మాతృత్వపు మధురిమ : కొడుకు జాక్‌తో లిసాహెడెన్
‘‘నువ్వేమైనా పశువ్వా... ఎక్కడపడితే అక్కడ బిడ్డకు పాలివ్వడానికి?’’ అంటూ కుప్పలుతెప్పలు ట్రోలింగ్స్ లిసాహెడెన్‌కు. ఇంతకీ ఆమె ఎవరు? ‘‘క్వీన్’’సినిమా చూశారా? కంగనా రనౌత్‌కి ఫ్రెండ్‌గా నటించింది. ఆయెషా సినిమా చూసినా తెలుస్తుంది లిసా ఎవరో! బోల్డ్ అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్. మోడల్ కూడా.
తల్లిపాల విలువ గురించి ప్రచారం జరుగుతున్న సందర్భంగా అంతే బోల్డ్‌గా లిసా తన బిడ్డకు పాలిస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘బిడ్డకు పాలివ్వడానికి ఎందుకు సిగ్గుపడాలి? బిడ్డకు ఆకలైనప్పుడు మీరెక్కడున్నా నిరభ్యంతరంగా.. నిస్సంకోచంగా పాలివ్వచ్చు.. నేనూ ఇస్తాను’’ అనే కామెంట్ రాసింది. ఓ మహిళగా.. తల్లిగా.. తల్లిపాల అవసరం గురించి చెప్పడం తన బాధ్యతగా భావించే.. ఆ ఫొటోను పోస్ట్ చేసింది ఆ అమ్మ. కానీ లిసాను అమ్మలా చూడకుండా.. ఓ నటిగా.. సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా ట్రీట్ చేస్తూ చవకబారు కామెంట్లతో ఆమెను అబ్యూజ్ చేశారు కొందరు నెటిజన్లు. యేడాది అవుతున్నా ఆ ట్రోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలోనే కాదు.. ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏ ఈవెంట్‌లో కనిపించినా.. ‘‘మీ బిడ్డకు ఇంకా పాలిస్తున్నారా? ఫొటోలు పెట్టట్లేదే?’’ అంటూ ఎగతాళి చేస్తున్నారట. ‘‘ఇలాంటి మాటలు, ప్రశ్నలతో చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీలవుతున్నాను. సేమ్‌టైమ్ వాళ్ల మీద జాలి కూడా వేస్తోంది. ఈరకంగా మాట్లాడే వాళ్లంతా మగవాళ్లే. పాపం.. వాళ్లకు తెలియదు కదా తల్లి బాధ్యతేంటో? వాళ్లూ తల్లి అయితే ఇలా మాట్లాడరు’’ అంటుంది లిసా. ఆమె కొడుకు జాక్.. యేడాది వయసు.
మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లయినా.. ఆడవాళ్లు ఇండిపెండెంట్‌గానే ఉంటున్నారు. చంటిపిల్లను చంకన వేసుకొని బయట పనులు చక్కదిద్దుకోవాల్సిందే. ఏ వర్గం మహిళలైనా ఇందుకు మినహాయింపు కాదు. బిడ్డకు ఆకలేసినప్పుడు తల్లి పాలు ఇవ్వాల్సిందే. బయట.. పది మంది మగాళ్ల మధ్య.. ‘మా అమ్మ ఉంది.. ఆకలేసినా నేను ఓర్చుకోవాలి.. ఏడ్వకూడదు’ అని నెలల బిడ్డకు తెలియదు కదా. ‘అయ్యో నలుగురి మధ్య పాలెలా ఇవ్వాలి’ అని తల్లీ సంకోచించకూడదు. ఆ విషయాన్నే సెలబ్రిటీ హోదాలో లిసా చెప్పింది. దానికి సెక్సువల్ కలర్ ఎందుకు యాడ్ చేయడం? అని చాలా మంది మహిళలు లిసాను సపోర్ట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు మారాలనే.. స్త్రీలను సాటి మనుషులుగా చూడాలనే ఈ చైతన్యం అంటున్నారు. ‘‘పోషకాహార లోపం, అందం మీదున్న మమకారం, బిడ్డకు పాలు పట్టడం పట్ల ఉన్న అపోహలు.. పాలు పడని శరీర తత్వం.. ఇలా రకరకాల కారణాలతో తల్లిపాలకు బిడ్డలు దూరమవుతున్నారు. అలాంటి అపోహలన్నిటినీ తొలగించి.. తల్లి పాల మీద తల్లులకు అవేర్‌నెస్ కల్పించడంలో నేనూ భాగమయ్యానన్న సంతృప్తి ఉంది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా బిడ్డకు పాలివ్వగలిగాను. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి, బిడ్డకు మధ్య ఏర్పడే అనుబంధం.. అమూల్యమైనది. అది బిడ్డ శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా ఉండేలా చేస్తుంది. ఈ విషయాన్నే ప్రతి న్యూ మదర్‌కి చెప్పాలనుకున్నాను.. చెప్పాను.. చెప్తాను కూడా! ట్రోలింగ్స్ బాధపెట్టినా పట్టించుకోను. నిజానికి మదర్ అయ్యాక ఇలాంటివి ఇగ్నోర్ చేసే సహనమూ వచ్చింది (నవ్వుతూ). పిల్లలకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని, అంతే హెల్దీ ఫ్యూచర్‌ను ఇవ్వడమే పేరెంట్స్ లక్ష్యం. దాన్నే ప్రచారం చేస్తాను’’ అంటోంది లిసా.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment