
నిఖిత, మేజర్ విభూతి శంకర్ (ఫైల్ ఫొటో)
‘నువ్వేం చెప్పావ్.. నన్ను ప్రేమించాననే కదా! అయితే నాకన్నా దేశాన్నే ఎక్కువగా ప్రేమించావు. గర్వంగా ఉంది. నీ ప్రేమ గొప్పది. నువ్వెన్నడూ చూడనైనా చూడని వారి కోసం నీ ప్రాణాలను త్యాగం చేశావు. ధైర్యవంతుడివి. నీ జీవిత భాగస్వామిని అయి ఉండటం నాకొక గౌరవం. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితం నీదే’’. వైఫాఫ్ మేజర్ విభూతి శంకర్
జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ వీరమరణం పొందగా భర్త స్ఫూర్తితో ఆయన భార్య నిఖితా కౌల్ సైన్యంలో చేరనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు. త్వరలోనే శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్లనున్నారు. ఏడాది క్రితం.. ఇదే నెలలో.. కశ్మీర్ నుంచి.. డెహ్రాడూన్ చేరుకున్న మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భౌతికకాయం ఉన్న శవపేటికపై వాలి, ఆయన భార్య నిఖితా కౌల్ అన్నమాటలివి. మనసులో అనుకోలేదు. గొణుక్కున్నట్లు అనుకోలేదు. స్పష్టంగా.. బతికున్న మనిషితో మాట్లాడినట్లే భర్తపై తన ప్రేమను వ్యక్తం చేశారు నిఖిత. గత ఏడాది ఫిబ్రవరి 18న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు శంకర్. భీకర పోరు అది. పుల్వామాలో నలభైమంది జవాన్‌లను పొట్టన పెట్టుకున్న జైషే–మొహమ్మద్ ఉగ్రనేత ఘాజీ రిషీద్‌ను నాలుగు రోజుల పాటు వెతికి వేటాడి హతమార్చాక, ఎదురు కాల్పుల్లో తనూ చనిపోయాడు మేజర్ శంకర్. అప్పటికి నిఖితతో అతడి పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదు. భర్త మరణవార్త ఆమెను కుదిపేసింది. అతడికి 33. ఆమెకు 27. ఇంకా చాలా జీవితం ఉంది. భర్త అంత్యక్రియల్లో నిఖిత అన్నమాట ఎవరూ మర్చిపోలేనిది. ప్రతి భారతీయుడిని ఉద్దేశించి ఆమె ఆ మాట అన్నారు. ‘‘ఇలాంటప్పుడే మనం బలంగా ఉండాలి. ఇప్పుడే మనం కలిసికట్టుగా ఉండాలి..’ అంటూ, హరిద్వార్‌లో గంగానది ఒడ్డున్న ఆయన చితికి సెల్యూట్ చేశారామె. ఆ క్షణంలోనే శత్రువుపై అంతకంతా తీర్చుకునేందుకు మానసికంగా ఆమె సైన్యంలోకి వెళ్లిపోయారు.
∙∙
ఏడాది గడిచింది. ఇండియన్ ఆర్మీలో చేరడానికి నిఖిత ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి.) పరీక్ష రాశారు. ఇంటర్వ్యూలో ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఒక ఎమ్.ఎన్.సి. (మల్టీ నేషనల్ కంపెనీ)లో పని చేస్తున్నారు. ఆ ఉద్యోగాన్ని వదిలి, త్వరలోనే ఆర్మీ శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీకి వెళ్లబోతున్నారు. ఎస్.ఎస్.సి. పరీక్ష రాస్తున్నప్పుడు.. తన భర్త కూడా ఇలాగే పరీక్ష రాసి ఉంటారు కదా అన్న ఆలోచన వచ్చి ఆయనకు తనెంతో దగ్గరగా ఉన్నట్లు అనుభూతి చెందానని నిఖితా కౌల్ అన్నారు. భర్తకు ఒక జ్ఞాపకంగా మాత్రమే ఆమె మిగిలిపోదలచుకోలేదు. భర్త మిగిల్చి వెళ్లిన బాధ్యతల్ని తుపాకీలా భుజాన మోయాలని గట్టిగానే తీర్మానించుకున్నారు.
అతడు.. ఆమె.. సైన్యం ‘మీ పెళ్లయి ఎన్నాళ్లయింది?’ అడిగింది ఇంటర్వ్యూ బోర్డు. ‘దాదాపు రెండేళ్లు’ జవాబిచ్చారు నిఖిత. ‘కాని మీ పెళ్లయి తొమ్మిది నెలలైనట్టు విన్నామే’ అని ఆశ్చర్యపోయారు బోర్డు సభ్యులు.‘ నా భర్త భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టినంత మాత్రాన మా పెళ్లి ముగిసినట్లు కాదు కదా?’ తిరిగి ప్రశ్నించారు నిఖిత. నిజమే.. పెళ్లయిన తొమ్మిదినెలలకే భర్త అమరుడయ్యాడు. కాని ఆమె అతని తోడును కోల్పోలేదు. దేశం పట్ల అతనికున్న భక్తి, ఆ యూనిఫామ్ అంటే అతనికున్న నిబద్ధత ఆమె మనసులో అతణ్ణి సజీవంగా ఉంచాయి. తనూ సైన్యంలో చేరడమే తన భర్తకు ఆమె ఇచ్చే ఘనమైన నివాళిగా భావించారు. నిఖిత కౌల్.. కశ్మీర్ వాసి. ఢిల్లీ దగ్గరి నోయిడాలో ఉద్యోగం.‘‘మన దేశ జెండా గుడ్డలో చుట్టి తెచ్చిన నా భర్త భౌతిక కాయాన్ని చూసినప్పుడే నిశ్చయించుకున్నాను ఆయన అడుగుజాడల్లో సాగాలని.
ముందసలు నా భర్త లేడు అన్న సత్యాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నెమ్మది నెమ్మదిగా అలవాటుపడ్డాను. విభూ చాలా ప్రోగ్రెసివ్. తన కన్నా నేను గొప్పగా ఉండాలని ఆశపడేవాడు. ఆయన ఆలోచనలు, ఆశయాలే నన్ను ఇండియన్ ఆర్మీ వైపు నడిపించాయి. నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా కాదా అన్న సందేహం ఏమాత్రం వచ్చినా.. ఏ కొంచెం ఆందోళన కలిగినా వెంటనే కళ్లు మూసుకొని విభూ ఉంటే ఏం చేసేవాడు అని ఆలోచించేదాన్ని. వెంటనే నాకున్న సందేహాలు, ఆందోళన మాయం అయిపోయేవి. విభు చనిపోయాక ఆర్నెల్లకు ఎస్‌ఎస్‌సికి దరఖాస్తు చేశాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఎస్‌ఎస్‌సి ప్రిపరేషన్ ఎంతగానో ఉయయోగపడింది. నేను పరీక్ష రాస్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి హాజరవుతున్నప్పుడు విభూనే తలుచుకున్నాను.. ఈ పరీక్ష, ఇంటర్వ్యూలప్పుడు తను ఎలా ఫీలయ్యుంటాడో అని. ఆయన భయాలు, ఆందోళనలతో నేనూ కనెక్ట్ అయ్యాను. ఒకరకంగా అదే నాకు శక్తినిచ్చిందని చెప్పొచ్చు’ అంటారు నిఖితా కౌల్.
Comments
Please login to add a commentAdd a comment