
నన్నడగొద్దు ప్లీజ్
నేను సిక్త్స్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ ఎప్పుడూ తనకు చెప్పలేదు.
లవ్ డాక్టర్
నేను సిక్త్స్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ ఎప్పుడూ తనకు చెప్పలేదు. తనంటే నాకు చాలా గౌరవం. నేను బాగా చదవడానికి ఒక విధంగా తనే కారణం. ఒక రోజు నాకు తనతో పెళ్లి అయినట్లు కల వచ్చింది. అదే విషయం మా ఫ్రెండ్స్‌కి చెబితే... తనకి రెండేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, కొన్ని కారణాలు వల్ల విడాకులు తీసుకుందని చెప్పారు. వెంటనే తనని కలిసి ‘‘నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’’ అని చెప్పాను. ‘‘మా పెద్ద వాళ్లను అడుగు’’ అన్నది. నేను ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా. మా పెద్దలకు ఇదే విషయం చెబితే... ‘‘మేము వెళ్లి వాళ్లను అడగడం బాగుండదు, వాళ్లు వచ్చి అడిగితే కాదనం’’ అని చెప్పారు. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – శివ
‘నాకు తెలుసు సార్... మీరు చాలా ఎదిగిపోతారు సార్’ అబ్బో... సడన్‌గా నా మీద ఇంత నమ్మకం ఎలా వచ్చింది? ‘లేదు సార్ మీరు ఏదో ఒక రోజు ఎక్కడికో వెళ్లిపోతారు’ వెళ్తానా... లేక... నువ్వే పనిగట్టుకుని పంపిస్తావా..? ‘ఛీ! ఏంటి సార్ నన్ను మిస్ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు?’ నువ్వు ‘మిస్’... అంతవరకూ అర్థమయ్యింది. నిన్ను ‘అండర్‌స్టాండ్’ చేసుకోవడం నా తరం కాదు. ‘మిస్ అండర్‌స్టాండ్ అంటే మీకు అలా అర్థమయ్యిందా సార్?’ సరే నువ్వే చెప్పు ఏంటి నా ఫ్యూచర్..? ‘మిరుమిట్లు గొలిపే మీ ఫ్యూచర్ సూపర్ సార్’ నాకేదో డౌట్ కొడుతోంది. నేను పోతా ఈ టెన్షన్ భరించలేను. నీలాంబరి సర్రున డోర్‌కి అడ్డంగా వచ్చి నిలబడింది. పక్కనుంచి తప్పించుకుందామనుకున్నా! చేతులు అడ్డంగా చాచింది. ఎస్కేప్‌కి ఛాన్స్ లేదు ఇంకా ఎమోషనల్ అయితే నన్ను పట్టేసుకుంటుందేమో అన్న భయంతో వెనుదిరిగా. చెప్పు క్యా హై మేరా ఫ్యూచర్...? ‘వదిలేస్తారు సార్’ ఏంటి..? ‘లవ్ డాక్టర్ క్లినిక్‌ని వదిలేస్తారు’ నాకు తెలుసు నువ్వు ఎప్పటికయినా నాకు ఎర్త్ పెడతావని..! ‘అది కాదు సార్... లవ్ ప్రాబ్లమ్స్ నుంచి మీకు ప్రమోషన్ వస్తుంది సార్’ ఏమో నాకయితే అరటిపండు లేక పస్తులుంటానేమో అన్న దిగులు పట్టుకుంటోంది. ‘లేదు సార్ మీరు ఈ ఆన్సర్ ఇస్తే మిమ్మల్ని లవ్ డాక్టర్ అనరు.’
మరేమంటారు..?
‘మ్యారేజ్ డాక్టర్ అంటారు’ అని గట్టిగా నవ్వింది. నవ్విన నాప చేనే పండుద్ది. శివా! డోంట్ వర్రీ. నేను నిర్భయంగా నీకు ఆన్సర్ ఇస్తా. అమ్మాయికి ఇప్పుడే డైవర్స్ అయ్యింది. చాలా కన్ఫ్యూజన్‌లో ఉంటుంది. నీ ప్రపోజల్‌ని ప్రేమ అనుకోవడం లేదు. దయ అనుకుంటోంది. నువ్వేమో నీది స్వచ్ఛమైన ప్రేమ అనుకుంటున్నావు. కానీ, నీది సింపతీ. దయకు, సింపతీకి పెళ్లి చేస్తే అయ్యేది మ్యారేజ్ కాదు, డ్యామేజ్. ఐ యామ్ వర్రీడ్ ఫర్ మై సిస్టర్. వెరీ వర్రీడ్. నువ్వేమో డైవర్సీని చేసుకోవాలన్న హీరోలా కనబడుతున్నావు. తనేమో మెట్టినింటికి పుట్టినింటికీ చెందని నిస్సహాయ స్థితిలో ఉంది. అందుకే నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుందేమో... అనిపిస్తోంది. నీకు దండం పెడతా, తొందరపడకు. ప్రేమించు కానీ హీరో కావాలని అనుకోకు. ఒక వేళ నీ ప్రేమ నిజమైతే నీకు రామ్ సలామ్.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com