పేద‌రిక‌మే ఓ భస్మాసుర హ‌స్తం | Love of believing in Him is to keep the bond | Sakshi
Sakshi News home page

పేద‌రిక‌మే ఓ భస్మాసుర హ‌స్తం

Published Sat, Mar 2 2019 12:05 AM | Last Updated on Sat, Mar 2 2019 12:05 AM

Love of believing in Him is to keep the bond - Sakshi

తల తాకట్టు పెట్టుకోవడమంటే  ఇదేనేమో! ఆ తలకే విలువ లేకపోతే? ఆ తల పేదరికంలో మునిగి ఉంటే? ఆ తల మీద పేదరికమే భస్మాసుర హస్తమైతే? సంతలో మనిషికి విలువ లేనప్పుడు 
ఏం అమ్ముకోవాలి? తనను నమ్మిన ప్రేమనే  తాకట్టు పెట్టుకోవాలి.పేదరికాన్ని మించిన  భస్మాసుర హస్తం ఉంటుందా!

రాజస్తాన్‌లోని మారుమూల పల్లెటూరు. మట్టి గోడలు.. ఎర్రమన్ను నేల.. రెల్లు గడ్డి పైకప్పు.. పేదరికం ఆక్రమించుకున్న ఆ గుడిసెలో ఓ మూల సర్దుకొని ఉంటుంటాడు ధాను. తన ఇద్దరు పిల్లలు, వితంతు చెల్లెలితో కలిసి. ధానుకి భార్య ఉండదు. చనిపోతుంది. కొడుకు టీపు. పదేళ్లుంటాయి. ఏడేళ్ల కూతురు గున్ని. ఆ పిల్లల మంచీ చెడూ బాధ్యత వితంతు చెల్లెలిది. వీళ్లతో పాటు ఇంకో కుటుంబ సభ్యుడూ ఉంటాడు. భస్మాసుర్‌. వాడంటే ధానూ కొడుక్కి ప్రాణం. తండ్రి దగ్గర లేని చనువు భస్మాసుర్‌ దగ్గర ఉంటుంది. తన కష్టం, సుఖం, స్నేహితులు.. అల్లరి అంతా భస్మాసుర్‌తో చెప్పుకుంటుంటాడు టీపు. 

దొర.. దొంగ
ఇంటి అవసరాల కోసం ధాను భూస్వామి దగ్గర అప్పు తీసుకుంటాడు. చెప్పిన టైమ్‌కి అప్పు తీర్చడు. భూస్వామి కంట పడకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఊరు నిద్రపోయాక ఇంటికొస్తాడు. ఊరు నిద్రలేవక ముందే బయటకు వెళ్లిపోతుంటాడు. బలాదూర్‌గా తిరుగుతుంటాడు కాబట్టి.. ఊళ్లో ఏది పోయినా.. అది ధాను పనే అంటూ అతనిని  దొంగగా చిత్రీకరిస్తారు. ఇంకా అప్పు చెల్లించలేదని ధాను మీద దొంగతనం మోపి పోలీసులకు పట్టిస్తాడు భూస్వామి. పూచీకత్తు మీద ఆ తెల్లవారి ఇంటికి వస్తాడు ధాను. చేతిలో పైసా ఉండదు. అప్పు తీర్చాలి. చెల్లెలితో గోడు వెళ్లబోసుకుంటాడు. అన్నకు సలహా ఇవ్వడానిక్కూడా ఆమెకు దారీతెన్నూ కనిపించదు. ఇంట్లో విలువైన వస్తువులున్నా తాకట్టు పెట్టొచ్చు. తన ఒంటిమీద వీసం బంగారం ఉన్నా.. అమ్మి ఎంతోకొంత సహాయ పడొచ్చు. భర్త ఆత్మహత్య చేసుకుంటే వచ్చి అన్న ఇంట్లో ఉంటోంది. తనదే ఒకరి మీద ఆధారపడ్డ బతుకు. అండగా ఎలా నిలబడగలదు? కుమిలిపోతుంటుంది. అటు ధానుకీ ఏమీ తోచదు. దిక్కులు చూస్తున్న అతనికి ఇంటి ముందున్న భస్మాసుర్‌ కనిపిస్తాడు. ‘‘భస్మాసుర్‌ను అమ్మేద్దాం’’ అంటాడు. విస్తుపోతుంది అతని చెల్లెలు. ‘‘టీపు ఒప్పుకుంటాడా?’’ ఆమె సందేహం. ‘‘తప్పదు.. ఒప్పించాలి’’ అవసరం అతనిది. భస్మాసుర్‌.. టీపు మాటే వింటాడు కాబట్టి తెల్లవారి టీపుని వెంట బెట్టుకుని మరీ పట్నానికి వెళ్లాలనుకుంటాడు ధాను. ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ధాను కూతురు గున్నీ అక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్‌తో ఆడుకుని దీపాలు పెట్టాక ఇల్లు చేరిన కొడుకుతో చెప్తాడు ధాను.. ‘‘ఉదయాన్నే పట్నం బయలుదేరుతున్నాం. త్వరగా పడుకో’’ అని.  

అనుబంధం పెంచిన దారి
ఇంకా సూర్యుడు రాకముందే పట్నానికి బయలుదేరుతారు ధాను, టీపు.. భస్మాసుర్‌ను తీసుకొని. మేనత్త చపాతీలు చేసి మూట కట్టిస్తుంది. తల్లి కట్టుకున్న చీరల చిరుగు ముక్కలతో తయారుచేసుకున్న జెండా కర్రను వెంట పెట్టుకుంటాడు టీపు. అమ్మ జ్ఞాపకంగా.  ఎప్పుడో తన ఫ్రెండ్‌ ఇచ్చిన నల్ల కళ్లద్దాలను కూడా.  టాటా చెప్పడానికి అత్తతో పాటు బయటకు వచ్చిన చెల్లి.. టీపుకి సైగ చేస్తుంది.. ‘‘భస్మాసుర్‌ని అమ్మేస్తున్నాడు నాన్న’’ అంటూ. ఒక్కసారిగా దిగులు టీపూలో. అన్న బాధ గున్నీకి అర్థమవుతుంది. మౌనంగా తండ్రిని అనుసరిస్తాడు టీపు. మొహంలో భావాలేవీ బయటపడనివ్వకుండా. కాలి నడకన ప్రయాణం. 

అసలు కథంతా ఇక్కడే. మధ్యాహ్నం వేళ.. తెచ్చుకున్న తిండి తింటారు. భస్మాసుర్‌కి కొసరి కొసరి తినిపిస్తుంటాడు టీపు. వాడలా భస్మాసుర్‌ను ముద్దు చేయడం.. గోముగా హత్తుకోవడం.. అన్నీ చూస్తుంటాడు ధాను. భోజనం అయ్యాక మళ్లీ నడక మొదలుపెడ్తారు. మధ్య మధ్యలో కొడుకు కర్రకున్న చీరల చిరుగులను ఆప్యాయంగా తడుముకోవడమూ గమనిస్తుంటాడు తండ్రి. అంతా కొత్తగా అనిపిస్తుంటుంది ధానూకి.  అసలు కొడుకును ఎప్పుడూ అంత దగ్గరగా.. అంత పరిశీలనగా చూడలేదు అతను. వాడితో అదే మొదటి పరిచయంగా తోస్తుంది. చీకటి పడ్తుంది. ఓ చోట సేద తీరుతారు. తెల్లవారుతుంది. మళ్లీ నడక. అలసట.. ధానులో ఓపికను చంపేస్తుంది. కోపాన్ని పుట్టిస్తుంది. కొడుకును కొడ్తాడు. వాడు భస్మాసుర్‌ను పట్టుకొని ఏడుస్తాడు. భస్మాసుర్‌ కళ్లతోనే వాడిని ఓదారుస్తాడు. కోపం తగ్గాక పశ్చాత్తాప్పడ్తాడు ధాను. కొడుకును దగ్గరకు తీసుకుంటాడు. భయంగా.. బెరుకుగానే ఉంటాడు టీపు. ఆకలివేళ అవుతుంది. కిందటి రోజు తెచ్చుకున్న భోజనం ఎండవేడికి  పాడైపోతుంది. ఖాళీ కడుపుతోనే నడకసాగిస్తారు. దాహంతో నోరు పిడచకట్టుకు పోతుంటుంది. గొంతు తడుపుకోవడానికి చుక్క నీరుండదు. ఉసూరుమంటూ ఓ నీడకు చేరుతారు. ప్రేమగా కొడుకు తలను నిమురుతాడు ధాను. శ్రమ తెలియనివ్వకుండా తన చిన్నప్పటి సంగతులను కొడుకుతో పంచుకుంటాడు.  తన అల్లరి..  తండ్రి  చీవాట్లు.. చేసిన బోధ.. అన్నీ కొడుకుతో చెప్తాడు. వాడు ఆసక్తిగా వింటాడు. ఈసారి కొడుక్కి తండ్రి కొత్తగా కనపడటం మొదలుపెడ్తాడు. అప్పటిదాకా వాడి మెదడులో కోపిష్టి.. దొంగ.. సోమరిపోతుగా ఉన్న తండ్రి ఇమేజ్‌ మెల్లగా కరగడం మొదలౌతుంది. ఆశ కూడా మొలకెత్తుతుంది.. తండ్రి మనసు మారి భస్మాసుర్‌ను అమ్మబోడేమోనని. మొత్తానికి తండ్రీ కొడుకులు అపార్థాలు తొలగించుకుంటూ.. అసలైన అనుబంధాన్ని ఆస్వాదిస్తూ.. కొత్త ఊహలకు రెక్కలు తొడుగుతూ పట్నానికి చేరుకుంటారు. 

పట్నంలో ప్రతి మలుపునూ.. ప్రతి దారినీ వింతగా చూస్తున్న కొడుకు సంబరం.. తండ్రికి ముచ్చటగా ఉంటుంది. బజారుకు తీసుకెళ్తాడు. దుకాణాలు.. మిఠాయీలు.. రంగుల రాట్నం.. ఒంటెల బండీ.. పిల్లల ఆటలు.. అన్నీ టీపుకు ఉత్సాహాన్నిస్తుంటాయి. కుతూహలాన్ని కలుగజేస్తుంటాయి. కొడుకు కోసం తినడానికి ఏదైనా తేవాలనుకుంటాడు ధాను. టీపుని ఓ అరుగు మీద కూర్చోబెట్టి ఓ దుకాణానికి వెళ్తాడు. అక్కడున్న చాక్‌లెట్‌ డబ్బా చూపిస్తూ నాలుగు చాక్‌లెట్లు ఇవ్వమంటాడు. డబ్బులివ్వమంటాడు దుకాణదారు. ‘‘పల్లె నుంచి వచ్చాం.. డబ్బుల్లేవు. నా పిల్లాడు ఆకలిగా ఉన్నాడు..  దయచేసి ఇవ్వండి’’ అని బతిమాలుతాడు ధాను. చీదరించుకుంటాడు యజమాని. అటూ ఇటూ చూసి.. డబ్బాలోని చాక్‌లెట్లు తీసుకొని పరిగెడ్తాడు ధాను. అతని వెంట పడ్తాడు యజమాని. ధానూని పట్టుకోబోతుంటే అతని చేతిలో ఉన్నవి కిందపడ్తాయి.. చాక్‌లేట్లు కావు చాక్‌లేట్‌ రాపర్స్‌ అవి. వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు దుకాణదారు. 

వీడ్కోలు 
భస్మాసుర్‌ను అమ్మేస్తాడు ధాను. వచ్చిన డబ్బులోంచి కొంత తీసి కొడుక్కి షూ కొంటాడు. లాడ్జ్‌కి తీసుకెళ్తాడు. ‘‘స్నానం చేసి రెడీ అయ్యి.. షూ వేసుకో.. బయటకు వెళ్దాం’’అని షూ ఇస్తాడు. వాటిని చూసి వాడి కళ్లలో మెరుపు. ఆత్రంగా వేసుకుంటాడు. మంచి హోటల్‌కి తీసుకెళ్లి  వాడికి ఇష్టమైనవి తినిపిస్తాడు తండ్రి. కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని భస్మాసుర్‌ను గుర్తు చేసుకుంటూ ‘‘మన కుటుంబపు పెద్దలా ఆదుకున్నాడు. మనల్ని తండ్రిలా చూసుకున్నాడు కదా..’’ అంటాడు కొడుకుతో. కళ్లనిండా బాధతో అవునన్నట్టుగా తలూపుతాడు టీపు. ‘‘నిన్నూ వాళ్లు బాగా చూసుకుంటారు. నీకే లోటూ రానివ్వరు’’ చెప్తాడు ధాను! అంటే.. భస్మాసుర్‌ను అమ్మేసినట్టుగా తననూ ఎవరింట్లోనో పెడ్తున్నాడన్నమాట. తండ్రి పరిస్థితి అర్థమవుతుంది టీపుకి. దీనంగానే వీడ్కోలు పలికి ట్రాలీలో తన కొత్త చిరునామాకు బయలుదేరుతాడు టీపు. కొడుకు వదిలేసిన చీర చెరుగుల కర్ర ఊతంతో ఊరి దారి పడ్తాడు ధాను. 

పేదరికాన్ని జయించే శక్తి
ఈ సినిమాలో భస్మాసుర్‌.. పెంపుడు గాడిద. పేదరికంలో మనుషులు దరి చేరరు. జంతువులే  మచ్చికవుతాయి. ఆ చెలిమే పేదరికాన్ని జయించే శక్తినిస్తుంది. మనుషుల్లో ఆ స్థయిర్యం నింపడం కోసం  త్యాగానికీ సిద్ధపడ్తాయి. ఇదే భస్మాసుర్‌ కథ. దానివల్లే ఆ కుటుంబం నిలబడుతుంది. తండ్రి కొడుక్కి, కొడుకు తండ్రికీ అర్థమవుతాడు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలువురి ప్రశంసలూ అందుకుంది భస్మాసుర్‌.  
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement