హలో రామ్ అన్నయ్యా..! నేను నా లైఫ్‌లో అసలు పెళ్లే చేసుకోవద్దనుకున్నాను. కానీ నా లైఫ్‌లోకి ఒక మంచి అబ్బాయి వచ్చాడు. తను నన్ను అర్థం చేసుకున్నట్లు ఈ ప్రపంచంలో ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు ‘మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా’ అని చెప్పాను. మేం ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఎందుకని అడిగితే ‘కులాలు వేరు’ అంటున్నారు. తను ఇప్పుడు కెనడాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ల పేరెంట్స్‌కి మా గురించి అంతా తెలుసు. వాళ్ల పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్‌ని కన్విన్స్ చేసినా ఒప్పుకోవట్లేదు. నా లైఫ్‌లో తనని వదులుకోలేకపోతున్నాను. మా పేరెంట్స్ అయితే ‘లైఫ్‌లో మేం కావాలా? ఆ అబ్బాయి కావాలా?’ అని అడుగుతున్నారు. తనైతే ‘కెనడా వదిలి వచ్చి ఇక్కడ దగ్గరల్లోనే జాబ్ చూసుకుంటాను. మీ అమ్మాయిని నాకు ఇవ్వండి’ అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయినా సరే మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు అన్నయ్యా. ప్లీజ్.. మంచి సలహా ఇవ్వండి. – లలిత
ప్రియమైన లలిత తల్లిదండ్రులకు సూపర్ లవ్..! లలిత సంతోషం కన్నా మనకేమైనా.. మరేమైనా కావాలా? కూతురుకంటే అపురూపంగా చూసుకునే అత్తమామలకంటే ఎక్కువ ఏం ఇవ్వగలం మన బిడ్డకు?? సహచరుడే కాదు.. స్నేహితుడిగా.. రక్షకుడిగా.. కాపాడుకునే అల్లుడికంటే ఏం ముఖ్యం??? మీరు అనుకుంటున్న సంప్రదాయాలు కూడా అవసరమే కానీ మీరిచ్చిన ప్రేమలో సగమైనా ఇవ్వగల భర్త దొరకడం ఎంత కష్టమో మీకు తెలియనిదా? లలితకు మిమ్మల్ని మించిన శ్రేయోభిలాషులు ఇంకెవరు ఉంటారు? మీతో చెప్పుకోలేక.. నాలాంటి ఒక అన్నయ్యకు చెప్పుకుంటుంది కానీ.. మీరు దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడితే తన బాధ మీతోనే పంచుకుంటుంది కదా? ఒకపక్క అబ్బాయీ, వాడి తల్లిదండ్రులూ అమ్మాయిని స్వాగతిస్తున్నారు. లలిత సంస్కారవతి కాబట్టి.. మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తోంది కాబట్టి... మీ ఆరోగ్యం గురించి తపన చెందుతోంది కాబట్టి... మీకు కించిత్తు కష్టం కలగకూడదు కాబట్టి.. తానే బాధపడుతూ, మథనపడుతూ మీ గౌరవం కోసం, మీ క్షేమం కోసం తన ప్రేమను త్యాగం చేస్తోంది కదా??? ఇంటి పెద్దలుగా కాకుండా.. మీ బంగారుతల్లి అమ్మానాన్నలుగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకోండి. లలిత సంతోషంగా ఉండేలా చూడండి..! సమాజంలో మార్పుకోసం ముందడుగు వెయ్యండి..!! దానికి మేమందరం సాక్షి!!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment