పోలీస్‌ 'వనం' | Kamareddy Police Plants 3500 Haritha Vanam SP Swetha | Sakshi
Sakshi News home page

పోలీస్‌ 'వనం'

Published Fri, Feb 28 2020 7:48 AM | Last Updated on Fri, Feb 28 2020 7:48 AM

Kamareddy Police Plants 3500 Haritha Vanam SP Swetha - Sakshi

హరిత రక్షక వనంలో పెరుగుతున్న మొక్కలు

పర్యావరణ హితం కోరి తమ వంతుగా మొక్కలను నాటే కార్యక్రమాలను చాలా మంది చేపడుతుంటారు. ఆ తర్వాత ఆ మొక్కల సంరక్షణగాల్లో దీపంలాగే ఉంటుంది. కానీ, శాంతి భద్రతలకు సంబంధించిన
వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే అనేక సామాజిక అంశాలపైనా స్పందిస్తున్నకామారెడ్డి జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు సిబ్బంది కలిసి ఓ వనాన్నే ఏర్పాటుచేశారు. ఆరెకరాల స్థలంలో 80 రకాలైన 3,500 మొక్కలు నాటి వాటినిసంరక్షించడం ద్వారా ఇప్పుడు అడవిని తలపిస్తున్నారు. ప్రకృతికీ రక్షణగాఉన్నామంటూ తమ చేతల ద్వారా నిరూపిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం కోసం పట్టణ శివార్లలో 31.30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆరు ఎకరాల స్థలాన్ని ఎస్పీ శ్వేత మొక్కల పెంపకం కోసం ఎంపిక చేసి, మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడేందుకు నిరంతరం ఆమెతో పాటు పోలీసు సిబ్బందీ శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగి పెద్దయ్యాయి. ఈ స్థలంలో హరితహారం కింద మొక్కలు నాటాలని సంకల్పించిన ఎస్పీ శ్వేత అప్పటి కలెక్టర్‌ సత్యనారాయణతో చర్చించారు. నీటి సౌకర్యం కల్పిస్తే వనాన్ని సృష్టిస్తానని మాటిచ్చారు. కలెక్టర్‌ తన నిధుల నుంచి రూ.2.18 లక్షలు విడుదల చేసి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశారు. డ్రిప్‌ సౌకర్యమూ కల్పించారు. దీంతో జిల్లా ఎస్పీ శ్వేత ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) పోలీసుల సాయంతో మొక్కలు నాటి, వాటిని కాపాడేందుకు శ్రమించారు.

మూడేళ్లుగా..
ప్రతీ రోజూ ఎస్పీ రక్షకవనానికి వెళుతూ అక్కడి పనుల్లో భాగమవుతున్నారు. ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్‌ కార్యక్రమాలు పోలీసులు ఇక్కడే చేస్తుంటారు. ఈ వనానికి హరిత రక్షక వనం అన్న నామకరణ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీస్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్‌ గంప గోవర్దన్‌లతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేతను ‘వనదేవత’గా పోలీసు సిబ్బంది కొనియాడారు.

భూమిని చదును చేసిమొక్కలు నాటుతున్న పోలీసు సిబ్బంది (ఫైల్‌)
80 రకాల మొక్కలు
వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పెరిగే అటవీ వృక్ష జాతులకు సంబంధించి దాదాపు 80 రకాల మొక్కలు .. రామ సీతాఫలం, బాదం, శ్రీగంధం, టేకు, ఖర్జూరం, వేప, పనస, మారేడు, చింత, దానిమ్మ, జామ, ఈత, మామిడి, మేడి, మునగ, నిమ్మ, పసన, ఉసిరి, వెలగ,  మారేడు, కుంకుడు, కదంబం, నల్లజీడి, రాచ ఉసిరి, జిట్రేగి తదితర రకాలకు సంబంధించి 3,500 మొక్కలు నాటారు. 

వనంలో నీటి గుంతలు
ఈ వనంలో రెండు నీటి గుంతలు తవ్వించి, అందులో నీరు నిల్వ ఉంచుతున్నారు. వర్షపు నీరు ఆ గుంతలో నిండేలా ఏర్పాటు చేశారు. పైభాగాన ఉన్న గుంతలో పది అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అందులో చేప పిల్లలను వదిలారు. నీటి నిల్వ వల్ల బోరుబావుల్లో భూగర్భజలానికి ఇబ్బంది లేకుండాపోయింది.

హరితవనంలో తవ్విన నీటి గుంత
అందరి సహకారం
హరిత హారం స్ఫూర్తితోనే పర్యావరణ పరిరక్షణకు పోలీసు శాఖ ఏదైనా చేయాలని భావించాను. ఆ ఆలోచనలోంచి వచ్చినదే హరిత రక్షక వనం. మట్టిదిబ్బలు, రాళ్లతో నిండి ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని చదును చేసి అందులో మొక్కలు నాటాలని సంకల్పించాను. ఆ రోజు కలెక్టర్‌ సత్యనారాయణ గారిని నీటి వసతి కల్పించాలని కోరిన వెంటనే మంజూరు చేశారు. డ్రిప్‌ సౌకర్యం కూడా కల్పించారు. ఇక మా ఏఆర్‌ పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది అందరం కలిసి మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడంలోనూ అందరం శ్రమించాం. అందరి శ్రమకు తగ్గట్టుగానే ఇప్పుడు అడవిగా మారింది. మరో రెండు, మూడేళ్లలో మరింత వృద్ధి్ద చెందుతుంది.– ఎన్‌.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి

పోలీసుల శ్రమ
ఈ వనంలో రోజూ ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు శ్రమిస్తారు. మొక్కలు నాటిన నాటి నుంచి రోజూ పర్యవేక్షిస్తున్నారు. మొక్కల చుట్టూ పెరిగే కలుపు తొలగించడం, నీరు మొక్కమొక్కకు చేరుతుందా లేదా చూసుకోవడం,పనికిరాని చెత్తను తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. ఏఆర్‌ పోలీసుల శ్రమకు ఫలితం దక్కింది. వారి నిరంతర శ్రమతో ఇప్పుడు ఈ ప్రాంతం అడవిగా మారింది.– సేపూరి వేణుగోపాలాచారి,సాక్షి, కామారెడ్డిఫొటోలు: అరుణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement