ఎబోలా నుంచి రక్షణ ఇలా..
జాగ్రత్త
ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధి ఎబోలా. ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తి చెందిన ఎబోలా వైరస్ అక్కడి నుంచి ఒక వ్యక్తి ద్వారా అమెరికా చేరింది. ఆ వ్యక్తి అమెరికాలో మరణించడంతో ఆ దేశం ఈ వ్యాధి మీద, దానిని నియంత్రించే విధానాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. మనదేశంలో విమానాశ్రయాల దగ్గర ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలను, ప్రయాణికులను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఇతరులను తాకాల్సిన పరిస్థితులను (పరిచయస్థులు ఎదురు పడినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆలింగనం చేసుకోవడం, భుజం మీద చేతులు వేయడం వంటివి) వీలయినంతగా మినహాయించాలి.
బయటి ఆహారాన్ని మానేయాలి లేదా పరిశుభ్రమైన హోటళ్లు, రెస్టారెంట్లలోనే తీసుకోవాలి.
ఎబోలా వైరస్ సూర్యరశ్మి, వేడి, డిటర్జెంట్, ఇతర క్లీనింగ్ ఎలిమెంట్స్ ఉన్న చోట నిలవదు. కాబట్టి ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వైరస్‌ను నియంత్రించవచ్చు. ప్రతిరోజూ గదుల్లోకి సూర్యరశ్మిని ప్రసరించనివ్వాలి.
ఎబోలా వ్యాధి లక్షణాలు...
జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ వ్యాధి సోకిన కొద్ది వారాల్లోనే మరణం సంభవిస్తుంది.
ఇలా వ్యాప్తి చెందుతుంది!
వ్యాధిగ్రస్థుల రక్తం, చెమట, లాలాజలం, వీర్యం వంటి వాటి నుంచి ఈ వ్యాధి మరొకరికి సోకుతుంది. గతంలో కొంతకాలం స్వైన్ ఫ్లూ భయపెట్టింది. అయితే స్వైన్ ఫ్లూ గాలిలోనే వ్యాప్తి చెందుతుంది. ఎబోలా అలా వ్యాప్తి చెందదు. వ్యక్తిగత ప్రమేయంతోనే వ్యాపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎబోలా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.