అమ్మ కడుపు చల్లగా | Interview with Sharwanand and his mother | Sakshi
Sakshi News home page

అమ్మ కడుపు చల్లగా

Published Sat, May 13 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

అమ్మ కడుపు చల్లగా

అమ్మ కడుపు చల్లగా

అమ్మ కడుపు చల్లగా ఎప్పుడుంటుంది? కొడుక్కి ఏ కీడూ కలగకుండా గొప్ప ప్రయోజకుడైతే నలుగురికి మంచి చేసేవాడైతే... నలుగురూ మెచ్చేవాడైతే అమ్మ కడుపు చల్లగా ఉంటుంది. అంటే.. అమ్మ చల్లగా ఉండాలంటే పిల్లలు ప్రయోజకులు కావాలి బిడ్డలు సంతోషంగా ఉంటే అమ్మ సంతోషంగా ఉంటుంది ఇది తల్లి నిస్వార్థ ప్రేమకి చిహ్నం. అమ్మకి ఏదైనా తెచ్చిస్తే సంతోషపడుతుందో లేదో తెలియదు కానీ కన్న బిడ్డ ఏదైనా సాధిస్తే అమ్మ సంతోషంగా ఉంటుంది. కూతుళ్లు – కొడుకులు చల్లగా ఉంటే అమ్మ కడుపు చల్లగా ఉంటుంది

♦ మదర్స్‌ డే స్పెషల్‌ ఏంటి ?
శర్వా: మదర్స్‌ డే అంటూ ప్రత్యేకంగా ఎప్పుడూ సెలబ్రేట్‌ చేసుకోలేదు. ప్రతిరోజు మదర్స్‌ డేలానే అనుకుంటాను. అమ్మను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి కదా.

♦ చిన్నప్పుడు మీ అబ్బాయి చేసిన అల్లరి గురించి చెబుతారా?
వసుంధర: శర్వాకి స్కూల్‌కి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. ఎలాగోలా రెడీ చేసి, రిక్షా ఎక్కించేవాళ్లం. అందులోంచి దూకేసేవాడు. కారు ఎక్కిస్తే, డోర్‌ ఓపెన్‌ చేసుకుని దూకడానికి ట్రై చేసేవాడు. థర్డ్‌ వరకు ఇదే తంతు. పోనీ స్కూల్‌ మార్చితే వెళతాడేమోనని మార్చాం. పూర్తిగా మారలేదు, కానీ... అంతగా మొండికేసేవాడు కాదు. మార్కులు ఎక్కువగా రాకపోయినా పాస్‌ అయ్యేవాడు. తొమ్మిదో తరగతి నుంచి పేచీ పెట్టకుండా స్కూల్‌కెళ్లాడు.

♦ లంచ్‌ బాక్స్‌ ఖాళీ చేసేవారా.. అలాగే ఇంటికి తీసుకెళ్లేవారా?
శర్వా: మా అమ్మ చాలా టేస్టీగా వండుతుంది. బిర్యానీ సూపర్బ్‌. చైనీస్‌ వంటకాలకు వంక పెట్టడానికి లేదు. లంచ్‌కి చికెన్‌ డ్రమ్‌స్టిక్స్, చైనీస్‌ స్పెషల్‌ ఐటమ్స్‌ పంపించేది. హైద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదువుకునే రోజుల్లో నా లంచ్‌ బాక్స్‌ అందరికీ స్పెషలే. స్కూల్‌ ఫ్రెండ్సే కాకుండా బయటి ఫ్రెండ్స్‌కి కూడా మా అమ్మగారి వంటలు ఇష్టమే.

♦ మీ స్నేహితుల్లో ఒకరైన రామ్‌చరణ్‌కి కూడా ఇష్టమేనా?
శర్వా: చరణ్‌కి నువ్వు చేసే రసం ఇష్టం కదమ్మా...
వసుంధర: ఊ... చరణ్‌కి రసం అంటే చాలా ఇష్టం.

♦ మీ అమ్మగారి కోసం ఎప్పుడైనా వండి పెట్టారా?
శర్వా: అమ్మ నన్ను వంటింట్లోకి అడుగు పెట్టనివ్వదు. నాకు ఆమ్లెట్‌ మాత్రమే వచ్చు. ఈ మధ్య అక్క దగ్గర యూఎస్‌లో మూణ్నెల్లు ఉన్నాను. తన దగ్గర చికెన్‌ కర్రీ, రసం నేర్చుకున్నా. ఇక్కడికొచ్చి మర్చిపోయా.

♦ శర్వాకు ఓ అన్నయ్య (కల్యాణ్‌) కూడా ఉన్నారు కదా.. వీళ్లిద్దరూ బాగా అల్లరి చేసేవాళ్లా?
వసుంధర: పెదబాబుకి, శర్వాకు మధ్య గ్యాప్‌ ఎనిమిదేళ్లు. ఆటల్లో తనను కలుపుకోవడంలేదని శర్వా గొడవ చేసేవాడు. పెదబాబు దాచుకున్న వస్తువులన్నీ తీసేసేవాడు. దాంతో ఇద్దరు గొడవపడేవారు. ఆ గొడవ చూసి, ‘రామ–లక్ష్మణుల్లా ఉండాలనుకున్నాను. వీళ్లేంటి ఇట్లా పోట్లాడుకుంటున్నారు’ అనుకునేదాన్ని. శర్వా చాలా పెంకి. కోపం వస్తే, తలను నేలకేసి కొట్టుకునేవాడు. చాలాసార్లు బొప్పి కట్టింది కూడా. మెల్లగా ఆ అల్లరి తగ్గిపోయింది. నేను కోరుకున్నట్లే అన్నదమ్ములిద్దరూ రామ–లక్ష్మణుల్లా ఉంటున్నారు. నన్ను బాగా చూసుకుంటారు. షూటింగ్‌ కోసం శర్వా ఎక్కడెక్కడికో వెళతాడు. ఫోన్‌ చేసి, మాట్లాడుతుంటాడు. బేసిక్‌గా శర్వాకి లేడీస్‌ అంటే గౌరవం. అమ్మని కాబట్టి నన్ను ఎలానూ బాగా చూసు కుంటాడు. వాళ్ల అక్క, వదినల విషయంలోనూ కేర్‌ తీసుకుంటాడు.

♦ పెద్దయ్యాక ఏమవుతావని శర్వాని అడిగితే ఏమని చెప్పేవారు?
వసుంధర: టెలివిజన్‌లో యాక్ట్‌ చేస్తానని, సినిమాల్లోకి వెళతానని అనేవాడు. మా నాన్నగారికి సినీ ఫీల్డ్‌తో కాస్త టచ్‌ ఉంది. ‘కృష్ణావతారం’ లాంటి సినిమాలు తీశారాయన. అయినా నాకు, శర్వా వాళ్ల నాన్న (ఎమ్‌.ఆర్‌.వి ప్రసాద్‌)గారికీ సినిమా ఫీల్డ్‌ అంటే అంత ఇష్టం లేదు. ఒకసారి మా అన్నయ్యగారి అబ్బాయి జాతకం చెప్పించుకోవడానికి వెళ్లాం. అక్కడ శర్వా పుట్టిన తేదీని చూసి హీరో అవుతాడని జాతకం చెప్పారు. శర్వాకు ఆ విషయం తెలిస్తే, అదే మనసులో పెట్టుకుని సినిమాల్లోకి వెళ్లే తీరతానంటాడని దాచేశాం. ఆ తర్వాత ఆ విషయం తెలిసి, ఎందుకు చెప్పలేదంటూ గొడవ చేశాడు. ఇంటర్‌లోకి వచ్చాక సినిమాల్లోకి వెళతానన్నాడు. డిగ్రీ చేశాక, వెళుదువు అన్నారు వాళ్ల నాన్నగారు. అలాగే చేశాడు.

♦ పిల్లలను పెంచడానికి అమ్మానాన్న ఎంతో కష్టపడతారు. వాళ్ల భవిష్యత్తు గురించి కలలు కంటారు. అంతలా పెంచే మీ అమ్మగారికి ఇచ్చిన గిఫ్ట్స్‌ గురించి?
వసుంధర: శర్వా పదో తరగతిలో ఉన్నప్పుడు ఓసారి అమెరికా పంపించాం. అప్పుడు సూట్‌కేసు నిండా వంటింటి సామాన్లు తీసుకొచ్చి, నాకు గొప్పగా చూపించాడు. ఏదో ఒకటి కొని తెస్తుంటాడు. ‘అందరి బంధువయా’ షూటింగ్‌ అప్పుడు నాకు, తన వదినకు, వదిన అక్కకు చీరలు తెచ్చాడు. చాలా సంతోషంగా ఫీలయ్యాం. ఆ తర్వాత మా షష్టిపూర్తికి కృష్ణుడి బొమ్మను కానుకగా ఇచ్చాడు. ఆ గోడకు ఉన్న కృష్ణుడి బొమ్మ శర్వా ఇచ్చిందే..

♦ మీ అమ్మగారు మీకిచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ ఏంటి?
శర్వా: అమ్మ ఫిలాసఫీయే నాకు గిఫ్ట్‌. ‘ఎవరినీ మోసం చేయకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకో, ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండు’ అని నా చిన్నప్పుడే చెప్పింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ చెబుతూనే ఉంటుంది. అవి నా మనసులో నాటుకుపోయాయి. అమ్మ చెప్పే నీతి, విలువలు... వాటికన్నా గొప్ప బహుమతులు ఏం ఉంటాయి?

♦ మీ అమ్మగారి నుంచి ఇంకా ఏమేం నేర్చుకున్నారు?
శర్వా: అమ్మ నాకెప్పుడూ రాముడి గురించి చెప్పేవారు. ఒకటే మాట. ఒకటే బాణం. నా లైఫ్‌లో ఇప్పటì æవరకు నేను ఒకరికి ఇచ్చిన మాటను తప్పలేదు. ఒకరి దగ్గర చేయి చాచి అడగకూడదు అని కోరుకుంటాను. వర్క్‌ మినహా ఇంకేం విషయంలో నేను చేయి చాచి అడిగే పరిస్థితులు రాకూడదని అనుకుంటున్నాను. ‘ఎవర్నీ మోసం చేయకు’ అని అమ్మ చెప్పిన విషయాన్ని జీవితాంతం పాటిస్తాను. ‘కో అంటే కోటి’ సినిమా నిర్మాతగా నాకు పెద్ద నష్టం తెచ్చింది. పెట్టుబడి పెట్టినప్పుడు లాభం రావచ్చు. నష్టం రావచ్చు. కానీ, ఆ టైమ్‌లో ఎవరో ఏదో అన్నారు. దాంతో నాకు నష్టం వచ్చినా ఫర్వాలేదనుకుని, మొత్తం డబ్బు వెనక్కి ఇచ్చేశాను. ఆ సినిమా మిగిల్చిన నష్టం నా మీద ఏ రేంజ్‌లో ఎఫెక్ట్‌ చూపించిందంటే అప్పటి నుంచి నేను ఓ కారు, ఇల్లు.. ఏదీ కొనుక్కోలేదు.

♦ పిల్లలు నష్టపోతే తల్లిదండ్రుల బాధ చిన్నది కాదు. శర్వా నష్టపోయినప్పుడు మీకేమనిపించింది?
వసుంధర: అప్పటివరకూ కష్టపడి సంపాదించిన మొత్తం డబ్బునీ శర్వా పోగొట్టుకున్నాడు. చాలా బాధ అనిపించింది. అయితే ఏదో పాఠం నేర్చుకోవాలనే ఆ దేవుడు ఇలాంటి పరిస్థితులను కలగజేశాడని అనుకున్నాను. అది నిజం కూడా. తను ఆ సంఘటన నుంచి చాలా నేర్చుకున్నాడు.

♦ మీ కష్ట సుఖాలన్నింటినీ అమ్మతో షేర్‌ చేసుకుంటారా?
శర్వా: పని గట్టుకుని చెప్పను. పిల్లల బాధను పేరెంట్స్‌ ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటారు. మన ఫీలింగ్స్, మన ప్రవర్తన అమ్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి. మన ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా అమ్మ ఇట్టే పసిగట్టేస్తుంది. ఎందుకంటే తను అమ్మ కాబట్టి. మా అమ్మానాన్నలది ఒకటే ఫిలాసఫీ. ‘నీ లైఫ్‌ నీది. ఒకర్ని మోసం చేయకుండా, హాని కలిగించకుండా ఏదైనా చెయ్యి.’ అనేవాళ్లు. కొడుకుగా అది పాటిస్తే వాళ్లు ఆనందపడతారు.

♦ మరి... అమ్మకు చిన్న కోడలిని ఎప్పుడు తెస్తారు?
శర్వా: ఇంకా ఏమీ అనుకోలేదు.
వసుంధర: పెళ్లి చేసుకోమని చెబుతూనే ఉన్నాం.

♦ మీకెలాంటి కోడలు రావాలనుకుంటున్నారు?
వసుంధర: శర్వాను సంతోషంగా ఉంచే అమ్మాయి, తన మనసును అర్థం చేసుకుని, ప్రేమగా చూసుకునే అమ్మాయి వస్తే చాలు. అంతకు మించిన కోరికలు లేవు.


♦ శర్వా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు ఇష్టమేనా?
వసుంధర: ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటే మంచిదే. మా సెలక్షన్‌ ఎలా ఉంటుందోనని కాస్త భయం. తను సరైన నిర్ణయం తీసుకుంటాడని మా నమ్మకం.

♦ అమ్మను బాగా చూసుకునే అమ్మాయినే సెలెక్ట్‌ చేస్తారా?
శర్వా: అంతే కదండీ. నాకు నచ్చిన అమ్మాయి, అమ్మను బాగా చూసుకోవాలి. ఆ విలువ ఉండాలి. అలా లేకపోతే నేను ఉండలేను.

♦ ఇంతకీ మీరు అమ్మ కూచీయేనా? చిన్నప్పుడు ప్యాకెట్‌ మనీ కోసం అమ్మతో నాన్నకు రికమండ్‌ చేయించుకునేవారా?
శర్వా: నేను అమ్మ కూచిని. అవసరాన్ని బట్టి నాన్నకూచిగా కూడా మారతాను (నవ్వుతూ). ప్యాకెట్‌ మనీ విషయంలో అమ్మ రికమండేషన్‌ అవసరం ఉండేది కాదు. నేను వెయ్యి అడిగితే నాన్న రెండువేలిచ్చేవారు.

♦ మీ అబ్బాయిని ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫులూ అడుగుతుంటారు కదా. అప్పుడు ఎలా అనిపిస్తుంది?
వసుంధర: ఆనందగానే ఉంటుంది. అయితే చుట్టూ జనాలు ఉంటే తనెక్కడ ఇబ్బందిపడతాడో అనిపిస్తుంది. శర్వా ఆడియో ఫంక్షన్స్‌ మిస్సవ్వను. లైవ్‌ చూస్తుంటాను.
శర్వా: ఈ మధ్య ఇంటర్నెట్‌ కూడా నేర్చుకుంది. అంతకుముందు త్వరగా నిద్రపోయేది. ఇప్పుడు లేట్‌గా నిద్రపోతోంది (అమ్మవైపు కొంటెగా చూస్తూ)..

♦ ఇంటర్నెట్‌లో సెలబ్రిటీల గాసిప్స్‌ వస్తుంటాయ్‌.. మీ అబ్బాయి గురించిన వార్తలు చదివినప్పుడు ఫీలవ్వరా?
వసుంధర: అసలా వార్తల గురించి శర్వాను మేం అడగం. తన మీద మాకంత నమ్మకం. శర్వా ఏం చేసినా కరెక్ట్‌గా చేస్తాడనుకుంటాం. ఒకవేళ ఏమైనా ఉంటే మాతో చెబుతాడు.

♦ అమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకుంటారా?
శర్వా: అన్నయ్య దగ్గరుండి అమ్మను ఆస్పత్రికి తీసుకెళతాడు. నేను ఆరోగ్యం గురించి తెలుసుకుంటానంతే.
వసుంధర: శర్వాకి హాస్పిటల్‌కి రావడం ఇష్టం లేక కాదు. తను వస్తే అందరూ తన చుట్టూ మూగిపోతుంటారు. అది హాస్పిటల్‌ వాళ్లకీ ఇబ్బందే కదా. నాతో రాకపోయినా.. ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటాడు.

♦ శర్వా అయ్యప్ప మాల వేసుకుంటారు కదా.. చిన్నప్పటి నుంచి తనకు దైవభక్తి ఉందా?
వసుంధర: చిన్నప్పుడు తిరుపతి అవీ తీసుకెళ్లాం. దేవుడంటే సృష్టి కర్త. అందరూ సమానమే. నాకో గురువుగారు ఉన్నారు. ఆయన దగ్గర నాలెడ్జ్‌ తీసుకున్నాను. 1990లో ఆయన దగ్గర ఇన్నర్‌పీస్‌ గురించి తెలుసుకున్నా. అంతకు ముందు కొందరు స్వామీజీల దగ్గరకు వెళ్లాను. అయితే ఆ గురువుగారు చెప్పినవాటి మీద నమ్మకం కుదిరింది. రోజూ ఓ గంట ధ్యానం చేస్తా. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నాడు కదా. అందుకే శర్వాకూ దైవభక్తి ఉంది.
శర్వా: నేను పొట్టలో పడినప్పటి నుంచే అమ్మకు దైవభక్తి మొదలైంది. నాకా విషయం చాలాసార్లు చెప్పింది.
వసుంధర: అవునండి. నేను గర్భవతిగా ఉన్నప్పుడు మంత్రం తీసుకున్నాను. మామూలుగా అయితే అలాంటప్పుడు మంత్రం తీసుకోకూడదంటారు. కానీ అప్పుడే మంచిదని కొందరన్నారు. లోపల ఉన్న బిడ్డకు కూడా మంచిదని చెప్పారు. తను కడుపులో ఉన్నప్పుడు మా చెల్లి భగవద్గీత చదివి, వినిపించేది. మూడు నాలుగేళ్ల వయసులో శర్వా తాను ధ్యానం చేస్తానని ధ్యానముద్రలో కూర్చునేవాడు. నాకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అది తెలుసు కాబట్టే, మా çషష్టిపూర్తికి కృష్ణుడి బొమ్మను బహుమతిగా ఇచ్చాడు. ‘రాధ’ సినిమాలో కృష్ణుణ్ణి ఇష్టపడే అబ్బాయిగా శర్వా నటించడం నాకు చాలా ఆనందం అనిపించింది. కృష్ణుడి మీద డైలాగ్స్‌ ఉండటం నాకు బాగా నచ్చింది. యాక్టింగ్‌ కూడా బాగుంది.

♦ ఫైనల్లీ మదర్స్‌ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు?
శర్వా: అందరూ అమ్మను బాగా చూసుకోవాలి. ఆ ఒక్కరోజూ ప్రత్యేకం అనేం కాదు. నిత్యం అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులను చూడటం పిల్లల బాధ్యత. ఆ బాధ్యతను వదిలించుకోవాలనుకోకూడదు.

♦ బంధువులు, స్నేహితులు మీ అబ్బాయి ‘మంచి హీరో’ అని పొగుడుతుంటే ఏమనిపిస్తుంది?
వసుంధర: కష్టపడి పైకి వచ్చాడు. ఒక తల్లిగా ఆనందమే. అయితే నాకా అభినందనలేవీ మనసుకి ఎక్కవు. శర్వా ప్రశాంతంగా ఉంటే చాలు. హీరో అయినా తను ముందు నా కొడుకు. అప్పుడప్పుడూ నైట్‌ షూటింగ్స్‌ చేస్తాడు. రెస్ట్‌ ఉండదు. దానివల్ల ఒక్కోసారి ఆరోగ్యం పాడవుతుంది. ‘గమ్యం’ టైమ్‌లో చాలా ఇబ్బందిపడ్డాడు. అలాంటప్పుడు బాధగా ఉంటుంది.

♦ శర్వా నటించిన సినిమాల్లో మీకు నచ్చినవి?
వసుంధర: ‘అమ్మ చెప్పింది’ సినిమా చాలా ఇష్టం. ఒక్కసారే చూశాను. మళ్ళీ చూడాలనుకోలేదు. ‘వెన్నెల’ కూడా ఇష్టమే. కానీ, ఆ సినిమాని కూడా రెండోసారి చూడాలనుకోలేదు. ఎందుకంటే వాటిలో శర్వా పాత్ర ట్రాజెడీతో ఎండ్‌ అవుతుంది.
శర్వా: ఆ సినిమాలు చూశాక, ‘ఇంకెప్పుడూ చనిపోయే క్యారెక్టర్లు చేయకురా’ అంది అమ్మ. అది సినిమాయే అయినా అమ్మకు నన్నలా చూడటం నచ్చదు. అందుకే అలాంటి క్యారెక్టర్లు మానేశా.
వసుంధర: ‘శతమానం భవతి’, ‘రన్‌ రాజా రన్‌’ సినిమాలు బాగా నచ్చాయి. శర్వా గెటప్స్‌ సరిగా ఉండటం లేదని అనుకునేవాళ్లం. ‘రన్‌ రాజా రన్‌’ని చాలా ఎంజాయ్‌ చేశాం. ఆ సినిమాలో రౌడీ టైప్‌ గెటప్‌ నచ్చింది.

♦ యంగ్‌ హీరోల్లో వరుస హిట్లతో మీ అబ్బాయి దూసుకెళుతున్నారు.. ఎలా అనిపిస్తోంది?
వసుంధర: తక్కువ టైమ్‌లో వరుస హిట్స్‌ వస్తాయని అనుకోలేదు కానీ, ఏదో ఒక రోజు సాధిస్తాడన్న నమ్మకం ఉండేది. శర్వా కష్టానికి ఆ భగవంతుని కృప తోడైంది. అందుకే ఇంత సక్సెస్‌ అయ్యాడు. చిన్నప్పటి నుంచి శర్వాకు పట్టుదల ఎక్కువ. ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు వదిలి పేట్టే రకం కాదు.

– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement