పారాయణ పరమార్థం
ఆత్మీయం
శిష్యుల ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడేవాడే ఉత్తమ గురువు. అందుకే గురువును సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్త స్వరూపంతో పోలుస్తారు. బాబా అచ్చంగా అటువంటి సద్గురువు. ఆత్మసాక్షాత్కార సాధనకు మార్గం చూపించే చుక్కాని వంటివాడు. శ్రీసాయి బోధనకు ప్రత్యేక స్థలం, సమయం, సందర్భం ఉండేవి కావు. సందర్భాన్ని బట్టి బాబా ప్రబోధం ప్రవాహం మాదిరి జాలువారేది. ఒకనాడు ఒక భక్తుడు ఇంకో భక్తుని గురించి అతని పరోక్షంలో ఇతరుల ముందు నిందించసాగాడు. తోటి భక్తునిలోని ఒప్పులను విడిచి, అతను చేసిన తప్పులను కావాలనే ఎత్తి చూపుతూ హీనంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.
అతని తీరుతో పక్కనే ఉన్న ఇతర భక్తులు నొచ్చుకున్నారు. తన సర్వజ్ఞతతో సదరు భక్తుని బుద్ధిని గ్రహించారు బాబా. పరనిందకు పాల్పడిన భక్తుడిని సరిదిద్దాలను కున్నారు. ఒకనాడు బాబా లెండీతోటకు వెళ్లేటప్పుడు తోటి భక్తుడిని నిందించిన భక్తుడు బాబాకు ఎదురు పడ్డాడు. అప్పుడు బాబా ‘‘ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప లభించని మనిషి పుట్టుక పుట్టి పరనిందకు పాల్పడటమంటే అవతలివారి మలినాలను నీ నాలుకతో శుభ్రపరుస్తున్నట్టే లెక్క. ఇకముం§ð ప్పుడూ అలా చేయకు’’ అని మందలించారు. బాబా చెప్పిన నీతి గ్రహించిన ఆ భక్తుడు వెంటనే తన తప్పు దిద్దుకున్నాడు. మనం బాబా సచ్చరిత్ర పారాయణ చేస్తాం, భక్తితో లెంపలు వేసుకుంటాం. నైవేద్యం పెట్టి, నీరాజనం సమర్పిస్తాం కానీ, బాబా చెప్పిన ఇలాంటి విషయాలు ఆచరించినప్పుడే అది అసలైన పారాయణ అవుతుంది.