనులు వెంటనే పూర్తి చేయాలని ఆతృతపడతారు. శారీరకంగా ఫిట్‌నెస్ పెంచుకోవడం  మంచిది. కలిసొచ్చే రంగు: బ్లూ
 
 జెమిని (మే 21-జూన్ 21)

 ఇంటా బయటా చోటు చేసుకున్న మార్పులు మిమ్మల్ని అతలాకుతలం చేయవచ్చు. భయడపకుండా మీ బాధ్యతగా చేయగలిగిన  దానిని చేయండి. అప్పుడు జీవితంలో ఏదీ ఇబ్బందిగా అనిపించదు. మీ విలువలు, ప్రాధాన్యతలు, ధోరణులలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఒక ప్రకటన లేదా వార్త మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
 క్యాన్సర్(జూన్22-జూలై 23)

 గతం ఎప్పుడో జరిగిపోయింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కనక గడిచిపోయిన దాన్ని గురించి, జరగబోయే దాని గురించి తలచుకుంటూ ఉండేకన్నా వర్తమానాన్ని హాయిగా గడపడం అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తు అందంగానే ఉంటుంది. మీ నిర్ణయాలలో జాప్యం వల్ల ఒక మంచి పనిని వదులకోవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు
 
 లియో(జూలై 24-ఆగస్టు 23)

 కొత్తగా ఏదైనా అవకాశం వచ్చిందంటే దానివెనకే కొత్త సవాళ్లు కూడా ఉండచ్చు. దానికి వెరవక ధైర్యంగా ఎదుర్కొని పోరాడటం వల్ల సులువుగా అధిగమించగలుగుతారు. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు  నిర్భయంగా ముందుకెళితేకదా, మీ వెనక  ఉన్న వాళ్లకు దారి చూపగలిగేది, వారు మిమ్మల్ని అనుసరించేదీ! కలిసొచ్చే రంగు: మట్టిరంగు
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 సమష్టి బలము, సహకారానికి మీ సమర్థత తోడయితేనే కదా కొత్త వ్యాపార వ్యవహారాలైనా, వృత్తిపరమైన పనులైనా నెరవేరేది! టెన్షన్లు లేని జీవితం చప్పిడి తిండి వంటిది. ఏ కష్టాలూ, ఒడుదొడుకులూ, ఇబ్బందులూ లేకుండా ఉంటే జీవితం సాఫీగా నడిచిపోవచ్చేమో కానీ, అందులో మజా ఏముంటుంది? మీ పనుల్లో విజయం సాధిస్తారు. కలిసొచ్చే రంగు: సిల్వర్ వైట్
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
జీవితంలో మార్పు కోరుకుంటున్న ఈ తరుణంలో ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. రేపటి కోసం ఆలోచిస్తూ నేటి గురించి విస్మరిస్తున్నారన్న విషయాన్ని మరవద్దు. ఇంటి మరమ్మతులకు ఇది సమయం. ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. వ్యాయామం లేదా క్రీడలతో ఫిట్‌నెస్ పెంచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22
)
 మీరు ఎంత తెలివిగలవారైనా, ఎంత ప్లానింగ్ తెలిసినా కూడా మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే అన్నీ వ్యర్థమేనని మరచిపోవద్దు. ఇల్లు, సంపాదన, పేరుప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తూ జీవితం గురించి పట్టించుకోకపోతే ఎలా? అన్నీ కలగలసినదే జీవితం అని గుర్తుంచుకోండి. ఈ వారమంతా చాలా శుభకరంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
అనుకున్న పనులన్నీ అయిపోవడం వల్ల వారమంతా సంతోషంగా గడుపుతారు. పనిధ్యాసలో పడి తిండి, నీళ్లు, నిద్ర మరచిపోకండి. వ్యాపారపరంగా, ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంటుంది. ఫలితం కోసం ఎదురు చూడకుండా మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించండి. దేన్నైనా అతిగా ఆశిస్తున్నంతకాలం అది మనకు అందదన్నది గుర్తు తెచ్చుకోండి. కలిసొచ్చే రంగు: పీచ్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
జీవితంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి ముడిపడి  ఉంటుందని మరచిపోకండి. ఈ కష్టాలూ, బాధలూ , బాధ్యతలూ మీ ఒక్కరికే కాదు, అందరికీ ఉంటాయని గుర్తుతెచ్చుకోండి. అహంకారాన్ని విడిచిపెట్టండి. బాధ్యతలు నెరవేర్చండి. ఒకరి స్వార్థం, అసూయ మూలంగా మీకు ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే
 
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
జీవితం ప్రశ్న కాదు. సమస్యా కాదు. జీవితమంటే జీవితమే! అది ఎటు తీసుకెళితే అటు, ఎలా తీసుకెళ్తే అలా ప్రయాణించడమే మంచిది. మన చేతిలో ఏమీ ఉండదు. అలాగని మీ అలవాట్లు వదులుకొని, అభిరుచులని చంపుకోవలసిన పనిలేదు. సమర్థతను పెంచుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణాన్ని కొనసాగించండి. కలిసొచ్చే రంగు: వయొలెట్
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 వృత్తిపరమైన విషయాలలో ప్రాక్టికల్, ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం నేర్చుకోండి. గతం గురించి ఆలోచిస్తూ బంగారం లాంటి భవిష్యత్తును మరచిపోకండి. ప్రతికూల భావనలూ, దిగుళ్లూ పెట్టుకోకుండా ఉండటం అలవాటు చేసుకోండి. నిర్ణయాలలో పట్టువిడుపు ధోరణితో  మానవ సంబంధాల విషయంలో దృఢంగా ఉండండి. కలిసొచ్చే రంగు: లేత పసుపు రంగు.
 ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
సౌర వాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
చేసిన రుణాలని తీర్చవలసిందిగా వత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు తీర్చగలరో ప్రణాళికని వేసుకుని దానినే నిజాయితీగా మీరు ఎవరికి బాకీ ఉన్నారో వారికి తెలియజేయండి. ఈ విషయంలో లౌక్యంగాని, మధ్యవర్తి ద్వారా చెప్పించడం గాని, అసత్యమాడటంగాని చేయనే వద్దు. ఏదైనా ఓ సందర్భంలో పరాజయాన్ని మీరు చవి చూసినా మధన పడకండి.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 గుర్తింపు కోసమో కీర్తిప్రతిష్ఠల కోసమో లేక వేతనాభివృద్ధి కోసమో తొందరపడి స్థానచలనానికో లేక వృత్తివ్యాపారాల మార్పుకో ప్రయత్నించకండి. తాత్కాలికమైన చికాకులున్నంత మాత్రాన మార్పు అనేది శాశ్వత పరిష్కారం కాదు. మారబోతున్న ప్రదేశంలో మాత్రం సమస్యలు ఉండబోవని ఎవరూహించగలరు? తొందరపడి అదనపు భారాన్ని నెత్తిన వేసుకోకండి.
 
 
జెమిని (మే 21-జూన్ 21)

ప్రభుత్వం నుండి రావలసిన ద్రవ్యం అందే సూచనలు ఉంది. మీ సంతానం తోవ తప్పకుండా ఉండేలా జాగ్రత్తని పాటించండి. కీర్తి ప్రతిష్ఠలు, సన్మానాల కోసం పాకులాడే స్వభావం కాకున్నా, మిమ్మల్ని ఆశపెట్టి రంగంలోకి దించి అపకీర్తిపాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ప్రలోభపడకండి. మీ ఆదాయ వ్యయాలని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోండి.
 
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
ఊహాలోకంలో విహరిస్తూ కాలాన్ని గడిపేస్తారు. ఏ పనీ ప్రారంభించేపరిస్థితి కనిపించడం లేదు. అలాగని అది మీ అసమర్థత కాదు. మీకు తగినంత సహాయం లేకపోవడం లేదా మీకు అండగా ఉన్న వ్యక్తులకి అంత సమర్థత లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. విదేశాలకి ఆహ్వానం రావచ్చు. ఇక్కడుండే పని ఒత్తిడి, ఆదాయం చూసుకుని అంగీకారాన్ని తెల్పండి.
 
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
తలిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆరోగ్యం కొన్ని రోజులపాటు మిమ్మల్ని మీ పని చేసుకోనీయక పోవచ్చు కాబట్టి స్వల్ప వైద్యపరీక్ష లు చేయించండి లేదా వ్యాధికి లోనుకాకుండా ఉండేలా ముందు జాగ్రత్తలని పాటించేలా చేయండి. చేపట్టిన కార్యక్రమాలకి ఆటంకాలొచ్చాయని దిగులుపడకండి. మీ మానసిక స్థైర్యమే మిమ్మల్ని మరిన్ని ఎత్తులకి తీసుకెళ్తుంది నిస్సందేహంగా.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
అనవసరమైన వస్తు ఆభరణ అలంకరణ సామగ్రి కొనే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యాపారం కోసం తగు ప్రయత్నాలు చేస్తారు.  ఇల్లు, పొలం వంటి వాటి గురించి కొత్త నిర్ణయమేమీ తీసుకోకపోవడం శ్రేయస్కర ం. కొత్తగా పరిచితులైన వారితో అతిచనువు వద్దు. అనారోగ్యం కలిగితే అది తాత్కాలికమేనని భావించండి, ఆందోళన వద్దు.
 
 
 లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 కుటుంబంలో ఐకమత్యం పెంపొందవచ్చు. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అవివాహితులైన పక్షంలో వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారంతో కొత్త ఆలోచనలని చేసుకోగలుగుతారు. ఈ వారంలో పూర్వికుల ఆస్తులని అమ్మడం, అమ్మివేయాలనే ఆలోచనకి రావడం సరి కాదు.
 
 స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)
 ఆగిపోయిన పనుల్లో కదలిక ప్రారంభం అవుతుంది. దాంతో మీకు పని భారం పెరగచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవచ్చు. సాహసకార్యాలైన కొండలెక్కడం,  ఈదడం, వేటాడదలచడం... వంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. అన్నిపనుల్నీ ఒక్కసారే కాకుండా ఒకదాని తర్వాత మరొకటి చొప్పున ఎక్కువ పనులే చేసుకున్న పక్షంలో సిద్ధించవచ్చు.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
 మీ మాటకి విలువ ఉండే కాలమిది. కాబట్టి ఆ విలువని వ్యర్థపరచుకోకుండా పరిచితులైన వారికి మాత్రమే సాయపడండి. రాజకీయంగానైతే పదవులు లభించే అవకాశం ఉంది కాబట్టి పరిచయాలని చెడగొట్టుకోకండి. విద్యార్థులకి తగినంత బుద్ధివికాసం కలిగే కాలం ఇది కాబట్టి వ్యర్థ సంభాషణలతో పొద్దుపుచ్చకుండా మేధోవికాసానికి కృషి చేయడం మంచిది.
 
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
 వాహనాలూ యంత్రాల విషయంలో కొద్ది శ్రద్ధతో ఉండడం మంచిది. రుణదాతలనుండి ఒత్తిడి ఉండే అవకాశముంది కాబట్టి కొంత కొంత చొప్పున తీరుస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి. అన్నింటికంటే మించి నమ్మకమనే పెట్టుబడిని తొలగించుకోకండి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలని, వ్యాపార స్థలంలోని వస్తుసామగ్రిని పర్యవేక్షించుకుంటూ ఉండడం అవసరం.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
అధికారులతో మాట్లాడేటప్పుడు పరిస్థితిని సామరస్యంగా ఉండేలా చూసుకుని పని ముగించుకోండి తప్ప వాగ్వివాదాలకి వెళ్లకండి. కోర్టు తీర్పు ఎలా ఉన్నా మీకు రాబోయే నష్టం ఏమీ లేదని గ్రహించండి. దిగులు పడకండి. పిల్లల విషయంలో విద్యాసక్తి వాళ్లకి ఎంత ఉందనే విషయాన్ని ఉపాధ్యాయులనడిగి తెలుసుకుని తలిదండ్రుల్లో ఒకరు పూర్తి శ్రద్ధని తీసుకోక తప్పదు.
 
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
పదోన్నతిపై లేదా ప్రభుత్వ వెసులుబాటు కారణంగా మంచి చోటుకి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరీ అనుకూలం గాని చోటుకే వెళ్లవలసి వస్తే కాదనకండి. కొన్నాళ్లపిమ్మట తిరిగి వచ్చే అవకాశముంది మీకు. మానసికంగా అధైర్యపడవద్దు. శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దైవధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా గడపండి.

మైలవరపు శ్రీనివాసరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement