కేరళలోని ఓ ప్రాంతం. ప్రధాన రహదారి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు. దోవంతా నాదే అన్నట్టుగా భారీ వాహనాలకు కేటాయించిన లేన్‌ను వదిలి.. అంటే రైట్ లేన్‌ను వదిలి లెఫ్ట్‌లేన్‌లోంచి వెళ్తోంది. అయినా పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోతున్నారు చాలా మంది. ఇంతలోకే ఎర్ర రంగు టూ వీలర్ మీద రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చుడీదార్, ఎర్ర రంగు హెల్మెట్ ధరించిన ఓ యువతి ఆ బస్సుకు ఎదురు వచ్చింది. బస్సు డ్రైవర్ ‘‘పక్కకు తప్పుకో అమ్మా...’’ అని అరిచాడు అసహనంగా. అంగుళం కూడా కదల్లేదు ఆమె. రోడ్డు మీద వెళ్లే వాహనదారుల దృష్టి ఆ సన్నివేశం పై పడింది. నెమ్మదిగా వేగం తగ్గించి చోద్యం చూడ్డం మొదలుపెట్టాయి. బస్సు వెనక ఆగిన వాహనాల హారన్లు మారుమోగుతున్నాయి.
బస్సుకు ఎదురుగా ఉన్న ఆ టూవీలర్ కదిలితే కాని బస్సు ముందుకు కదలదు. ‘‘రాంగ్ రూట్‌లో ఉన్నావు.. నీ లేన్‌లోకి వెళ్లు’’ అని చెప్పకుండానే బస్సుకు ఎదురొడ్డి చెప్తోంది ఆమె. అలా అయిదు నిమిషాలు గడిచాయి. తన తప్పు, పరిస్థితి అర్థమైన బస్సు డ్రైవర్ తన లేన్‌లోకి స్టీరింగ్ వీల్‌ను తిప్పక తప్పలేదు. అలా బస్సు తన రూట్‌లోకి గేర్ మార్చుకోగానే తన దారిన తాను వెళ్లిపోయింది ఆ యువతి. నోటి మాట లేకుండా చేతలతో డ్రైవర్‌కి చెక్ పెట్టి పౌరురాలిగా తన కర్తవ్యాన్నీ నిర్వహించింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యం తప్ప ఆ యువతి పేరు, తదితర వివరాలేవీ బయటికి రాలేదు. ఏమైనా ఆడవాళ్ల సామాజిక బాధ్యతకూ అద్దం పడుతోంది ఆ వీడియో!
Comments
Please login to add a commentAdd a comment