కండలు తిరిగిన కెరీర్‌ | keerthi chenna Miss Physic of Telangana Title won | Sakshi
Sakshi News home page

కండలు తిరిగిన కెరీర్‌

Published Fri, Nov 23 2018 1:16 AM | Last Updated on Fri, Nov 23 2018 8:52 AM

keerthi chenna Miss Physic of Telangana Title won - Sakshi

కీర్తి చెన్నా

ఇంజనీరో, డాక్టరో అంతకీ కాదంటే ఇంకేదైనా గ్లామర్‌ రంగాన్నో అమ్మాయిలు ఎంచుకుంటే ముచ్చటపడేవారే. అదే కనుక అమ్మాయి క్రీడల్లో, మరీ ముఖ్యంగా బాడీ బిల్డింగ్‌ లాంటి కఠినమైన ఏ రంగాన్నో ఎంచుకుంటే ముఖం చిట్లించుకుంటారు. అందుకేనేమో తెలుగు రాష్ట్రాల్లో మహిళా బాడీ బిల్డర్లు దాదాపుగా కనిపించరు. ఈ నేపథ్యంలో వడ్డించిన విస్తరిలాంటి జీవితం ఉన్నా.. వ్యయప్రయాసలను భరిస్తూ బాడీ బిల్డింగ్‌ రంగాన్ని ఎంచుకున్న కీర్తి చెన్నా (25) ఇటీవలే ‘మిస్‌ ఫిజిక్‌ ఆఫ్‌ తెలంగాణ టైటిల్‌’ని గెల్చుకున్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ మన దగ్గర మహిళా బాడీ బిల్డింగ్‌కు కొత్త ఊపిరి పోస్తున్నారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే....

మా నాన్నగారు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. అమ్మ గృహిణి. నా సోదరి సహా  ఫ్యామిలీలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. నేను కాస్మొటాలజీ కోర్సు చేశాను. అయితే ఎవరూ ఎంచుకోని రంగాన్ని ఎంచుకోవాలని దృఢంగా అనిపించింది. అదే సమయంలో జస్ట్‌ హెల్త్‌ కోసం జిమ్‌లో చేరాలనుకున్నా. కాని ఏ జిమ్‌లో చూసినా మహిళా ట్రైనర్లు కనిపించలేదు. అంటే.. బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్‌ అనేవి పురుషులకు సంబంధించినవిగా మాత్రమే పరిగణన పొందుతున్నాయని అర్థమైంది. అప్పుడే అనుకున్నాను.. నేనెందుకు బాడీ బిల్డర్‌ని కాకూడదని. అలా రెండేళ్ల క్రితం నా ఫిజిక్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ఇంట్లో ఒప్పించడం కష్టమే!
నా శరీరాన్ని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్‌ చేసుకునేందుకు బాడీ బిల్డింగ్‌లోకి వెళదామని నిర్ణయించుకున్నా. అయితే అమ్మానాన్నకు నేను బాడీ బిల్డింగ్‌లోకి వెళ్లడం అంత ఇష్టం లేదు. ఈ రంగంలోకి అమ్మాయిలు వెళ్లడాన్ని కుటుంబం ఇష్టపడటం అనేది అంత సులభ సాధ్యం కాదు. అబ్బాయిల్లా మజిల్‌ బిల్డ్‌ అవడం చూసి కంగారు పడటం సహజమే. ఇద్దరం కూతుళ్లమే కాబట్టి నన్ను అబ్బాయిగా అనుకోండి అని చెప్పా.  తర్వాత నా పట్టుదల, కొన్ని చాంపియన్‌షిప్స్‌లో గెలవడం... వీటితో ఇంట్లోవాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. దీన్నేదో నేను ఆషామాషీగా తీసుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో నన్ను ప్రూవ్‌ చేసుకుని మా కుటుంబాన్ని మెప్పించాలనుకుంటున్నా.

కఠిన శ్రమ...కాస్ట్‌లీ రొటీన్‌
అబ్బాయిలకు కాస్త వెయిట్‌ లిఫ్ట్‌ చేస్తే మజిల్‌ వచ్చేస్తుంది. ఈజీగా షేప్‌ అప్‌ అవుతుంది. కాని మహిళలకు అలా కాదు. మరోవైపు బాడీ బిల్డింగ్‌ అంటే వ్యయ ప్రయాసలు ఎక్కువే. మంచి జిమ్‌లో రెండు పూటలా వర్కవుట్స్‌ చేయాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కలిపి రెండు గంటల చొప్పున చేస్తున్నాను. అయితే పోటీల సమయంలో ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. ఉదయం 45 నిమిషాలపాటు కార్డియో, సాయంత్రం వెయిట్‌ ట్రైనింగ్‌ చేస్తున్నాను. జంక్‌ ఫుడ్‌ అసలు తినకూడదు. కూరగాయలు, స్టీమ్‌ ఫుడ్, బాయిల్డ్‌ చికెన్, సాల్మన్డ్‌ ఫిష్, ఎగ్‌వైట్స్‌ తీసుకుంటాను.

అమ్మాయిగానే ఉండాలి
ఒక అమ్మాయి మాత్రమే మరో అమ్మాయి శారీరక తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలదు. నాకైతే మహిళల కోసం మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి జిమ్‌  ప్రారంభించాలని ఉంది. బాడీ బిల్డింగ్‌ రంగంలోకి రావాలనుకునే, మంచి ఫిట్‌నెస్‌ సాధించాలనుకునే మహిళలకు స్ఫూర్తి కావాలని ఉంది.  అమ్మాయిగా మెలితిరిగిన మజిల్‌తో ఉండటం నాకో ప్యాషన్‌. అదే సమయంలో అమ్మాయికి మాత్రమే స్వంతమైన రూపం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఎమ్‌టివి విజె జాకీ నాకు స్ఫూర్తి.  కాంపిటీషన్‌ టైమ్‌లో ఒకలా, మిగిలిన సమయంలో ఒకలా ఫిజిక్‌ని మార్పు చేర్పులు చేసుకుంటూ వెళ్లొచ్చు. ఏదేమైనా... నా విజయాలకు మంచి స్పందన వస్తోంది. మంచి గౌరవం కూడా లభిస్తోంది. ఇటీవలే నాకు స్పాన్సర్‌ కూడా దొరికారు.

ప్రత్యర్థులు అవసరం
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం మహిళా బాడీ బిల్డర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. అదే ఉత్తరాది రాష్ట్రాలు, బెంగళూర్‌ నుంచి బాగా ఉన్నారు. మహారాష్ట్రలో అయితే ఇంటింటికీ ఫిమేల్‌ అథ్లెట్‌ అన్నట్టు ఉన్నారు. రీజనల్‌గా నాకు సరైన ప్రత్యర్థులు లేకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. త్వరలో  మహారాష్ట్రలో జరుగనున్న పోటీల్లో పార్టిసిపేట్‌ చేయనున్నాను మరిన్ని అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాను’’ అంటూ వివరించారు కీర్తి.

– ఎస్‌.సత్యబాబు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement