రాజకీయాల్లో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సర్వసాధారణం. ఉదయం మాట్లాడిన మాటలను సాయంత్రానికి మార్చేయడమో.. లేకుంటే అసలు తాము అలా అనలేదనో.. లేదా ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారనో.. తమ వ్యాఖ్యలను మార్చుకునే నేతలు కోకొల్లలు. అన్నమాట ప్రకారం నడుచుకునే వారూ ఉన్నారు. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట నిలబెట్టుకున్నారు. అయితే మామూలు పరిస్థితుల్లో నాయకులు ఏమన్నా జనాలు పట్టించుకోరు గానీ.. ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. సెప్టెంబర్ 6న కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి ప్రచారం సందర్భంగా పలువురు పలు సవాళ్లు చేశారు. నేడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి, అన్నమాట ప్రకారం.. ఎంతమంది నాయకులు మాటకు కట్టుబడి నడుచుకుంటారు? ఎంతమంది తూచ్.. అంటారో చూడాలి.
– సాక్షి, హైదరాబాద్
రేవంత్‌రెడ్డి..
రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొం దిన రేవంత్ పదునైన ఆరోపణలు చేయడంలో దిట్ట. తాజా ఎన్నికల సందర్భం గా రేవంత్ తన ప్రత్యర్థి కేటీఆర్‌కు ఓ సవాల్ విసి రారు. కొడంగల్‌లో తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేసిందని, అయినా తాను గెలుస్తున్నానని ప్రకటించారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, గెలిస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తాడా? అని సవాల్ విసిరారు.
కేటీఆర్..
ఈ ఎన్నికల్లో అందరికన్నా ముందుగా రాజకీయ సన్యాసం మాట ఎత్తిన నాయకుడు కేటీఆర్. ఓ వేదికపై ప్రసంగిస్తున్న క్రమంలో ఈసారి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పక్షంలో తాను రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇటు సొంత పార్టీలోనూ.. అటు విపక్షంలోనూ చర్చనీయాంశంగా మారాయి.
ఉత్తమ్..
ఈ ఎన్నికలకు ముందు నుంచీ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. పార్టీ గెలిచేంత వరకు తాను గడ్డం తీసేదిలేదని గతంలో శపథం చేసిన ఉత్తమ్.. ఇటీవల పార్టీ అధికారంలోకి రాకపోతే గాంధీభవన్‌కు రానని చెప్పారు. తాజాగా 11న ఫలితాల అనంతరం తాను గడ్డం తీయబోతున్నట్లు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు.
రాజగోపాల్‌రెడ్డి..
దూకుడు రాజకీయాలకు పేరుపొందిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒకరు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో శపథం చేసి పంతం నెగ్గించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి నల్లగొండ, నకిరేకల్, మునుగోడులో తాము 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని, ఇది నిజం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు.
సోమారపు సత్యనారాయణ..
లగడపాటి సర్వేపై ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ సర్వే నిజమైన పక్షంలో తాను బట్టలిప్పుకుని కూకట్‌పల్లిలో తిరుగుతానని, ఒకవేళ అబద్ధమని తేలితే ఆయన తిరుగుతారా? అని సంచలన సవాల్ చేశారు.
అసద్..
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అధికార పార్టీకి మద్దతు కొనసాగిస్తూనే.. తమ ఉనికిని, ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. కారు ఎవరి చేతిలో ఉన్నా సరే.. స్టీరింగ్ మాత్రం తమ చేతిలోనే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభుత్వంలో చేరతారా? లేక టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారతారా? అన్న విషయంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా, గతంలో కొందరు ఇలాగే సవాళ్లు చేశారు. 2016లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే తాను చెవులు కోసుకుంటానంటూ సీపీఐ సీనియర్ నేతనారాయణ అన్నారు. 150 స్థానాల్లో టీఆర్‌ఎస్ 99స్థానాలు కైవసం చేసుకున్నా నారాయణ మాత్రం స్పందించలేదు. దీనిపై స్పందించిన కేసీఆర్.. మా నారాయణ అందగాడు. ఆయన్ను చెవులు లేకుండా చూడలేం. మీరు ఇబ్బంది పెట్టకండి అని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
సవాళ్లు.. శపథాలు!
Published Tue, Dec 11 2018 5:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment