
ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రా... ఇక పెద్ద సినిమాల్లో చిలిపి పాత్రలు రావా... ఓ లవ్వు.. ఓ కెవ్వు.. ఓ స్టెప్పు లాంటి కమర్షియల్ క్యారెక్టర్లు దొరక్కపోతే లైఫ్ వెలవెలలాడిపోదూ? బ్రాండ్ దశ దిశలా రీ–సౌండ్ కొట్టినా క్రేజ్ కిల్ అయిపోతే కెరియర్ డల్ అయిపోదూ? అని అడిగితే... ‘‘నన్ను మరపించే పాత్రలు రావాలి. మిమ్మల్ని మురిపించే నటన నాది కావాలి’’ అంటున్నారు కీర్తీ సురేష్.
ఒక ‘మహానటి’ పాత్ర చేసినందుకు మీ ఫీలింగ్?
ఇది చాలా పెద్ద రెస్పాన్సిబులిటీ. ఒక లెజెండ్ పాత్ర పోషించాను. ‘మహానటి’ కోసం ఫస్ట్ టైమ్ నన్ను నాగీ (నాగ్ అశ్విన్), స్వప్నా, ప్రియాంకా దత్‌లు అప్రోచ్ అవ్వగానే నో చెప్పాను. ముందు కథ వినండన్నారు. సావిత్రమ్మ జర్నీ వినగానే ఇంకా భయమేసింది. నేను చేసింది జస్ట్ 10–15 సినిమాలే. సావిత్రిగారి పాత్ర పోషించగలనా? అని ఆలోచించా.
ఆవిడ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కెరీర్ డౌన్‌ఫాల్ సీన్స్ అప్పుడు ఆడియన్స్‌కు నా నటన నచ్చుతుందా? నేను కరెక్ట్‌గా కన్వే చేయగలనా? అని సంకోచించాను. ‘ఆమె కథ అందరికీ తెలిసిందే. మనం కొత్తగా ఏ మార్పులూ చేయడం లేదు’ అని నాగీ కన్విన్స్ చేశాడు. ఎక్కడో భయం ఉన్నా మళ్లీ ఇలాంటి చాన్స్ రాదని ధైర్యం చేసి ఒప్పుకున్నా.
‘మహానటి’లో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్?
‘మాయాబజార్’ సీక్వెన్స్ మెంటల్లీ చాలా స్ట్రెస్ అనిపించింది. ఆ సీక్వెన్స్ చేయడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే ‘మాయాబజార్’ గురించి ఎవరు మాట్లాడినా అందులో సావిత్రిగారి నటన అద్భుతం అనేవారు. టైమింగ్, చేతులు కదపడం, ముఖ కవళికలు, హెయిర్ స్టైల్ అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకున్నాను.
ఆ సీక్వెన్స్ చిత్రీకరణకు మూడు రోజులు పట్టింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు కూడా 20 నుంచి 30 టేక్స్ తీసుకున్నాం. ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకులు ఆ సీక్వెన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారని విని, పడ్డ కష్టం మొత్తం మరచిపోయాను. ఈ మధ్య నేనెక్కువగా వాడిన పదం ‘థ్యాంక్యూ సో మచ్’. అన్ని కాంప్లిమెంట్స్ అందుకున్నాను. ఆల్రెడీ చాలామంది నేను నెక్ట్స్ ఏం సినిమాలు చేస్తున్నానో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఉన్నారు. సో.. నేనింకా కేర్‌ఫుల్‌గా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలి.
సావిత్రి’గా కీర్తీ సురేశ్ సెట్ అవుతుందా అని కొన్ని నెగటివ్ కామెంట్స్ మీకూ వినపడే ఉంటాయి. అప్పుడేమైనా ఫీల్ అయ్యారా?
నా మీద నాకే డౌట్‌గా ఉండేది. వేరేవాళ్లు డౌట్ పడటంలో తప్పేముంది? ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు పాజిటివ్, నెగటివ్ రెండూ ఉంటాయి. అందుకే దాని గురించి ఎప్పుడూ వర్రీ అవ్వలేదు. భయం ఎక్కడ మొదలైందంటే చుట్టూ ఉండేవాళ్లు ‘అబ్బ.. సావిత్రిగారి క్యారెక్టర్ చేస్తున్నారా.. సూపర్ చాన్స్ వచ్చింది’ అని అంటుంటే చిన్న హార్ట్ ఎటాక్ లాగా అనిపించింది. ఒకేసారి టెన్త్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసినంత టెన్షన్ అనిపించింది. ఎక్కడికి వెళ్లినా సరే ‘నువ్వు సరిగ్గా చేస్తావో లేదో తెలీదు కానీ నువ్వు మాత్రం బ్లెస్డ్’ అనేవారు.
