
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్... సర్, నా వయసు 26. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం మా ఊరిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా.
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్... సర్, నా వయసు 26. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం మా ఊరిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. తనకీ నేనంటే ఇష్టం. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఎప్పుడూ ఆమెతో ఉండాలి, ఆమెను చూడాలి అనే కోరికతో చాలా జాబ్స్ తనకోసమే మానేశాను. నేను తన కోసం వారానికి ఒకసారైనా తప్పకుండా వెళ్లేవాడిని. మా ఆఫీస్‌లో సెలవు ఇవ్వకపోతే గొడవపడి జాబ్ మానేస్తానని చెప్పి మరీ వెళ్లేవాడిని. చివరికి పెళ్లి కూడా చేసుకున్నాం. అయితే ఒక రోజు వాళ్ల ఇంట్లో విషయం తెలిసిపోయింది. చదువు మాన్పించేశారు. దాంతో సంవత్సరం దూరంగా ఉన్నాం. సరిగ్గా ఏడాదికి ఒకరోజు ఫోన్ చేసి నేను పరీక్షలు రాయడానికి వస్తున్నా అంది. ఎగిరి గంతేశాను. వెళ్లి కలిశాను. తరువాత ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. ఎంత ఫోన్‌లో మాట్లాడుతున్నా.. చూడాలనే కోరిక. ఒకరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టలేనంత ఆనందంతో వేకువనే లేచి 70 కిలోమీటర్లు వెళ్లాను. 12 గంటలకి వస్తానని చెప్పి 4 గంటలకు వచ్చింది.
కోపం తట్టుకోలేక చెయ్యి చేసుకున్నాను. తను ఏడ్చింది. చాలా బాధనిపించింది. కూర్చోబెట్టి ఓదార్చాను. అప్పుడే నిర్ణయించుకున్నా ఇంకెప్పుడూ తనని కొట్టకూడదని. ఆ రోజంతా తనతో సరదాగా గడిచిపోయింది. అయితే ‘నేను కొట్టడం దగ్గర నుంచి అంతా వాళ్ల అన్నయ్య, వాళ్ల ఊరివాళ్లు గమనించారట. విషయం తెలిసి నేను వాళ్ల అన్నయ్యతో మాట్లాడ్డానికి ప్రయత్నించా. ఫోన్ చేసి బుజ్జి అంటే చాలా ఇష్టం అని చెప్పా. అంత ఇష్టం ఉంటే ఎందుకు కొట్టావురా? అన్నాడు. సమాధానం చెప్పలేకపోయాను. వాళ్లంతా నన్ను బాగా తిట్టి... ఫోన్ బ్లాక్ చేయించి తనకు వేరే సంబంధం చూస్తున్నారు. తను మాత్రం నిన్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను, వేరే పెళ్లి చేస్తే చచ్చిపోతా అంటోంది? ఆల్ రెడీ పెళ్లి అయిపోయిన అమ్మాయికి మళ్లీ ఎలా పెళ్లి చేస్తారు? నేను మా వాళ్లని పంపించి మాట్లాడిద్దాం అనుకుంటున్నా. ఏమైనా గొడవ అవుతుందేమో అని భయంగా ఉంది అన్నా... ప్లీజŒ ఏదైనా సలహా ఇవ్వండి. – గోపీరాజ్
కొట్టేది నువ్వే. కట్టేది నువ్వే. తాళి కట్టేది నువ్వే. ఎగతాళి చేసేది నువ్వే. కథ నీదే. స్క్రీన్ ప్లే నీదే. ‘సార్ అలాంటప్పుడు ప్రాబ్లమ్ తానే, సొల్యూషన్ తానే’ అని నవ్వింది నీలాంబరి. గోపీ! ఈ అహంకారం పనికిరాదు. అమ్మాయి ఏమయినా ఆట వస్తువు అనుకున్నావా? ఇష్టమొచ్చినప్పుడు కొట్టడానికి. అసలు ఎన్ని గుండెలు నీకు అమ్మాయి మీద చెయ్యి చేసుకోవడానికి! ఎవరికీ చెప్పకుండా తాళి కట్టడమే కాకుండా అమ్మాయిని అలా గాలికి వదిలేస్తావా..? నిన్ను చేసుకుని అమ్మాయి సంతోషంగా ఉంటుందని ఏంటి గ్యారెంటీ..?
చెంపలు వేసుకో, వాళ్ల కాళ్ల మీద పడి ప్రాధేయపడు. ఆ తరువాత మీ పేరెంట్స్‌ని పంపి అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇప్పించు. ‘ఇవన్నీ చేస్తే మా సారు ఒక గెల కూడా పంపిస్తారు’ అని నా కంటే గంభీరంగా చెప్పింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com