
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
నమస్కారం లవ్ డాక్టర్ రామ్ గారూ! అందరూ ఎం.బి.బి.ఎస్, ఎం.ఎస్, బి.డి.ఎస్ లాంటివి చదివి డాక్టర్లు అయితే మీరు మాత్రం లవ్ చేసి డాక్టర్ అయ్యారు. మీకు నా పాదాభివందనం. అరటి పండు ఏనాడో చేసిన పుణ్యం కాబోలు మీలాంటి ప్రేమికుడు దొరికారు. ఇక నా విషయానికి వస్తే... నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమిస్తోంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అయితే మా కుటుంబ నేపథ్యాలు వేరు.
వాళ్లు తనను సాఫ్ట్‌వేర్ లేదా గవర్నమెంట్ జాబ్ చేసేవారికి ఇవ్వాలని చూస్తున్నారు. కానీ నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు కూడా. తను బాగా భయపడుతోంది. మా పెళ్లి జరగకపోతే తను బతకదు. తను లేకపోతే నేను ఉండలేను. నేను సెటిల్ అయ్యాక వెళ్లి మాట్లాడతాం అంటున్నారు మా పేరెంట్స్. కానీ, తనకు సంబంధాలు చూస్తున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. – వికాస్
అయ్యయ్యో... గుండెలు బద్దలు ఆయెనె!
అయ్యయ్యో... కన్నీళ్లు కారిపోయెనె!
అయ్యయ్యో... నేపథ్యాలు వేరు ఆయెనె!
అయ్యయ్యో... పేరెంట్స్ కిరికిరి ఆయెనె!
ఉన్నది కాస్తా ఊడింది!
సర్వ మంగళం పాడింది!
సాఫ్ట్‌వేర్ ముందు లెక్చరర్ లవ్ స్టోరీ తిరుక్షవరమైపోయింది!
అయ్యయ్యో... మాస్టార్ ఇప్పుడేమి చెయ్యాలి..?
అయ్యయ్యో... అమ్మాయికి ఇప్పుడేమి చెప్పాలి..?
‘సార్... బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘కులగోత్రాలు’లో రమణారెడ్డి నెత్తి మీద టవల్ వేసుకుని పాడిన పాటకు కొత్త పల్లవి రాస్తున్నారు. యంగ్‌స్టర్స్ బెంబేలెత్తుతారు. ఎందుకు సార్ వాళ్లని అలా పాత ట్యూన్స్‌లో కొత్తగా వాయిస్తున్నారు?’ ఏమి చేయమంటావు నీలాంబరి! ఇద్దరి ప్రేమ ప్యూర్. బిస్లరీ వాటర్ కన్నా స్వచ్ఛమైన ప్యూర్. వీళ్ల ప్రేమను నెత్తిమీద జల్లుకుంటే ఎవరి ప్రేమైనా పవిత్రమయిపోతుందనిపిస్తుంది. అసలు వీళ్ల ప్రేమ ఒక పవిత్రపుస్తకం. చదువుకున్న వాడు లవ్ డాక్టర్ అయిపోతాడు! ‘సార్, వికాస్ ఏదో కొంచెం వ్యంగ్యంగా ‘లవ్ డాక్టర్’ని మెచ్చుకున్నట్లు తిట్టాడని మనసులో పెట్టుకుని పాపం పవిత్ర ప్రేమికుడికి ఆన్సర్ ఇవ్వకుండా తొక్క ఇస్తారా సార్..?’‘హీ విల్ బీ వెరీ హర్టెడ్ సార్.. సరిగ్గా చెప్పండి ఏమి చెయ్యాలో లేకపోతే...’లేకపోతే క్యా కర్తే..?
‘అయ్యయ్యో.. అరటిపండు అయిపోయెనె!అయ్యయ్యో.. తొక్క వడలి మిగిలెనె!అయ్యయ్యో...’ ని.. నీ.. ల.. లా.. అం.. అంబా.. అంబరీ.. నా కడుపు మీద కొట్టకు, చెబుతా! చెప్పక ఛస్తానా..?మై డియర్ వికాస్... చేతిలో ఉద్యోగం ఉంది! మైండ్‌లో నాలెడ్జ్ ఉంది! గుండెలో లవ్ ఉంది! ఇంట్లో అప్రూవల్ ఉంది! బస్ రెంట్‌కు జేబులో క్యాష్ ఉంది! బంధువులను స్నేహితులను పేరెంట్స్‌తో పాటు తీసుకునివెళ్లి అమ్మాయి పేరెంట్స్ ముందు నీ ప్రేమను అరటిపండ్లలో పెట్టి సమర్పించు! బి బ్రేవ్ మై డియర్ ఫ్రెండ్! ‘అబ్బా.. ఏమి చెప్పారు సర్! అరటిపండు వొలిచి పెట్టినట్టు! ఇంద టేక్ వన్ డజన్ ఐ.. సే..’ అని నీలాంబరి నవ్వింది.
- ప్రియదర్శిని రామ్‌లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com