సావిత్రి గారి గురించి ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి?
షూటింగ్ సమయంలో ఆమెకు సంబంధించిన ట్రాజెడీ సీన్స్‌లో నటిస్తున్నప్పుడు ఈ నేమ్, ఫేమ్ దేనికోసం? అనిపించేది. సావిత్రిగారు నటిగా, వ్యక్తిగా చాలా ఇన్‌స్పిరేషనల్ ఉమన్. ‘నీ వల్ల కాదు’ అంటే, ‘ఎందుకు కాదు’ అని చాలెంజింగ్‌గా తీసుకుని నటించేవారు. మంచి వ్యక్తి. ఆమెలో సహాయగుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉండి ఇవ్వడం వేరు. తన దగ్గర లేనప్పుడు కూడా ఆమె ఇచ్చారు. చాలా గొప్ప మనిషి.
ఒక హీరోయిన్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఆ హీరోయిన్‌ను ఆ జానర్‌కు స్టిక్ చేసేస్తారు. అది మీకు తెలిసే ఉంటుంది?
నేను వర్రీ అవ్వడంలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కమర్షియల్ సినిమాలకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నవారంతా సీనియర్ ఆర్టిస్ట్స్. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ సినిమా చేశాను.
ఇప్పటి నుంచి ఓన్లీ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయడం నా ఏజ్‌కు చాలా ఎర్లీ అవుతుంది. నేనంత మెచ్యూర్డ్ కూడా కాదని అనుకుంటున్నాను. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తర్వాత చేస్తాను. ‘మహానటి’ సినిమా ఆఫర్ లైఫ్‌టైమ్‌లో ఒక్కసారి వస్తుంది. అందుకే ఎర్లీగా అయినా చేసేశాను. జనరల్‌గా నేను రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను.
జనరల్‌గా హీరోయిన్స్ డైరీని అమ్మ లేదా నాన్న లేదా బ్రదర్స్ మేనేజ్ చేస్తుంటారు. మీకు?
నా మూవీ డేట్స్ అన్నీ అమ్మగారు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరూ నాతో సెట్స్‌కి రారు. అంతా నేనే చూసుకుంటున్నాను. ‘మీరు నన్ను చూసుకోనవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను’ అని చెప్పాను. అది యారోగెన్స్ కాదు. అమ్మానాన్నలను ఒత్తిడి నుంచి తప్పించడం కోసం. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు ఆ మాత్రం చేయాలని నా ఫీలింగ్.
మా అమ్మ నా గురించి ఎక్కడా చెప్పి ఉండరు. నాతో కూడా నా గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. బట్.. నా అంతట నేనే అన్నీ హ్యాండిల్ చేసుకుంటున్నానని మా అమ్మగారు నా గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారని గ్రహించగలను. ‘దే ఆర్ ప్రౌడ్ పేరెంట్స్’ అని పిల్లలు తమ పేరెంట్స్ గురించి అందరూ అనుకునేలా చేస్తే చాలు. కన్నవాళ్ల రుణం తీర్చుకున్నట్లే.
మీకు ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ ఎంట్రీ ఈజీ అయ్యింది..
మా అమ్మా నాన్న ఫస్ట్ స్టార్ట్ ఇచ్చారంతే. నా ఫస్ట్ మూవీ డాడీ వాళ్ల ఫ్రెండ్ ప్రియదర్శన్ (దర్శకుడు)గారి వల్ల వచ్చింది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎంట్రీ ఈజీ అయింది కానీ ప్రూవ్ చేసుకోకపోతే ఎగ్జిట్ కూడా అంతే ఈజీ. ఫస్ట్ చాన్స్ తర్వాత అన్ని అవకాశాలూ నా సొంతంగా తెచ్చుకున్నవే. నా హార్డ్ వర్క్‌తో తెచ్చుకుంటున్నవే.
కమర్షియల్ సినిమాల్లో కూడా మీరు ట్రెడిషనల్‌గానే కనిపిస్తారు కదా?
అది నా చాయిస్. అదే నా కప్ ఆఫ్ టీ. నేను చాలా ట్రెడిషనల్ పర్సన్. నా మనస్తత్వానికి తగ్గట్టుగా నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఆ విషయంలో ఐ యామ్ హ్యాపీ. కొంచెం మోడ్రన్‌గా కనిపించగలనేమో కానీ గ్లామరస్ పాత్రలు చేయలేను.
సౌందర్య.. ఆ తర్వాత స్నేహ.. ఆ తర్వాత హోమ్లీ క్యారెక్టర్స్ అంటే కీర్తీ సురేశ్ అని అంటున్నారు. ఈ మాట వింటే మీకేమనిపిస్తోంది?
సౌందర్యగారు అద్భుతమైన నటి. స్నేహగారు చక్కని ట్రెడిషనల్ రోల్స్ చేశారు. వాళ్ల కేటగిరీలో నన్ను ఉంచితే ఆనందంగానే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించటం అనేది బెస్ట్ థింగ్ అని నేననుకుంటున్నాను. ఆ కేటగిరీవాళ్ల మనసులకు దగ్గర కాగలగడం ఓ ఆశీర్వాదం.
‘ట్రెడిషనల్ క్యారెక్టర్ చేయడం నా చాయిస్’ అన్నారు. ఆ డెసిషన్‌కి కారణం ఏంటి?
నా ఫ్యామిలీ అలాంటిది. మా అమ్మ (మలయాళ నటి మేనక) గారే నాకు రోల్ మోడల్. ఆమె చేసినవి ట్రెడిషనల్ పాత్రలే. తన సినిమాలు చూస్తూ పెరిగాను. తనని ఫాలో అయ్యాను. ఒకవేళ అమ్మ ట్రెడిషనల్ రోల్స్ కాకుండా డిఫరెంట్ రూట్‌లో వెళ్లి ఉంటే.. నా రూట్ కూడా అదే అయ్యుండేదేమో.
ట్రెడిషనల్ యాక్టర్స్‌కు కెరీర్ స్పాన్ ఎక్కువగా ఉంటుందనుకుంటున్నారా?
అది ఆ ఆర్టిస్ట్ మీద డిపెండ్ అయ్యుంటుంది. వాళ్లని వాళ్లు ఎలా క్యారీ చేస్తారు అన్న విషయం మీద డిపెండ్ అయ్యుంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది అడిగిన మేజర్ క్వశ్చన్ ఇది. లెంగ్తీ కెరీర్ ఉండదని నన్ను నేను మార్చుకోలేను కదా? అని చెప్పాను. నేను మోడ్రన్ డ్రెస్‌లు వేసుకుంటాను. ట్రావెలింగ్ అప్పుడు జీన్స్, టీ షర్ట్ వేసుకుంటాను. సినిమాల్లోనూ అంతే. దానికి మించి టూ మచ్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోలేను.
నేను గ్లామరస్ రోల్స్ చేయను. అవి నాకు సూట్ అవ్వవు కూడా. ఆడియన్స్ కూడా నన్ను అలా చూడటానికి ఇష్టపడరు. నేను ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు.. ఒకవేళ మనం చూజ్ చేసుకున్న దారిలో సర్వైవ్ కాలేకపోతే ఏంటి? అని ప్రశ్నించుకున్నాను. కాలేకపోయినా మనల్ని మనం మార్చుకోకూడదు అనుకున్నా. ‘దిస్ ఈజ్ వాట్ ఐయామ్’.
స్టోరీ డిమాండ్ చేసిందని స్విమ్ సూట్ వేసుకున్న హీరోయిన్స్ ఉన్నారు. స్టోరీకి వేల్యూ ఇచ్చే మీరు డిమాండ్‌ని బట్టి మనసు మార్చుకోవాల్సి వస్తే?
నెవ్వర్. నేను అస్సలు మారను. నా స్టైల్‌ను మార్చుకోలేను. నాకలాంటి ఆఫర్స్ కూడా రావడంలేదు. నేను ఎలాంటి సినిమాలు చేస్తానో అందరికీ తెలుసు. డైరెక్టర్స్ కూడా నేను గ్లామరస్ రోల్స్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేయరు. తమిళ సినిమాలు స్టార్ట్ చేసిన కొత్తలో స్టోరీ నెరేట్ చేసిన వెంటనే ‘నేను ఎక్స్‌పోజ్ చేయలేను’ అని చెప్పేదాన్ని.
రీసెంట్‌గా ఓ దర్శకుడు తన కొత్త సినిమాకు అడిగినప్పుడు ‘సార్.. నేను ఎక్స్‌పోజ్ చేయలేను...’ అన్నాను. ‘కీర్తీ.. నువ్వేంటో మాకు తెలుసు. ట్రెడిషనల్ రోల్ కాబట్టే నిన్ను అప్రోచ్ అయ్యాను. నువ్వు ప్రతిసారీ ఇలా చెప్పనవసరం లేదు’ అని అన్నారాయన. ఆ టైమ్‌లో అనిపించింది. ‘నేనో మార్క్ వేసుకోగలిగాను’ అని.
మనది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే మూవీ క్యారీ చేయగలరని అనుకున్నారా?
లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే పెద్ద బాధ్యత. పైగా సావిత్రమ్మలాంటి మహానటి జీవితం మీద సినిమా అంటే ఆ బాధ్యత డబుల్. అందుకే చాలా జాగ్రత్తగా చేశాను. మన సినిమాలు హీరో డ్రివెన్ అయినప్పటికీ స్టోరీ, స్క్రీన్‌ప్లే బావుంటే ఉమెన్ కూడా సినిమాను ఈజీగా క్యారీ చేయగలరు. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో ముఖ్యంగా కావల్సింది బెస్ట్ స్క్రీన్‌ప్లే, స్టోరీ టెల్లింగ్‌లో కొత్తదనం.
సినిమా థియేటర్స్ వైపు ఆడియన్స్‌ను పుల్ చేసే ఎలిమెంట్స్ ఉండాలి. అది ఆ సినిమా జానర్ అవ్వొచ్చు, స్టోరీ అవ్వొచ్చు. ఈ సినిమాలో నేను మెయిన్ రోల్ అయినప్పటికీ గ్రేట్ క్యాస్టింగ్ సపోర్టింగ్‌గా ఉంది. సమంత, దుల్కర్, విజయ్, మోహన్‌బాబుగారు ఉన్నారు. నా బాధ్యత అంతా సావిత్రిగారిలా చేయడమే. ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ ఫ్యాన్స్‌ని నా నటన నొప్పించకూడదనుకున్నా. ఆ విషయంలో సక్సెస్ అయ్యాను.
మీ అమ్మగారు 120 సినిమాలు వరకూ చేశారు. ఆమె అన్ని సినిమాలతో కూడా అచీవ్ చేయని హైట్స్ మీరు 20 సినిమాలకే చేశారేమో?
మా అమ్మగారు తెలుగువాళ్లకి తెలియకపోవచ్చు కానీ మలయాళంలో చాలా ఫేమస్. అక్కడ ఆమె చాలా అచీవ్ చేశారు. తమిళ సినిమాలు తక్కువే అయినా మంచివే చేశారు. నేను మలయాళంలో కంటే తమిళం, తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. అందుకని అమ్మకన్నా నేను పాపులర్ అయినట్లు మీకు అనిపిస్తుందేమో. అయినా కాలం మారింది.
ఇప్పుడు తక్కువ టైమ్‌లో ఫేమస్ కాగలుగుతున్నాం. మలయాళంలో అమ్మ సక్సెస్‌ఫుల్. వ్యక్తిగా కూడా ఆమె సక్సెస్. పెళ్లి జరగక ముందు అమ్మ కెరీర్ పీక్‌లో ఉండేది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అమ్మ ఇండస్ట్రీకి వచ్చి, సక్సెస్ అయ్యారు. పెళ్లి జరిగాక (మలయాళ నిర్మాత జి. సురేష్‌కుమార్‌తో) పర్సనల్ లైఫ్ కోసం యాక్టింగ్ మానేశారు. ‘ఐ యామ్ హ్యాపీ’ అనేవారు. ఆర్టిస్ట్‌గా, పర్సన్‌గా మా అమ్మగారే నా రోల్ మోడల్.
ఒకవేళ యాక్టర్ అవ్వకపోయి ఉంటే?
కాస్ట్యూమ్ డిజైనర్. సమంత లాంటి హీరోయిన్స్‌కు డ్రెస్‌లు డిజైన్ చేస్తూ ఉండేదాన్ని. (నవ్వుతూ).
మీ ఫీచర్స్ బాగుంటాయి. నటిగా మంచి ఫ్యూచరూ ఉంది. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు?
అమ్మా, నాన్న.. ఇద్దరికీ.
మరి దేవుడికి?
అమ్మా నాన్నే దేవుళ్లు కదండీ.
దేవుణ్ణి నమ్ముతారా?
నమ్ముతాను. మనసులో ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను. ముఖ్యంగా నా సినిమాల రిలీజ్ టైమ్స్‌లో ఎక్కువగా (నవ్వుతూ). నేను షిరిడీ సాయిబాబా భక్తురాలిని. ఫస్ట్ సినిమా కంప్లీట్ అయ్యాక షిరిడీ వెళ్లి బాబాకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. వాళ్లు నాకెంతో స్పెషల్.
‘మహానటి’తో ఆడియన్స్‌కు మీరూ స్పెషలే..
(నవ్వేస్తూ) వినడానికి చాలా హ్యాపీగా ఉంది.
– డి.జి. భవాని