
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) ఏదో పని మీద బజార్ వెళుతున్నారు. అంతలో ఒక వ్యక్తి కనబడి, ‘ఓ ప్రవక్త (స) మీతో కాస్త పని ఉంది ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను’ అని వెళ్లాడు.‘‘అలాగే తొందరగా రా’’ అని ప్రవక్త అక్కడే నిలబడ్డారు.వెళ్ళిన వ్యక్తి ఆ విషయం మరచిపోయాడు.ఇచ్చిన మాట ప్రకారం ప్రవక్త (స) చాలా సేపు అలాగే నిరీక్షిస్తూ నిలబడ్డారు.
చాలాసేపటికి మళ్ళీ ఆ వ్యక్తి అటుగా వచ్చి, ‘‘అయ్యో! మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారా? క్షమించండి. నేను ఈ విషయం మరిచే పోయాను’’‘‘ఇచ్చిన మాట తప్పితే శిక్ష ఏమిటో తెలుస్తే, నువ్వు కూడా ఎన్ని రోజులైనా ఇలాగే నిలబడి ఉంటావు తెలుసా?’’ అన్నారు.
‘‘మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. ప్రమాణ భంగానికి పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం పదిమంది పేదలకు పెట్టడం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వడం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యడం. ఈ స్తోమత లేనివారు మూడు రోజులపాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి.’(ఖురాన్:5:89)మనిషి సంఘజీవి.
సమాజంలో ఒకరిమీద మరొకరికి నమ్మకం లేకపోతే మనుషులు నమ్మకంతో సత్సంబంధాలు కలిగి జీవించడం కష్టం. అందుకే మాట ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వాలని, వాగ్దానం చేసే ముందు ‘ఇన్షాల్లహ్’ అంటే అల్లాహ్ తలిస్తే అని అనాలని ప్రవక్త (స) తెలిపారు.నిజమే కదా. ఏ క్షణాన మృత్యువు కౌగిట్లోకి ఒదిగిపోతామో మనకు తెలియదు. మాట ఇచ్చి, నెరవేర్చకుండా మరణిస్తే? రేపు పరలోకంలో పట్టుబడిపోతాం. జవాబు దారితనాన్ని పటిష్టం చేసుకోవడానికే కదా ఈ రమజాన్‌లో కఠోర ఉపవాస దీక్ష పాటిస్తున్నాం. కనుక వాగ్దానం చేసి మరచిపోకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలి.
–షేక్ అబ్దుల్ బాసిత్