బుంగమూతి వీడలేదు కన్నయ్య. కుండెడు వెన్నమీగడలు, గడ్డ పెరుగు... ఎన్ని ఆశ చూపినా కన్నయ్య గుండ్రటి మూతి వెడల్పు కావట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు యశోదమ్మకు.
ఉదయాన్నే చద్ది మూట కట్టుకుని, అన్న బలరాముడితో కలిసి గోవులను అడవికి తీసుకువెళ్లిన శ్రీకృష్ణుడు సాయంత్రం గడిచి, చీకటిపడుతున్నా ఇంటికి రాలేదు. యశోద మనసు పరిపరివిధాల పోతోంది. రోజూ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయని కన్నయ్య ఈ రోజు ఇంకా ఎందుకు రాలేదా అని ఆందోళన చెందుతోంది. నందుడి చేతికి కాగడా ఇచ్చి నల్లనయ్యను వెతికి తీసుకురమ్మంది. నందుడు గుమ్మం దిగుతుండగా, దీన వదనంతో ఎదురు వచ్చాడు కిట్టయ్య. తన చిన్ని కృష్ణుడు రావడం చూసి యశోద నయనాలు ఆనంద బిందువులతో నిండిపోయాయి. పరుగుపరుగున ఎదురువచ్చి అక్కున చేర్చుకుంది. బుంగమూతి వీడలేదు కన్నయ్య. కుండెడు వెన్నమీగడలు, గడ్డపెరుగు ఎన్ని ఆశ చూపినా కన్నయ్య గుండ్రటి మూతి వెడల్పు కావట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు యశోదమ్మకు. ఆ మురారిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, బుజ్జగింపుగా అడిగింది.
ఏడుపు ముఖంతో, ‘అమ్మా! నేను నల్లగా ఎందుకు ఉన్నాను. రాధ చూడు ఎంత తెల్లగా ఉంటుందో. నాకు చిన్నతనంగా ఉంది’ అన్నాడు. యశోద మనస్సు చివుక్కుమంది. బాధను బయటపడనీయకుండా, నవ్వుతూ, ‘అయ్యో! ఇంతేనా! నీకో విషయం తెలుసా. నీ పసితనంలో ఒక రాక్షసి నీకు విషం పాలు ఇచ్చింది. నీ రంగుమారిందే కాని, నీకేమీ కాలేదు. అప్పటి నుంచి నువ్వు నల్లనయ్యవు అయ్యావు. నీ రూపం నచ్చి, పోతన మహాకవి నిన్ను ‘నల్లనివాడు, పద్మ నయనమ్ముల వాడు, కృపారసంబు పైజల్లెడివాడు.. చెల్వల మనోధనంబు దోచెను’ అని ప్రస్తుతించాడు. అయినా ఎవరైనా, ఎప్పుడైనా నువ్వు నల్లగా ఉన్నావని అన్నారా. నువ్వంటే అందరికీ ప్రేమే కదా. నువ్వు ఎవరి ఇళ్లలో వెన్నముద్దలు దొంగిలించినా, పెరుగు తస్కరించినా, చివరకు గోపికల వస్త్రాలను అపహరించినా, నిన్ను అందరూ స్తుతించారే కాని, ఒక్కరూ నిందించలేదు కదా. ఈరోజు నీకు ఎందుకు నువ్వు నల్లగా ఉన్నావన్న భావనలో ఉన్నావు...’ అని సముదాయించడానికి పరిపరివిధాలప్రయత్నించింది. నల్లనయ్య ముఖంలోని ఆ విశాలమైన కలువ కళ్లు ముడుచుకునే ఉన్నాయి.
విచ్చుకోవట్లేదు. యశోద చాలాసేపు ఆలోచించింది. పసుపు, కుంకుమలు, రకరకాల కాయగూరల నుంచి వచ్చే రంగులు, బిందెడు నీళ్లు తీసుకు వచ్చింది, వాటితోపాటు ఒక పిచికారీ కూడా తీసుకువచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాక చూస్తున్నాడు బుల్లి కన్నయ్య. ఏంటమ్మా ఇవన్నీ అని అడిగాడు. అందుకు యశోద ‘చిట్టి తండ్రీ! నీ రాధ నీకు ఏ రంగులో కనిపించాలనుకుంటున్నావో ఆ రంగు ఆమె ముఖానికి పులిమేసెయ్యి. ఇంకా కావాలంటే, ఆ రంగులతో రంగు నీళ్లు తయారుచేసి, ఈ పిచికారీతో రాధ ఒళ్లంతా తడిపేసెయ్. అప్పుడు రాధ, నువ్వు ఒకే రంగులో ఉంటారు, సరేనా!’ అంది. కృష్ణుడు తెగ సంబరపడిపోయాడు.
రంగులు, రంగునీళ్లు తీసుకుని రాధ దగ్గరకు బయలుదేరాడు. నల్లనయ్యను చూసిన రాధకు ఏమీ అర్థం కాలేదు. వస్తూనే కన్నయ్య చేతిలోని రంగులను రాధ ముఖానికి పులిమేశాడు. వెంటనే పిచికారీతో ఒళ్లంతా తడిపేశాడు. రాధకు కన్నయ్య చేష్టలు అర్థమయ్యాయి. ఇంతకాలం తాను చాలా తెల్లగా ఉంటాననుకున్న రాధ, ఇప్పుడు కన్నయ్య రంగులోకి వచ్చేసింది. ఆ రోజు రాధకు కృష్ణ తత్త్వం అర్థమైంది. యశోదమ్మ దగ్గర చిన్నపిల్లవాడిగా ప్రవర్తించిన కన్నయ్య, రాధ దగ్గర వేదాంతాన్ని బోధించాడు. ఆ రోజు నుంచి రంగుల పండుగను గోకుల వాసులతో పాటు భారతీయులంతా జరుపుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ పండుగను తన లీలలతో ప్రబోధించాడు గీతాకారుడు శ్రీకృష్ణుడు.
–డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment