ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళం
ఇబోలా.. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అయితే, తనకు ఈ వ్యాధి ఉందంటూ ఓ ప్రయాణికుడు వేసిన ప్రాక్టికల్ జోక్.. విమానంలో గందరగోళం సృష్టించింది. మరోవైపు ఇంకో విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు వాంతి చేసుకోవడంతో ఆ విమానాన్ని లాస్ వెగాస్ విమానాశ్రయంలో క్వారంటైన్ చేశారు. ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు వెల్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఇబోలా ఉందని చెప్పడంతో హజ్మత్ (ప్రమాదకరమైన వస్తువులను తీసే) బృందం నీలిరంగు సూట్లు వేసుకుని విమానంలోకి వచ్చింది.
విమానం గమ్యం చేరుకోగానే హజ్మత్ స్క్వాడ్ వస్తున్నందున ప్రయాణికులంతా కూర్చోవాలని కేబిన్ సిబ్బంది కోరారు. కానీ తీరా చూస్తే అసలు విషయం తేలింది. అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు తెలిసింది. తాను 36 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నానని, కానీ ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేయలేదని, అసలు విషయం తెలిసేవరకు తన నరాలు బిగుసుకుపోయాయని ఓ ఫ్లైట్ అటెండెంట్ తెలిపింది.
ఈ మొత్తం తతంగాన్ని కొంతమంది ప్రయాణికులు సెల్ఫోన్లలో వీడియో తీశారు. దాన్ని యూట్యూబ్లో పెట్టగా, దానికి భారీ హిట్లు వచ్చాయి. నీలిరంగు సూట్లు వేసుకుని వచ్చిన వాళ్లతో తాను ఊరికే జోకు వేశానని, తాను ఆఫ్రికానుంచి రాలేదని చెబుతున్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది.