
హాయ్ సార్! నేను ఐదేళ్లుగా ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది. అయితే చిన్న చిన్న గొడవలు వస్తే కొన్ని రోజులు మాట్లాడుకోము. ఆ అమ్మాయి స్టడీస్ కోసం వేరే ఊరిలో హాస్టల్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత కాల్ చేయడం లేదు, కానీ అప్పుడు కూడా నన్ను లవ్ చేస్తోంది. ఇలా ఆరు నెలలు గడిచాయి. హాలిడేస్‌కి ఇంటికి వచ్చాక కూడా కాల్ చేయలేదు. మాట్లాడలేదు, అస్సలు చూడలేదు. ఏం జరిగిందో కూడా చెప్పలేదు. తనని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ తను నన్ను అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ ఏదయినా సొల్యూషన్ చెప్పండి సార్. – సూర్యప్రకాశ్
‘సార్! నాకు అర్థం కాక అడుగుతున్నాను..’ నీలాంబరీ! నీకు అర్థం కానిది ఏదీ ఉండదు అయినా అడుగుతావు. ‘అంటే... తెలిసి కూడా అడుగుతానా సార్’ అవును నీలూ! నువ్వు చాలా ఇంటలిజెంట్. ‘మీరు ఎటకారంగా మాట్లాడి నన్ను హర్ట్ చేస్తున్నారు సార్’ హర్ట్ కాదు గ్రేట్ అని చెబుతున్నాను. ‘ఏది సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్... నేను తెలిసి కూడా అడిగింది’ ఒక గెలలో ఎన్ని అరటి పండ్లు ఉంటాయో నువ్వు తప్ప ఇంకెవరైనా చెప్పగలరా నీలూ? ‘కరెక్ట్ సార్... అయినా అర్థం కాక ఒక విషయం అడుగుతా సార్’ సరే కానీ.
‘ఇప్పుడు సూర్యప్రకాశ్ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ చెబితే పేపర్ చదివేవాళ్లు ఎందుకు చదువుతారు సార్... వాళ్లకేమిటి ఇంటరెస్ట్’? లవ్ అమ్మా!... లవ్. మనకు ఉన్న లవ్... లేవి లవ్... ఉంటే బాగుణ్ను లాంటి లవ్.. అయ్యే లేకపోయిందే...లాంటి లవ్... మంచి లవ్, కొంటె లవ్, పెంట లవ్. ఇది అందరికీ ఇంట్రెస్ట్. మన లైఫ్‌లో లేనిది ఇంకొకరికి ఉన్నా లేకపోయినా తెలుసుకోవాలన్న దూల.. లవ్. ‘అబ్బ! ఏమి చెప్పారు సార్! ఇప్పుడు సూర్యప్రకాశ్‌కి చెప్పండి సార్’ అన్నా నీకు ఫైవ్ ఇయర్స్ పట్టినా అమ్మాయి మనసులో ఏముందో అర్థం కాలేదు.
అమ్మాయికి సిక్స్ మంత్స్‌లో అర్థమైపోయింది నువ్వు కరెక్ట్ కాదని. ‘ఇదేంటి సార్, ‘దూరం’ ప్రేమను పెంచుతుందంటారు కదా సార్?’ దూరం అబ్బాయి ప్రేమను పెంచింది... అమ్మాయి ప్రేమను తెంచింది. ‘అలా ఎలా సార్, నేనొప్పుకోను. ఇద్దరూ ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు కదా! ఇద్దరికీ సేమ్ సేమ్ అవ్వాలి కదా సార్?’ అర్థం చేసుకోవడానికి దూరం అవసరమే. కొండను చూడాలంటే లోయలో నిలబడాలి.
లోయను చూడాలంటే కొండపై నిలబడాలి ‘అమ్మాయి కొండ, అబ్బాయి లోయ అంటున్నారా సార్’ అబ్బాయి ప్రేమ గొప్పది కాబట్టి అమ్మాయి కొండలా కనబడుతోంది. ‘అంటే అమ్మాయి ప్రేమ గొప్పది కాదా సార్?’ అమ్మాయి ప్రేమ కొంచెం ప్రాక్టికల్ అనిపిస్తోంది. ‘ఇప్పుడు సూర్య ఏం చేయాలి సార్?’ మేఘం తొలుగుద్ది... సూర్య ప్రకాశిస్తాడు.
– ప్రియదర్శిని రామ్
Comments
Please login to add a commentAdd a comment