బిగ్‌బాస్ కమింగ్ సూన్!
‘హాయ్.. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్‌బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పీఏడిఎమ్‌ఎస్‌ఆర్‌ఐ అని టైప్ చేసి డబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్‌కి ఎస్సెమ్మెస్ చేయండి.. ప్లీజ్ ఓట్ ఫర్ మీ!’ గుర్తుందా.. దూకుడు సినిమాలో బ్రహ్మానందం ఓట్ల కోసం పడిన పాట్లు! ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న తెలుగు బిగ్‌బాస్‌లో బ్రహ్మానందం రియల్‌గానే పార్టిసిపేట్ చేస్తారేమో! ఇంకా ఎందరు ప్రముఖులు బిగ్‌బాస్‌లో పార్ట్ తీసుకుంటారేమో! బిగ్ బాస్ త్వరలో తెలుగులో...
మధ్యతరగతి ఇళ్లల్లో సీసీ కెమెరా పెడితే ఎలా ఉంటుంది? కలర్స్ చానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ రియాలిటీ షోలా ఉంటుంది! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి ఎందుకు డిస్కషన్ అనే డౌట్ వచ్చింది కదా? ఒక ప్రముఖ తెలుగు చానల్ ఆ షోను ‘బిగ్‌బాస్’ పేరుతోనే త్వరలో ప్రసారం చేయబోతోంది. హిందీలో సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేసిన ఈ షోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ చేయనున్నారు. అదీ బిగ్ న్యూస్.
హిందీ బిగ్ బాస్ ... థీమ్
వివిధ రంగాలకు చెందిన పద్నాలుగు మంది ప్రముఖులు ఈ షోలో పాల్గొంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఇంటిని నిర్మిస్తారు. దాన్ని ‘బిగ్ బాస్ హౌజ్’ అని వ్యవహరిస్తుంటారు. అంగుళం అంగుళం సీసీ కెమెరా లెన్స్‌లో బందీ అయి ఉంటుందీ ఈ ఇల్లు. అంతేకాదు బయటి ప్రపంచం ఊసు తెలియకుండా ఏకాంత ప్రదేశంలో ఉంటుంది. పద్నాలుగు మంది సభ్యులు మూడు నెలలు ఈ ఇంట్లో ఉండాలి. అంటే ఈ షో దాదాపు మూడు నెలలు కొనసాగుతుందన్నమాట. ప్రతి వారం ఈ ఇంట్లోని పద్నాలుగు మంది సభ్యులు తమ తోటి సభ్యులిద్దరిని నామినేట్ చేస్తుండాలి. ఎవరైతే ఎక్కువ మంది నామినేషన్ పొందుతారో వాళ్లు పబ్లిక్ వోటింగ్ అంటే ప్రేక్షకుల వోటింగ్‌కి వెళతారు. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతుంటారు. చివరకు ముగ్గురు మిగులుతారు. ఈ ముగ్గురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన సభ్యుడు లేదా సభ్యురాలు విజేతగా నిలిచి నిర్దేశించిన ప్రైజ్ మనీని గెలుచుకుంటారు.
బిగ్ బాస్ రూల్స్
చాలా సింపుల్. హిందీ బిగ్‌బాస్‌లో అయితే పాల్గొనే పద్నాలుగు మంది సభ్యుల మాతృభాష ఏదైనా సరే బిగ్ హౌజ్‌లో మాత్రం కేవలం హిందీలోనే మాట్లాడాలి. అత్యవసర పరిస్థితి వస్తే తప్ప మూడు నెలలు ఈ ఇంటిని వదిలి వెళ్లకూడదు. అలాగే తాము నామినేట్ చేయబోయే వ్యక్తుల గురించి సభ్యులు ఇతర సభ్యులతో చర్చించకూడదు. బిగ్‌బాస్ (హోస్ట్) వీళ్లకు కనపడకుండా కేవలం గొంతు మాత్రం వినిపిస్తుంటాడు. తాము నామినేట్ చేయబోయే సభ్యుల గురించి కూడా ఓ ప్రత్యేక కాబిన్‌లాంటి గదిలోకి వెళ్లి మైక్‌లో వినిపిస్తున్న బిగ్ బాస్‌తో మాత్రమే చెప్పాలి. అలాగే పగటిపూట అంటే డే టైమ్‌లో ఈ సభ్యులెవరూ నిద్రపోకూడదు. ఈ పద్నాలుగు మంది గాక అప్పుడప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రత్యేక అతిథులు ఈ హౌజ్‌కి వస్తుంటారు.
నైన్‌టీన్ ఎయిటీ ఫోర్
బిగ్ బాస్‌కు మూలం నెదర్లాండ్స్‌లో ప్రసారం అయిన ‘బిగ్ బ్రదర్’ రియాలిటీ షో. ఇది ప్రసారం అయిన కొన్నిరోజుల్లోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. ఎంతలా అంటే 40 దేశాలు తమ తమ భాషల్లో.. ఈ షోని రీమేక్ చేసుకునేంతగా. 1949లో జార్జ్ ఆర్వెల్ అనే రచయిత ‘నైన్‌టీన్ ఎయిటీఫోర్’పేరుతో ఓ నవల రాశాడు. ఒక నియంత తన దేశంలోని ప్రతి పౌరుడి కదలికల మీద నిఘా పెట్టి వాళ్ల వ్యక్తిగత జీవితాలనూ కట్టడి చేస్తుంటాడు. ఈ కథాంశంతో వెలువడ్డ ‘నైన్‌టీన్ ఎయిటీఫోర్’ నవల ఘనవిజయం సాధించింది. ఈ నవల పబ్లిష్ అయిన దాదాపు 50 ఏళ్లకు అంటే 1999లో ‘బిగ్ బ్రదర్’ రియాలిటీ షో బిగిన్ అయింది. ఆ బిగ్ బ్రదర్ నుంచి మనం ‘బిగ్ బాస్’ను తెచ్చుకున్నాం.
తొలి హోస్ట్ అర్షద్ వార్సీ
‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ మొదలైంది 2006లో. అప్పటి నుంచి పదో సీజన్ (2017 జనవరి) వరకూ పది సీజన్స్ టెలికాస్ట్ అయ్యాయి. నటుడు అర్షద్ వార్సీతో ఫస్ట్ సీజన్ మొదలైంది. ఫోర్త్ సీజన్‌కి కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఎంటర్ కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. 96 రోజుల పాటు సాగిన ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ 5.15. అంతకుముందు రేటింగ్‌తో పోల్చితే దాదాపు డబుల్ అయింది. విశేషం ఏంటంటే.. ఆరో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకూ సల్మాన్ ఖానే హోస్ట్. సల్మాన్ హోస్టింగ్ ‘సూపర్’ అనిపించుకుంది. మళ్లీ తొమ్మిది, పది సీజన్లకు ఆయనే హోస్ట్. 2.90, 3.54 టీఆర్పీ రేటింగ్. ఇప్పుడు పదకొండో సీజన్‌కి అంతా రెడీ అవుతోంది. ఈ షోలో పాల్గొనేవాళ్లు మే నుంచి జూన్ చివరి లోపు నిబంధనలకు అనుగుణంగా తమ వివరాలను పంపించాలి. అక్టోబర్‌లో షో మొదలవుతుంది.
ఇప్పటికి ఆరు ‘బిగ్ బాస్’ సీజన్స్‌ని సూపర్‌గా నిర్వహించిన సల్మాన్ ఖాన్ లెవెన్త్ సీజన్‌కి హోస్ట్‌గా ఉంటారా? లేదా? కలర్స్ ఛానల్ ‘దస్ కా ధమ్’ షోకు మళ్లీ ఆయన్ను తీసుకోవాలనుకుంటోందట. మరి.. ఈ షో ఒప్పుకుంటే సల్మాన్ ‘బిగ్ బాస్’ చేయగలుగుతారా? అనే ఉత్కంఠ అటు సినిమా ఇండస్ట్రీలోనూ నెలకొంది.
హౌస్ ఫుల్‌గా సెలబ్రిటీలు, చుట్టూ కెమెరాలు, ఆ సెలబ్రిటీల మధ్య స్నేహాలు, ప్రేమలు, ఫైటింగ్‌లు, ద్వేషాలు, నమ్మక ద్రోహాలు, డ్రామా.. భారతీయ టీవీ వీక్షకుల కన్నులకు ఇంతకు మించిన పండుగ ఏముంటుంది? ఒక్కమాటలో.. ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అనేది.. రోజులు, నెలల పాటు సాగే బాలీవుడ్ మూవీ అనుకోండి. ఇప్పటి వరకు 10 సీజన్‌లుగా ‘బిగ్ బాస్’ టీవీలో ప్రసారం అయింది. ఈ పదేళ్ల విశేషాలలో కొన్ని ఆసక్తికరమైన సంగతులు...
►బిగ్ బాస్ హిస్టరీలో అత్యధికంగా ఎవిక్షన్ ఓట్లు పడిన పార్టిసిపెంట్ పూజా మిశ్రా. బిగ్ 5లో ఎనిమిది వారాల పాటు ఆమె షోలో ఉన్నారు.
►వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ షో లోకి ప్రవేశించిన వారిలో ఒక్కరు కూడా ఇంతవరకు విజేత కాలేదు. అజాజ్ ఖాన్ అవుతాడనుకున్నారు. కాలేదు.
►కొన్నిసార్లు కంటెస్టెంట్‌లకు తిండిక్కూడా కరువొస్తుంటుంది. సోనాలీ రావత్ అయితే చాలాసార్లు ఉప్పు లేని పప్పు, మసాలాలతో సరిపెట్టుకున్నారట.
►ఒక్క ఎవిక్షన్ ఓటు కూడా లేకుండా ఎక్కువ రోజులు హౌస్‌లో నిలబడిన రికార్డు మాత్రం నవ్‌జోత్‌సింగ్ సిద్ధూదే.
►బిగ్ బాస్ షో లో లిక్కర్ అడిగిన వారికి జ్యూస్ బాక్సులో లిక్కర్ పోసి ఇస్తారని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు.
► బిగ్ బాస్‌లో కనిపించిన తొలి అంతర్జాతీయ కంటెస్టెంట్ జేడ్ గూడీ. మధ్యలో క్యాన్సర్ బయట పడడంతో గూడీ షో నుంచి విరమించుకున్నారు. 2009తో ఆమె చనిపోయారు.
► బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ బిగ్ బాస్ చరిత్రలోనే ఎక్కువసార్లు బిగ్ ఎవిక్షన్ (తొలగింపు) కు గురయ్యారు.
► యంగెస్ట్ విజేత గౌతమ్ గులాటీ. బిగ్ బాస్ 8లో విన్ అయ్యే నాటికి అతడి వయసు 27. ప్రస్తుతం 29. ఇతడూ టీవీ యాక్టరే.
► బిగ్ బాస్ షో లో 3వ సీజన్ అన్ని సీజన్‌ల కన్నా అతి తక్కువగా 84 రోజులు మాత్రమే నడిచింది. ఇప్పటివరకు 105 రోజులే హయ్యస్ట్.
► బిగ్ బాస్ షో లో పగటిపూట నిద్రపోకూడదు. ఎవరికైనా నిద్ర వస్తే కెమెరా కంట పడకుండా టేబుల్ కిందో, సోఫాల వెనకో పడుకునేవారు.
►షోకి ఓ సీజన్‌లో గెస్టుగా వచ్చిన అంతర్జాతీయ నటి పమేలా ఆండర్సన్.. మూడు రోజులు హౌస్‌లో ఉన్నందుకు రూ.2 కోట్ల 50 లక్షలు చార్జి చేశారు.
►బిగ్ బాస్‌లో ఇప్పటివరకు ఓల్డెస్ట్ విజేత.. విందు దారాసింగ్. బిగ్ బాస్ 3 లో గెలిచే నాటికి ఈ టీవీ నటుడి వయసు 41 ఏళ్లు. ప్రస్తుతం 53 ఏళ్లు.
► సారాఖాన్, అలీ మర్చంట్‌ల పెళ్లి బిగ్ బాస్ రియాలిటీ షో లోనే జరిగింది. అయితే రెండు నెలల తర్వాత విడాకులు తీసుకున్నారు!
►సీజన్ 7 తొలిసారిగా 105 రోజులు నడిచింది. ఆ తర్వాత 8, 9, 10 సీజన్‌లు 105 రోజులు నడిచాయి. వీటన్నిటికీ సల్మాన్ ఖానే హోస్ట్.
►షోలో ఉన్న కంటెస్టెంట్‌లకు కొన్నిసార్లు బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి. అప్పుడు ఒకరివి ఒకరు వేసుకుని
కనిపిస్తారు!
►రేడియో జాకీ ప్రీతమ్ తన కూతురుకు నడక రావడాన్ని తొలిసారి బిగ్ బాస్ షో లోనే చూశాడు. ఎత్తుకుని మురిసిపోయాడు.
‘బిగ్‌బాస్’ లాంటి టాప్ షో ద్వారా ఎన్టీఆర్ బుల్లితెరకు పరిచయం కానుండడం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉందని ప్రముఖ టీవీ యాంకర్ సుమ తెలిపారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం టీవీ చాలా అభివృద్ధి దశలో పయనిస్తోంది. దీనికి ఉదాహరణే... మొన్న నాగార్జున గారు, నిన్న చిరంజీవి గారు, నేడు తారక్ హోస్ట్‌లుగా వచ్చారు. ఈ కోవలోకి ఇంకా ఎంతమంది వస్తారో వేచి చూడాలి. తారక్ విషయానికి వస్తే అతని స్క్రీన్ ప్రెజెన్స్, వాగ్ధాటి సూపర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చిన్నితెరపై ఎలా ఉంటుందో మీ అందరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను. టెలివిజన్ పరిశ్రమ పెద్దగా ఫీలయ్యే క్షణాలివి’’ అన్నారు.