నాగుర్రప్పిల్ల విశ్లేషణ | Kathasaram On Lucia Berlin Story | Sakshi
Sakshi News home page

నాగుర్రప్పిల్ల విశ్లేషణ

Published Mon, Nov 25 2019 12:52 AM | Last Updated on Mon, Nov 25 2019 12:53 AM

Kathasaram On Lucia Berlin Story - Sakshi

ఎమర్జెన్సీలో పనిచేయటం నాకిష్టం– అక్కడ మనం ఎటూ మగవాళ్లనే కలుస్తాం. నిజమైన మగవాళ్లు, హీరోలు. ఫైర్‌మ్యాన్లు, జాకీలు. వాళ్లెప్పుడూ ఎమర్జెన్సీ గదుల్లోకి దూరుతుంటారు. జాకీల ఎక్స్‌రేలు అద్భుతంగా ఉంటాయి. వాళ్లు ఎప్పుడూ ఎముకలు విరగ్గొట్టుకుంటుంటారు, కానీ తమకు తామే కేవలం ఏదో టేపు చుట్టేసుకుని తరువాతి పందెంలో పాల్గొంటుంటారు.

వాళ్ల అస్థిపంజరాలు చెట్లలా కనబడతాయి, పునర్నిర్మించిన బ్రాన్టోసారస్‌లా. సెయింట్‌ సెబాస్టియన్‌ ఎక్స్‌రేలా.
నా దగ్గరికే జాకీల్ని ఎందుకు పంపుతారంటే వాళ్లందరూ మెక్సికన్లు, నేను స్పానిష్‌ మాట్లాడగలను. నేను కలిసిన మొదటి జాకీ మున్యోజ్‌. వచ్చినవాళ్లందరి బట్టల్ని నేను విప్పాల్సివుంటుంది, అదేం పెద్ద విషయం కాదు, కొన్ని సెకన్లలో అయిపోతుంది. మున్యోజ్‌ అక్కడ పడివున్నాడు, స్పృహలో లేకుండా, దేవుడా! కామరూపంలోని యాజ్టెక్‌ శిల్పంలా. అతడి దుస్తులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయంటే నేనేదో సుదీర్ఘ క్రతువును నిర్వహిస్తున్నట్టు అనిపించింది. అవి విప్పేసరికి అలసిపోయినంత పనైంది, మిషిమా రచనల్లో గొప్పింటి మహిళ తన కిమోనో విప్పడానికి మూడు పేజీలు పట్టినట్టు. అతడి రాణీరంగు సిల్కు చొక్కాకు భుజం వెంబడి ప్రతి చిన్న మలుపు దగ్గరా ఎన్నో బొత్తాములున్నాయి. అతడి ప్యాంటు దట్టమైన అల్లికతో కట్టబడివుంది. అన్నీ పాతకాలపు(ప్రి–కొలంబియన్‌) ముడులు. అతడి బూట్లు పేడ, చెమట వాసన వేస్తున్నాయి, కానీ అవి సిండెరెల్లా బూట్లంత మెత్తగా, నాజూగ్గా ఉన్నాయి. అతడు పడుకొనే ఉన్నాడు, వశం చేసుకోగలిగే యువరాజు.

అతడు మేలుకోవడానికి ముందే వాళ్లమ్మ గురించి కలవరించడం మొదలుపెట్టాడు. అతడు కేవలం నా చేయిని మాత్రమే పట్టుకోలేదు కొందరు రోగుల్లా, నా మెడను వాటేసుకొని మామసీటా, మామసీటా అని వెక్కడం మొదలుపెట్టాడు. ఊయల్లోని బుజ్జాయిలా నేను పట్టుకున్నప్పుడు మాత్రమే అతడు డాక్టర్‌ జాన్సన్‌ను పరీక్షించనిచ్చాడు. అతడు పిల్లాడంత బుజ్జిగా ఉన్నాడు కానీ బలంగా, మగటిమితో ఉన్నాడు. నా ఒడిలో ఒక మగవాడు. కలల పురుషుడు? కలల చిన్నారి?

నేను మున్యోజ్‌ను స్ట్రెచర్‌ మీదికి మార్చడానికి తంటాలు పడుతున్నప్పుడు డాక్టర్‌ జాన్సన్‌ నా నుదుటిని స్పాంజితో తుడిచాడు. కచ్చితంగా ఇతడి కంటె ఎముక విరిగివుంటుంది, కనీసం మూడు పక్కటెముకలు విరిగుంటాయి, బహుశా మెదడుకో గట్టి దెబ్బ తగిలేవుంటుంది. లేదు, అన్నాడు మున్యోజ్‌. రేప్పొద్దుటి పందెంలో అతడు స్వారీ చేయాలి. ఇతణ్ని ఎక్స్‌ రే తీయండి, అన్నాడు డాక్టర్‌ జాన్సన్‌. స్ట్రెచర్‌ మీద అతడు పడుకోవడం లేదు కాబట్టి కిందికి కారిడార్‌ దాకా నేనే మోసుకెళ్లాను, కింగ్‌ కాంగ్‌లాగా. అతడు భీతిల్లి ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు, అతడి కన్నీళ్లతో నా రొమ్ము తడిచిపోయింది.
ఎక్స్‌ రే టెక్నీషియన్‌ వచ్చేవరకూ ఆ చీకటి గదిలో మేము వెయిట్‌ చేశాం. ఒక గుర్రాన్ని ఉపశమింపజేసినట్టుగా నేను అతడిని ఓదార్చాను. కాల్‌మాతే, లిండో, కాల్‌మాతే, ఏం ఫర్లేదు, బంగారం, ఏం ఫర్లేదు.

డిస్పాసియో... డిస్పాసియో. నెమ్మదిగా... నెమ్మదిగా. నా చేతుల్లో శాంతించాడు, మృదువుగా ఎగబీల్చాడు, బుస కొట్టాడు. అతడి చక్కటి వెన్నుపూసను నిమిరాను. ఒక దివ్యమైన గుర్రప్పిల్లలాగా అదోసారి చిన్నగా పులకించింది, కంపించింది. అద్భుతంగా ఉండిందది.
(బ్రాన్టోసారస్‌= ఒక రకం డైనోసార్‌; యుకియో మిషిమా= జపాన్‌ రచయిత; యాజ్టెక్‌= పదిహేనో శతాబ్దంలో మెక్సికోలో వర్ధిల్లిన సామ్రాజ్యం)
 
లూసియా బ్రౌన్‌ బెర్లిన్‌ (1936–2004) రచనలు ఇప్పుడు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమెరికా దాచుకున్న రహస్యం అని ఆమెను అభివర్ణిస్తున్నారు. ‘ఎ మాన్యువల్‌ ఫర్‌ క్లీనింగ్‌ విమెన్‌’ ఎంపిక చేసిన ఆమె కథల సంపుటి. ఈ అమెరికన్‌ రచయిత్రి ఆలస్యంగా రాయడం ప్రారంభించింది. అనారోగ్యం ఆమెను దీర్ఘకాలం బాధించింది. క్లుప్తంగా రాయడం లూసియా ప్రత్యేకతల్లో ఒకటి. ఐదు పేరాలు మాత్రమే ఉన్న ఈ కథ 1985లో జాక్‌ లండన్‌ షార్ట్‌ ప్రైజ్‌ గెలుచుకుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement