పెట్టుబడుల గేరు మార్చండిలా... | investment ...geru | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల గేరు మార్చండిలా...

Published Fri, Aug 22 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

పెట్టుబడుల గేరు మార్చండిలా...

పెట్టుబడుల గేరు మార్చండిలా...

పెట్టుబడి సాధనాలను ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్స్ (వాహనాలు)గా కూడా వ్యవహరిస్తుంటారు. భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు, ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి మరింత మెరుగైన స్థాయికి చేరుకునేందుకు ఇవి నిజంగానే వాహనాలుగా ఉపయోగపడుతుంటాయి. వాహనంపై ప్రయాణించేటప్పుడు గమ్యం దగ్గర్లో ఉన్నా .. చాలా దూరంగా ఉన్నా  పరిస్థితులను బట్టి గేరు మారిస్తేనే గమ్యాన్ని చేరుకోగలం.

అదే విధంగా మనం నిర్దేశించుకున్న భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల దిశగా ప్రయాణం సాగించేటప్పుడు కూడా ఆయా సందర్భాలు, వయసును బట్టి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడుల తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఆసాంతం ఒకే గేరుపై వెడితే గమ్యాన్ని చేరుకోవడానికి ఎలా కష్టసాధ్యంగా ఉంటుందో.. పెట్టుబడి సాధనాల విషయం కూడా అంతే. అందుకే.. ఏ సందర్భానికి ఏ వాహనం,  ఏ గేరు (సాధనం) అనువైనదో తెలుసుకోవడం మంచిది.
 
సాధారణంగా వాహనంలో నాలుగైదు గేర్లు ఉంటాయి. వేగాన్ని బట్టి గేరు ఉపయోగించాల్సి ఉంటుంది.  గమ్యం దగ్గర్లోనే ఉండి  నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు 1-2 గేర్లు,  అదే చాలా సుదీర్ఘ ప్రయాణమైతే.. మరింత వేగానికి 4-5 గేర్లు ఉపయోగించాల్సి వస్తుంటుంది. వివిధ వాహనాలు, గేర్లలాగే పెట్టుబడి సాధనాల్లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అవే డెట్, ఈక్విటీ సాధనాలు. వడ్డీ రూపంలో ఆదాయాన్నిచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి డెట్ కోవకి వస్తే.. స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు ఈక్విటీల కిందికి వస్తాయి.
 
ఏ గేరు ఎప్పుడు..
 
డెట్ సాధనాలనేవి.. గమ్యం చేరువలో ఉన్నప్పుడు.. తక్కువ వేగంలో వెళ్లేందుకు ఉపయోగపడే గేర్లలాంటివి. ఎప్పటికప్పుడు పెరిగిపోయే రేట్లను పరిగణనలోకి తీసుకుంటే వీటిపై వచ్చే రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఢోకా మాత్రం ఉండదు.  వీటిని స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఉపయోగించుకోవచ్చు.  

ఉదాహరణకు.. మరో రెండు మూడేళ్లలో అమ్మాయి పెళ్లి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే వీటిని ఎంచుకోవచ్చు. అదే.. సదరు అమ్మాయికి ప్రస్తుతం రెండేళ్ల వయస్సుండి.. పెళ్లి ఇరవై ఏళ్ల సుదీర్ఘమైన కాలం తర్వాత చేయాల్సి ఉంటే.. ఈ డెట్ సాధనాలు పనిచేస్తాయా? అంటే పెద్ద  లాభసాటిగా పనిచేయవు.  కనుక.. ఇక్కడ గమ్యం చాలా దూరంలో ఉంది కాబట్టి గేర్లు మార్చాలి.

మరింత వేగంగా వెళ్లగలిగేందుకు ఉపయోగపడే పై గేరుకి మారాలి. అంటే పెట్టుబడికి సంబంధించి.. సాధనాన్ని మార్చుకోవాలి. దీర్ఘకాలంలో అధిక రాబడులు అందించగలిగే సత్తా ఉన్న ఈక్విటీలను ఎంచుకోవాలి. ఉదాహరణకు.. 2010కి ముందు సుమారు ఇరవై ఏళ్ల వ్యవధిలో సెన్సెక్స్ వార్షికంగా 17 శాతం రాబడి ఇస్తే.. ముప్ఫయి ఏళ్ల వ్యవధిలో 19 శాతం ఇచ్చింది. అంటే.. ఒక రూ.1 లక్షను 1990లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 2010 నాటికి రూ. 23 లక్షలే వచ్చేది. అదే 1980లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏకంగా రూ. 1.84 కోట్లు వచ్చేది. ఇదే షేర్ల సత్తా.
 
మరి వాహనంపై వేగంగా వెళ్లినప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లే.. ఈక్విటీల్లోనూ రాబడికి తగ్గ రిస్కులు ఉంటాయి. వాహనంపై వెళ్లేటప్పుడు ప్రమాదం జరగకుండా ఎలా నేర్పుగా తప్పించుకుని వెడతామో.. షేర్ల విషయంలోనూ రిస్కులను తట్టుకుని ముందుకు వెళ్లగలగాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement