మళ్లీ మళ్లీ మల్లీశ్యరి | Mallisyari again | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ మల్లీశ్యరి

Published Sun, Aug 30 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

మళ్లీ మళ్లీ మల్లీశ్యరి

మళ్లీ మళ్లీ మల్లీశ్యరి

రాయలవారి ముందు...
‘నా ప్రాణం తీసుకోండి... బావని వదిలేయండి’
‘లేదూ నా ప్రాణం తీసుకోండి, మల్లిని వదిలేయండి’ అని
ప్రాధేయపడుతుంటే మన గుండె తరుక్కుపోతుంది.
‘నా ప్రాణం తీసుకోండి’ అని ఇద్దరూ అంటున్నారంటే...
నిజానికి ఒకరి ప్రాణం ఒకరిలో ఉందని.
ఈ ప్రమాదం జరుగుతుందని ప్రేక్షకుడిగా మనకి ముందే అనిపిస్తుంది.
అప్పుడే అనుకుంటాం...
‘అయ్యో తప్పు చేస్తున్నావు...
నీ మల్లికి కావాల్సింది రాణివాసం కాదు...
నీ హృదయ సామ్రాజ్యానికి రాణి అవడం’ అని అరిచి చెప్పాలని!
ఈ సినిమా మనకి చెప్పే గొప్ప గుణపాఠమే అది.
గమ్మత్తు కోసమైనా... పరాచికాలాడకూడదని.
భానుమతికి పల్లకి పంపించమని ఎన్టీఆర్ పరాచికం ఆడితేనే...
ఈ అరాచకం జరిగింది.
అంత అందంగా ప్రేమించుకునే చిలకాగోరింకలు
ఒంటరులై, ఎవరికి వారై, తెలిసీతెలియక
కోరితెచ్చుకున్న ఎడబాటుతో కుమిలిపోయారు.
గుండెను పిండే అందమైన ప్రేమకథ.
ఎన్టీవోడు, భానుమతి ఇంకా అందంగా ఉంటారు.
పాటలు మీగడతరకల్లా... మాటలు తేనెల ఊటల్లా...
సన్నివేశాలు కవ్వించి, నవ్వించి, ఏడిపించేలా...
మళ్లీ... మళ్లీ... మల్లీశ్వరిలా....
మళ్లీ చూడండి

 
‘‘ఏక చక్రీ మహాభోగీ! మహారాణివౌతావు. మహాభోగం పొందుతావు తల్లీ. బ్రహ్మ మాటకైనా తిరుగుంది కానీ ఈ బసవయ్య మాటకు తిరుగులేదు తల్లీ! జై శంకర మహాదేవ్’’
భానుమతి చెయ్యి చూసి ఫ్యూచర్  చెప్పాడు తిరణాల జోస్యుడు.
టీన్స్‌లో ఉన్న ప్రతి పిల్లా క్వీనే కానీ... జోతిష్యుడు చెప్పాడని మహారాణి అయి కూర్చుంటుందా?
‘‘వెళ్దాం పద’’ అన్నాడు ఆ పిల్ల బావ ఎన్టీఆర్.
‘‘బావా! నీ చెయ్యి కూడా చూపించు’’ అంది భానుమతి.
‘‘ఆ.. నా చెయ్యి ఎందుకూ - నువ్వు మహారాణివైతే, నేను మహారాజునైనట్టే’’.
భానుమతి బిడియంతో ముడుచుకుంది. చిరునవ్వు నవ్వింది.
బావంటే భానుమతికి ప్రాణం. ఎన్టీఆర్‌కీ అంతే. కానీ ఎక్స్‌ప్రెస్ చెయ్యడు. శిల్పాలు చెక్కుతూ ఉంటాడు. ఒక్కరోజైనా ఇద్దరూ చూసుకోకుండా, మాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా ఉండలేదు. ఆ రోజూ అంతే. బావామరదళ్లిద్దరూ కలిసి ఎడ్లబండిలో తిరణాలకని వీరాపురం నుండి వచ్చారు.
వీరాపురం... వెరీ నియర్ టు విజయనగరం.
తిరిగి వెళ్లే సమయానికి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి!
ఈ పడుచు జంటపై పన్నీటి జల్లులు కురవబోతున్నాయా? వారి ప్రేమను కన్నీటి జడులు ముంచెత్తబోతున్నాయా?
ఆ మేఘాలు దేనికి సంకేతం?
   
పైన ఉరుముతోంది. పాడుబడిన సత్రంలోకి పరుగెత్తారు ఎన్టీఆర్, భానుమతి. వాన మొదలైంది. అది ఆగేవరకు వీళ్లూ ఆగాలి. వేరే దారి లేదు. వాతావరణం చల్లగా ఉంది. భానుమతి మనసు పులకించింది. ఆడింది. ‘పిలిచిన బిగువటరా ఔరౌరా...’ అని పాడింది. రాజా అంటే నాగరాజు. మన ఎన్టీఆర్.
వీళ్లిక్కడికి ఎలాగైతే వర్షానికి తలదాచుకోవాలని వచ్చారో... అలాగే మరో ఇద్దరు అక్కడి చేరుకున్నారు. భానుమతి నాట్యాన్ని, పాటనీ... చూసీ, వినీ ఆ ఇద్దరూ పులకించి పోయారు. వాళ్లల్లో ఒకరు మారువేషంలో ఉన్న విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకొకరు ఆయన ఆస్థాన పండితుడు.
   
హోరు ఎంతకూ తగ్గడం లేదు.
వాళ్లూ వీళ్లూ మాటలు కలుపుకున్నారు. ఊర్లూ పేర్లూ చెప్పుకున్నారు.
‘‘ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు... మల్లీశ్వరి’’ అని చెప్పాడు ఎన్టీఆర్. మల్లీశ్వరి అంటే మన భానుమతే.
రాయలవారు వాత్సల్యంగా చూశారు.
‘‘అమ్మాయీ... ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం. ఇదిగో! మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం’ అని మెడలోంచి హారం తీసి ఇవ్వబోయాడు.
‘‘వద్దండీ’’ అంది భానుమతి వినయంగా.
‘‘అలా అనకూడదమ్మా. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. ఈ హారం మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలతో గౌరవింపదగింది. నువ్వు చెప్పు నాయనా’’ అన్నాడు పండితుడు ఎన్టీఆర్ వైపు చూస్తూ.
తీసుకోమన్నాడు బావ. ఆభరణాన్ని అందుకుంది మరదలు.
వాన హోరు తగ్గింది.
భానుమతి మాటల జోరు మాత్రం తగ్గడంలేదు. తన ముందున్నది రాయలవారని తెలియక, తన ధోరణిలో తను ఏదో మాట్లాడుతూనే ఉంది. రాయల వారు నవ్వుతూ వింటున్నారు.
మరదల్ని ఆటపట్టిద్దామని ఎన్టీఆర్ అన్నాడు - ‘‘ఈమె ఆటాపాట మెచ్చుకున్నారు కదా. ఒక ఉపకారం చేస్తారా?’’ అని.
అడగమన్నాడు పండితుడు.
‘‘మరేం లేదులెండి, ఇందాక ఏదో సెలవిచ్చారే... మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలని! అవేవో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో, ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి... ఆ కాదులెండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి, పల్లకీ పంపేట్టు మాత్రం చూడండేం’’ అన్నాడు భానుమతిని ఏడిపించడానికి. రాయల వారు ముచ్చటగా నవ్వారు. అక్కడి నుంచి ప్రయాణమయ్యారు.
‘‘పో బావా నీతో మాట్లాడను. ఎందుకు చెప్పు... వాళ్లతో పల్లకి పంపమని చెప్పడం’’ అంది భానుమతి ఎన్టీఆర్ వైపు చిరుకోపంతో చూస్తూ.
ఎన్టీఆర్ నవ్వాడు.
‘‘ఓస్ పిచ్చిపిల్లా! వీళ్లేనా పల్లకీలు, పట్టపుటేనుగులూ పంపేది! వీళ్లకసలు రాయలవారి దర్శనమే కాదు’’అని తేల్చేశాడు.
కానీ తను చేసిందే పిచ్చి పని అని అప్పుడు అతడికి తెలీదు.
   
ఎన్టీఆర్, భానుమతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ జంటను చూసి చెట్టూపుట్టా కూడా మురిసిపోతున్నాయి. కానీ భానుమతి తల్లే. ఆమెకు మాత్రం ఎన్టీఆర్‌ని చూస్తే చిర్రెత్తుకొచ్చేస్తోంది. శిల్పాలు చెక్కడం తప్ప వేరే పని చేతకాని అప్రయోజకుడికి  పిల్లనిచ్చి చెయ్యడం ఆమెకు ఇష్టం లేదు. మేనల్లుడు ఉండగా వేరెవరికో ఇచ్చి చెయ్యడం భానుమతి తండ్రికి ఇష్టం లేదు.
ఓ రోజు భానుమతి తల్లి ఎన్టీఆర్ తల్లిని పట్టుకుని కడిగేసింది.
‘‘నీ కొడుకు అప్రయోజకుడు. వాణ్ణి నా కూతురితో కలవన్వికు’ అని తిట్టేసింది. అది తెలిసి నాగరాజు పంతం పట్టాడు. నాగమ్మ (భానుమతి తల్లి) కోరినంత ధనం తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు పడేసి, తనూ ధనవంతుడినే అనిపించుకుని భానుమతిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తన చేతిలో శిల్పకళ ఉంది. కష్టపడి పనిచేస్తే ఏ ఆస్థానంలోనైనా ఉద్యోగం రాకపోదని అతడి నమ్మకం. భానుమతి అడ్డుచెప్పినా వినకుండా, ‘నేను వచ్చేంత వరకు మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటావుగా’ అని మాట తీసుకుని మరీ వెళ్లిపోయాడు.
రోజులు గడుస్తున్నాయి. బావ కోసం ఎదురు చూస్తోంది భానుమతి. ఎంతకూ రాడు.
‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు / దేశదేశాలన్ని తిరిగి చూసేవు / ఏడ తానున్నాడో బావ / జాడ తెలిసిన పోయి రావ ’ అని తన బాధను మేఘాలతో మొరపెట్టుకుంది.
బావ రాలేదు. బంగారు పల్లకీ వచ్చింది! రాణీవాసం రమ్మంది. భానుమతికి తల తిరిగిపోయింది.
భానుమతి తల్లి గాల్లో తేలిపోయింది.
భానుమతి తండ్రి విచారంలో మునిగిపోయాడు.
తన ప్రమేయం లేకుండా, తనకు ఇష్టం లేకుండా, బావకు ఒక్కమాటైనా చెప్పే అవకాశం లేకుండా... పెద్దల ప్రోద్బలంతో రాణివాసానికి వెళ్లిపోయింది భానుమతి.
   
డబ్బు సంపాదించుకొచ్చాడు ఎన్టీఆర్. మరదలు కనిపించలేదు!
‘‘మల్లమ్మని మర్చిపో తండ్రీ’’అని తల్లి నిట్టూర్చింది. విషయం చెప్పింది. మరదలు రాణివాసం వెళ్లిపోయిందని తెలిసి పిచ్చివాడయ్యాడు ఎన్టీఆర్. మళ్లీ ఊరొదిలి వెళ్లిపోయాడు.
అక్కడ అంతఃపురంలో భానుమతిదీ ఇదే పరిస్థితి. అంతఃపురం వదిలి బయటికి రాలేదు. బావనే తలచుకుంటూ బంగారు పంజరంలో కృశించిపోతోంది.  
ఓరోజు - రాయలవారి ఆస్థాన శిల్పులు, రాళ్ల కోసం ఓ గుహలోకి వచ్చి, అక్కడ పిచ్చివాడిలా ఉన్న ఎన్టీఆర్‌నీ, అతడు చెక్కిన శిల్పాలను చూసి ఆశ్చర్యపోయారు. రాచనగరులో నిర్మిస్తున్న నర్తనశాలకు అవసరం అని చెప్పి, ఒప్పించి మరీ తీసుకెళ్లారు. అలా నర్తనశాల పనిలో పడ్డాడు ఎన్టీఆర్. కానీ బాధ నుండి బయటపడలేదు.
ఒకనాడు అంతఃపుర స్త్రీలు నర్తనశాల నిర్మాణం చూడ్డానికి వచ్చారు. వారితో పాటు భానుమతీ వచ్చింది. ఆ శిల్పం ఈ శిల్పం చూస్తూ, అక్కడి శిల్పిగా పనిచేస్తున్న బావను చూసి ఆశ్చర్యపోయింది. అతడిని రహస్యంగా కలుసుకుని ‘బావా... బావా’ అని పరవశించిపోయింది. మరదల్ని చూడగానే ఎన్టీఆర్ కళ్లలోకి ఆనందం, అతడి కళకు ఒక పరిపూర్ణత వచ్చాయి. రెండోసారీ కలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతీ రాజభటులకు దొరికి పోయింది. తర్వాతేమిటి? ఇంకేముంటుంది ఉరి!
   
అపరాధానికి శిక్ష ఉరి. కానీ ఎవరు అపరాధి? బావా? మరదలా? లేక ఇద్దరూనా? ఆనాడు తను వేళాకోళంగా అన్న మాట వల్లనే తన మరదలికి రాణివాసం సంప్రాప్తించిందని రాయలవారి మాటల్లో గ్రహించాడు ఎన్టీఆర్. ‘‘అపరాధమంతా నాదే ప్రభూ... నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి’’ అని వేడుకున్నాడు.
‘‘ప్రభూ అపరాధమంతా నాదే’’ అంటూ ఏకధాటిగా రోదించింది భానుమతి.
‘‘కాదు, అపరాధమంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం’’ అన్నాడు రాయలవారు. ‘‘కాదు ప్రభూ. అపరాధమంతా నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు. నన్ను ఉరి తీయించి, నా బావను రక్షించండి’’ అంది భానుమతి తప్పును తన మీద వేసుకుని.
‘‘సార్వభౌముల వారికి గట్టి చిక్కే వచ్చింది. ఈ ధర్మసూక్ష్మం ఎలా విడదీస్తారో’’ అన్నాడు పండితుడు.
రాయలవారు చిరునవ్వుతో చూశారు.
‘‘ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించిన నాగరాజునీ ఇద్దర్నీ క్షమించేస్తున్నాం అని తీర్పు ఇచ్చారు కరుణాసముద్రుడైన శ్రీకృష్ణ దేవరాయలు.
అందరి ముఖాలూ వికసించాయి. బావా మరదళ్ల గురించి చెప్పాలా?
కథ... సుఖాంతం.    
 
హిట్ సాంగ్స్
- కోతీబావకు పెళ్లంట కోవెల తోట విడిదంట
- పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి
- పిలిచిన బిగువటరా ఔరౌర
- ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
- ఔనా నిజమేనా మమతలన్ని కలలేనా?
- మనసున మల్లెల మాలలూగెనె
 
వివరాలు-విశేషాలు
- వాహినీ స్టూడియోస్ బ్యానర్ 1951 డిసెంబర్ 20న విడుదలైంది. దర్శకత్వం, నిర్మాణం బి.ఎన్.రెడ్డి.
- కథాకాలం 13వ శతాబ్దం. పాటలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం : సాలూరి రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు. నేపథ్యగానం : ఘంటసాల, భానుమతి, మాధవపెద్ది సత్యం, శకుంతల.

సంభాషణలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు.
- మల్లీశ్వరి తీయాలని బి.ఎన్.రెడ్డి 1939లో అనుకుంటే, పదేళ్లకు గానీ ఆయన ఆలోచన రూపుదాల్చలేదు!
- మొదట మల్లీశ్వరి పాత్రకు ఒక కొత్త అమ్మాయిని అనుకున్నారు. కానీ మల్లీశ్వరి వంటి విలక్షణమైన పాత్రకు అనుభవం ఉన్న వారైతే బాగుంటుందని భానుమతిని తీసుకున్నారు.
- కళా దర్శకుడు ఎ.కె.శేఖర్ పెన్సిల్ స్కెచ్  వేస్తే వాటిని చూసి సెట్స్ తయారు చేశారు. అలా మల్లీశ్వరికి కావలసిన సెట్లన్నిటికీ ఆయన స్కెచ్‌లు గీసిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement