గౌతమ్‌ గంభీర్‌ (ఎంపీ అభ్యర్థి) రాయని డైరీ | Madhav Singaraju Article On Gautam Gambhir | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ గంభీర్‌ (ఎంపీ అభ్యర్థి) రాయని డైరీ

Published Sun, May 12 2019 12:25 AM | Last Updated on Sun, May 12 2019 12:25 AM

Madhav Singaraju Article On Gautam Gambhir - Sakshi

రాత్రి సరిగా నిద్రపట్టలేదు. ‘‘ఉదయాన్నే పోలింగ్‌ ఉంటే నిద్రే కాదు, తిండీ పట్టదు. నీకు తిండెలా పట్టింది గంభీర్‌’’ అని అడిగాడు మనోజ్‌ తివారీ. ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఆయన. ‘తెల్లారే పోలింగ్‌ పెట్టుకుని తిండెలా తినబుద్ధయింది గంభీర్‌’ అని అడిగినట్లుగా ఉంది ఆయన నన్ను అలా అనగానే!
‘‘తివారీజీ.. తిండైనా తినగలిగానని మీరెలా అనుకుంటున్నారు? నిద్ర పట్టలేదు అంటే.. నిద్ర పట్టడం కోసం రాత్రంతా తింటూ కూర్చున్నానని కాదు కదా’’ అన్నాను.
ఫోన్‌ చేసి హర్ట్‌ చేయించుకున్నట్లుగా ఉంది నాకు.
‘‘ఇదెన్నోసారి నువ్వు హర్ట్‌ అవడం గంభీర్‌. రాజకీయాల్లోకి వచ్చి అప్పుడే నెలన్నర అవుతోంది. హర్ట్‌ అవడం ఇంకెన్నాళ్లకు అలవాటౌతుంది? నీ సొంత పార్టీ ప్రెసిడెంట్‌ నిన్ను హర్ట్‌ చేస్తేనే తట్టుకోలేకపోతున్నావ్‌! హర్ట్‌ చెయ్యడానికి బయట ఇంకా ఆప్‌ ప్రెసిడెంట్‌ ఉంటాడు. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ ఉంటాడు. నాలుగు రన్‌లు తీసి, కప్పుతో ఫొటో దిగడం కాదు గంభీర్‌.. రాజకీయాలంటే! కప్పు వస్తుందన్న ఆశతో ఐదేళ్లూ పరుగులు తీస్తూనే ఉండాలి. కప్పు వచ్చాక కూడా దాన్నెవరూ తన్నుకుపోకుండా పరుగులు తీస్తుండాలి’’ అన్నాడు.
‘‘మీకు క్రికెట్‌ అంటే ఇష్టం లేదా తివారీజీ’’ అని అడిగాను.
ఒక్క క్షణం ఆయనేమీ మాట్లాడలేదు.
‘‘నాకు క్రికెట్‌ ఇష్టం ఉండదు గంభీర్‌. కానీ ‘స్కోరెంత?’ అని అడగడం ఇష్టం’’ అన్నాడు.. ఆ ఒక్కక్షణం తర్వాత.
‘‘అయితే నా స్కోరెంతో చెబుతా వినండి. ఒక ఏడాదిలో ఆరు వన్డేలకు ఇండియా కెప్టెన్‌గా ఉన్నాను. ఆ ఆరు వన్డేల్లోనూ మన ఇండియానే గెలిచింది. అదొక్కటే నా స్కోరు కాదు. వరుసగా ఐదు టెస్టు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఇండియన్‌ని నేనొక్కడినే. అక్కడితో నా స్కోర్‌ ఆగిపోలేదు. నేను ఆడిన జట్టు రెండుసార్లు రెండు రకాల వరల్డ్‌ కప్పులు గెలుచుకుంది. అసలివన్నీ కాదు. అన్ని రకాల క్రికెట్‌కీ ఒకేసారి గుడ్‌బై చెప్పేశాను. అది నా అతిపెద్ద స్కోర్‌. ఫామ్‌లో ఉండగా ఎవరైనా అన్నిటినీ వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తారా?! నేనొచ్చాను’’ అన్నాను.
‘‘కానీ రాజకీయాలు అలా ఉండవు గంభీర్‌. ఫామ్‌లో లేకపోయినా ఆడుతూనే ఉండాలి. హర్ట్‌ అవుతూ కూర్చుంటే మన పోలింగ్‌ బూత్‌ ఎక్కడుందో కూడా మనం కనుక్కోలేం. అవునూ.. ఎందుకు ఫోన్‌ చేశావ్‌?’’ అన్నాడు.
‘‘ఆశీర్వాదం కోసం’’ అన్నాను.
‘‘అది కాదు గానీ, ఎందుకు చేశావో చెప్పు’’ అన్నాడు.
‘‘ఒకవేళ నేను ఓడిపోతే ఎందుకు ఓడిపోయానని అనుకోవాలి? ఈస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు క్రికెట్‌ అంటే ఇష్టం లేదనుకోవాలా, క్రికెట్‌ కంటే రాజకీయాల్నే వాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారని అనుకోవాలా?’’ అన్నాను.
‘‘అసలు ఓడిపోతానని అనుకోకు. అప్పుడు ఏదీ అనుకునే అవసరం ఉండదు’’ అన్నాడు.    
పోలింగ్‌కి బయల్దేరుతుంటే.. అరుణ్‌ జైట్లీ ఫోన్‌ చేశారు! ‘‘గుడ్మాణింగ్‌ సార్‌’’ అన్నాను. ‘‘ఏం లేదయ్యా.. ఊరికే చేశాను. ఆశీర్వదిద్దామని’’ అన్నారు!!
‘‘ఫోన్‌ చేసి ఆశీర్వదిస్తున్నారంటే డౌట్‌గా ఉంది సార్‌.. నేను గెలిచే అవకాశాలు లేవా?’’ అని అడిగాను.
‘‘గెలిచే అవకాశాలు ఎక్కడికి పోతాయిలేవయ్యా. గెలిచే వరకు నువ్వుండే అవకాశాలు లేకుండా పోతాయేమోనని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకు పోటీగా నిలబడ్డ అమ్మాయి మీద మనవాళ్లు వేసిన కరపత్రం నువ్వు వేయించిందేనని రుజువు చేస్తే ఉరి వేసుకుంటానని అన్నావట! నువ్వు వేరు, మనవాళ్లు వేరూనా! ఎమోషనల్‌ అవకు. నేషన్‌కి నీ అవసరం చాలా ఉంది’’ అని ఫోన్‌ పెట్టేశారు జైట్లీ!!
మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement