
న్యాయం కోసం నలభయ్యేళ్లుగా...
మహిళకి మహిళే శత్రువు అంటూ ఉంటారంతా. అదెంత వరకూ నిజమో తెలియదు కానీ... మహిళలకు మహిళే మిత్రురాలు, ఒక మహిళ గురించి మరొక మహిళే ఆలోచించగలదు అంటారు ‘పై సంగ్‌ఖుమి’.
మహిళకి మహిళే శత్రువు అంటూ ఉంటారంతా. అదెంత వరకూ నిజమో తెలియదు కానీ... మహిళలకు మహిళే మిత్రురాలు, ఒక మహిళ గురించి మరొక మహిళే ఆలోచించగలదు అంటారు ‘పై సంగ్‌ఖుమి’. నలభయ్యేళ్లుగా మిజోరాంలో మహిళల సంరక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారామె. తన స్వరాన్ని బలంగా వినిపించి, ప్రభుత్వాన్ని సైతం కదిలించే దిశగా సంగ్‌ఖుమి చేసిన ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది...
తూర్పు మిజోరాంలోని ఓ గ్రామం. ఆ రోజు అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఒక విజయం వల్ల కలిగిన ఆనందం అందరి ముఖాల్లోనూ వెల్లి విరుస్తోంది. అందరూ సంతోషంగా నృత్యం చేస్తున్నారు. వారి మధ్యలో ఓ ఇద్దరు మహిళలు దీనంగా కూర్చుని ఉన్నారు. ఇద్దరి కళ్లలోనూ ఏదో లోతైన భావం. ఇద్దరి ముఖాల్లోనూ కదిలించే దైన్యం. వారి దగ్గరకు వెళ్లి భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంది సంగ్‌ఖుమి. ‘మీకు ఇప్పటికి న్యాయం జరిగింది’ అందామె ఇద్దరి ముఖాల్లోకీ చూస్తూ. అవును. వారికి న్యాయం జరిగింది. అది కూడా నాలుగు దశాబ్దాల తర్వాత. అందుకు కారణం... సంగ్‌ఖుమియే.
అది 1966వ సంవత్సరం, నవంబర్ నెల. మిజో నేషనల్ ఫ్రంట్ కార్యకర్తలు తమ హక్కుల కోసం తీవ్రంగా పోరాడు తున్నారు (1959లో ఏర్పడిన సంక్షోభ బాధితులు కొందరు కలిసి ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. మిజో నేషనల్ ఫ్రంట్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు). ఆ పోరాటంలో భాగంగా జవాన్ల జీపు మీద దాడి చేశారు. అందుకు కక్ష కట్టిన సదరు జవాన్లు ఆ ఉద్యమకారుల ఇళ్లపై దాడి చేశారు. వాటిని తగులబెట్టారు. ఇద్దరు కార్యకర్తల కుమార్తెలను దారుణంగా మానభంగం చేశారు.
అది ఆ అమాయక ఆడపిల్లల తనువులనే కాదు... మనసులను కూడా తీవ్రంగా గాయపరిచింది. ఒక అమ్మాయి పిచ్చిదానిలా అయిపోయింది. మనుషులను చూస్తేనే భయపడి పారిపోవడం మొదలుపెట్టింది. మరో అమ్మాయి ఆ పీడకలను తలచుకుంటూ తనలో తనే కుమిలి పోయింది. అందరూ వాళ్లను చూసి అయ్యో అన్నారు. కానీ సంగ్‌ఖుమి మాత్రం వారికి న్యాయం చేసి తీరాలని నడుం కట్టారు. ప్రభుత్వంతో పోరాడి నలభై యేళ్ల తరువాత వాళ్లిద్దరికీ ఐదేసి లక్షల చొప్పున నష్ట పరిహారం ఇప్పించింది. వాళ్లకే కాదు... అలాంటి అబలలెందరికో సంగ్‌ఖుమి న్యాయం చేశారు.
అలుపెరుగని పోరాటం...
కష్టమంటే ఏమిటో చిన్న ప్పట్నుంచే తెలిసినా... ఈ సమాజంలో ఆడపిల్ల పరిస్థితి ఏమిటో తన తండ్రి చనిపో యాక తెలిసి వచ్చింది సంగ్ ఖుమికి. ఆమె తండ్రి మిజో నేషనల్ ఫ్రంట్‌లో సభ్యుడు. ఎప్పుడూ ఉద్యమం అంటూ తిరిగేవాడు. చివరికి ఆ పోరాటం ఆయన ప్రాణాలు తీసింది. వారి కుటుంబం రోడ్డున పడింది. మగ దిక్కు లేక ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో మిజోరాంలో మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. విద్య అందేది కాదు. విజ్ఞానం అంతకన్నా లేదు. స్వేచ్ఛగా బతికేందుకు అవకాశాలు లేవు అవమానాలు తప్ప. కిడ్నాపులు, మానభంగాలు ఓ పక్క, వరకట్నం, గృహ హింస మరోపక్క వారి జీవితాలను బలి తీసుకుంటున్నాయి. ఇక తమలాంటి ఒంటరి ఆడవాళ్లు బతకులీడ్చడమంటే మరీ కష్టమైన పని. కేసులు పెట్టడం కల్ల. విడాకులు అన్న మాటకు చోటే లేదు. ఆ పరిస్థితి ఆమెను కలచివేసింది. ఆడవారికి సంతోషంగా, స్వేచ్ఛగా బతికే హక్కు లేదా అన్న ప్రశ్న ఆమె మెదడును తొలిచేసింది. అది ఓ పెద్ద పోరాటానికే దారి తీసింది.
మిజోరాంలో ఆడవారి దీన పరిస్థితికి కారణం... న్యాయవ్యవస్థలో ఉన్న అసమానతలే అని అర్థం చేసుకుంది సంగ్‌ఖుమి. అందుకే వివక్షకు, హింసకు బలవుతున్న మహిళలకు న్యాయపరమైన సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో... 1974లో ఒక సంస్థను స్థాపించి, మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. ఆమె పోరాటాన్ని చూసి స్ఫూర్తి పొందిన మరికొందరు మహిళలు సంగ్‌ఖుమితో కలిశారు. అందరూ కలిసి ఎక్కడ ఏ మహిళకు న్యాయపరమైన సలహాలు, సహకారం కావలసి వచ్చినా మేమున్నామంటూ నిలబడు తున్నారు. సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.
తను తన పోరాటాన్ని మొదలుపెట్టినప్పటి కాలంతో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగుపడినా... ఇప్పటికీ తమ రాష్ట్రంలో స్త్రీల పరిస్థితి దయనీయంగానే ఉందని అంటున్నారు సంగ్‌ఖుమి. వారి పరిస్థితి పూర్తిగా మారిపోవాలి అంటారామె. అది తప్పక జరిగి తీరుతుంది. ఎందుకంటే... జరిగే వరకూ సంగ్‌ఖుమి నిద్రపోదు కనుక!
- సమీర నేలపూడి
పెళ్లి, కట్నం, విడాకులు వంటి విషయాల్లో మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలంటూ రాష్ట్ర న్యాయ కమిషన్‌పై తీవ్ర ఒత్తిడిని తెచ్చారు సంగ్ ఖుమి. ఫలితంగా 2013లో మిజో డైవోర్‌స బిల్ తయారైంది. మహిళలకు తప్పక న్యాయం చేస్తామంటూ మిజోరాం ప్రభుత్వం మాట ఇచ్చింది.