
బాండ్లపైనే భరోసా..
సెలబ్రిటీ స్టైల్..
ఫ్లాప్‌తో సినీ కెరియర్‌ను ప్రారంభించిన కత్రినా కైఫ్ .. నేడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. హాటెస్ట్ సెలబ్రిటీ, సెక్సీయస్ట్ ఏషియన్. ఇటీవల ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన టాప్ 10 సంపన్న సెలబ్రిటీల లిస్టులో నిల్చిన ఏకైక నటి. మల్లీశ్వరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నటన, అఫైర్స్ గురించిన విమర్శలు ఎలా ఉన్నా.. ఆర్థిక విషయాల్లో కత్రినా కైఫ్ చాలా క్రమశిక్షణగానే ఉంటుంది. డబ్బును గౌరవిస్తుంది. అలాగే, తల్లి సూసాన్ చేపట్టే సామాజిక కార్యకలాపాల్లో కూడా పాలుపంచుకుంటూ ఉంటుంది. ఆర్థిక అంశాల గురించి మరిన్ని వివరాలు కత్రినా మాటల్లోనే..
‘మాది చాలా పెద్ద కుటుంబం. అలాగని పెద్దగా ఆస్తిపాస్తులూ లేవు. కాబట్టి డబ్బు విలువ నాకు బాగా తెలుసు. అలాగే కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా ఉండటం ఎంత ముఖ్యమో కూడా తెలుసు. కాబట్టే దానికి ప్రాధాన్యమిస్తాను. నేను అస్సలు ఎక్కువగా షాపింగ్ చేయడం గానీ భారీ ఖర్చులు గానీ చేయను. వ్యక్తిగతంగా నేను చాలా సింపుల్‌గా డ్రెస్ చేసుకోవడాన్ని ఇష్టపడతాను.
నా దుస్తులు నేనే కొనుక్కుంటాను. ఖరీదైన డ్రెస్సులు కొనను. ఖరీదైన వాచీలు, ఆభరణాల జోలికి కూడా పోను. ఇలాంటివి అనవసర ఖర్చులని నా ఉద్దేశం. ట్రావెల్‌పై మాత్రమే కాస్త ఖర్చుపెడతాను. మరీ ఏదైనా బాగా నచ్చితే కొంటాను.. లేకపోతే షాపింగ్ తక్కువగానే ఉంటుంది. నా మటుకు నేను ఫిక్సిడ్ డిపాజిట్లు, బాండ్లు వంటి సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతాను.
మహిళలు ఇన్వెస్ట్ చేయడానికి రియల్టీ కూడా మంచి సాధనమే. ప్రస్తుతానికైతే అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ నేను పెద్దగా చేయలేదు కానీ చేయాలనుకుంటున్నాను. న్యూ ఇయర్ వేడుకల్లాంటి పార్టీల్లో డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు కానీ లండన్‌లో మరో ఇల్లు కొనుక్కోగలిగేంత భారీ అమౌంటుని ఎవరైనా ఆఫర్ చేస్తే.. ఆలోచిస్తా’.