పుదుచ్చేరిలోని ‘జిప్‌మెర్’ ఆస్పత్రి వద్ద భార్య మంజులతో అరివళగన్
లాక్‌డౌన్ పరీక్షలు పెడుతోంది. స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు కాదు. ఏకంగా బోర్డ్ ఎగ్జామ్స్!పేపర్ ఏమిటో తెలీదు.ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలీదు. హాల్ టికెట్ చేతికి ఇస్తోంది.‘కమాన్.. స్టార్ట్.. ఐ సే..’ అంటోంది!
అరివళగన్‌కు టఫ్ పేపర్ వచ్చింది.ఊది పడేశాడు. డిస్టింక్షన్!! ఎలా?!!!!!!!!!!!!!!!!!!! పరీక్ష అనుకోలేదు.. ప్రాణం అనుకున్నాడు. ఆ ప్రాణం.. అతడి భార్య.
అరివళగన్ ఇంటి ముందు సైకిల్ ఉంది. స్టాండ్ వేసి ఉంది. పాత సైకిల్. నట్లు, బ్రేకులు ముందు రోజే చూసుకున్నాడు. బెల్లుతో పని లేదు. ‘తప్పుకో’ అని బెల్ కొట్టడానికి రోడ్డు మీద ఎవరుంటున్నారని! కాసేపట్లో బయల్దేరాలి. లోపల్నుంచి భార్య రావడం కోసం చూస్తున్నాడు అతను. ఉదయం ఐదు కావస్తోంది. ఆ మసక చీకట్లో సైకిల్‌ని, అరివళగన్‌ని పక్కపక్కన చూస్తే ఇంకో సైకిల్‌లా ఉంటాడు అతను. కాసేపట్లో ఆ సైకిల్‌ని ఈ సైకిల్ తొక్కబోతోంది. భార్యని సైకిల్ క్యారేజ్ వెనుక కూర్చోబెట్టుకున్నాడు. అరవై ఏళ్లు ఉంటాయి ఆమెకు. టవల్‌తో ఆమెను తన సీటుకు కట్టేసుకున్నాడు. ‘కదలకు. స్పీడ్ ఎక్కువైతే భయపడకు’ అని చెప్పాడు. ‘చేతిలో కాగితాలు భద్రం’ అన్నాడు. సరే అంది. అరివళగన్ సైకిలెక్కి కూర్చొని బ్యాలెన్స్ చేసుకుని పెడల్ మీద కాలు వేసి తొక్కాడు.
అతడు వెళుతున్నది పుదుచ్చేరిలోని ఆసుపత్రికి. ఆ ఆసుపత్రికి, అరివళగన్ భార్య చేతిలోని కాగితాలకు సంబంధం ఉంది. క్యాన్సర్ ఆమెకు! కీమోథెరెపీ కోసం భార్యను తీసుకెళుతున్నాడు అతను. ఒకసారితో థెరపీ అయిపోదు. మళ్లీ మళ్లీ వెళ్లొస్తుండాలి. లాక్‌డౌన్‌కి ముందు బస్సులో వెళ్లొచ్చారు భార్యాభర్త. ఇప్పుడు బండ్లు లేవు. వీళ్లుండే గ్రామం నుంచి పుదుచ్చేరి ఆసుపత్రికి 130 కి.మీ.! అంతదూరం అరవై ఐదేళ్ల మనిషి సైకిల్ డబుల్స్ తొక్కాలంటే కాళ్ల బలానికి గుండె బలం తోడవ్వాలి. తోడుగా భార్య ఉంది. జీవితమంతా తోడుగా ఉండి బలాన్ని ఇచ్చిన భార్య ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది. తన భుజం మీద చేయి వేసి ఉంది. ఆ చేతిలోంచి తన గుండెలోకి ప్రవహించే ఆత్మీయ బలం చాలు.. ఎంత దూరమైనా.. సైకిల్ తొక్కగలడు.
పుదుచ్ఛేరిలోని ‘జిప్‌మెర్’ ఆసుపత్రి. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్! పేరంత పెద్ద ఆసుపత్రి. ఉదయం ఐదుకు బయల్దేరితే రాత్రి పదింబావు అయింది అరివళగన్ దంపతులు అక్కడికి చేరుకునే సరికి. బస్సులు ఉండుంటే మూడు గంటల ప్రయాణం. మార్చి 31 న మళ్లీ రావాలని ఆమె చేతుల్లో ఉన్న కాగితాల్లో ఉంది. అందుకే బస్సుల్లేక పోయినా వచ్చేశారు. అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ మూసేసి ఉంది. రీజనల్ క్యాన్సర్ సెంటర్‌లో తెరిచి ఉంది కానీ లోపల ఎవరూ లేరు. పెద్ద డాక్టర్ ఎవరో హడావుడిగా వస్తున్నాడు. ఎదురెళ్లి చేతులు జోడించారు. ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పారు. ఎలా వచ్చారు? చెప్పారు. ఆశ్చర్యపోయాడు పెద్ద డాక్టర్. కొద్ది నిమిషాల్లోనే క్యాన్సర్ సెంటర్ డాక్టర్ వచ్చారు. ఆమెను కీమోకు తీసుకెళ్లారు. కీమో సెషన్ అయ్యాక, మళ్లీ రావలసిన డేట్ ఇచ్చారు. పెద్ద డాక్టర్ అక్కడికి వచ్చారు. ‘ఎలా వెళ్తారు మీ ఊరికి.. మళ్లీ సైకిలేనా?’ అని అడిగారు. రాత్రి ఇక్కడే ఉండి తెల్లారే వెళ్లండి అని చెప్పారు. భోజనం పెట్టించారు. చేతిలో కొంత డబ్బు పెట్టారు. నెలకు సరిపడా ముందులు కవర్‌లో చుట్టి ఇచ్చారు. తెల్లవారగానే అంబులెన్స్ ఏర్పాటు చేసి.. తమిళనాడులోని కుంభకోణం దగ్గర వాళ్ల గ్రామానికి పంపించారు. అరివళగన్ దినసరి కూలీ. లాక్‌డౌన్ తనకు పనిలేకుండా చేసిందన్న నిస్పృహలో భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడం మర్చిపోలేదు అతను. పని అనుకుని ఉంటే మర్చిపోయేవాడేమో.
ఆసుపత్రికి వెళ్లిన రోజు దారిలో టీ కొట్టు దగ్గర ఇద్దరూ టీ తాగారు. ఇంకోచోట చుట్టు నీడను, చెరువు నీళ్లను చూసుకుని అక్కడ రెండు గంటలు నడుము వాల్చారు. వాళ్లకు స్టేట్ హెల్త్ కార్డులు లేవు. సెంట్రల్ హెల్త్ కార్డులు లేవు. పిల్లలు దగ్గర లేరు. ఒకరి కొకరు. అంతే. భార్యను పుదుచ్ఛేరిలో చూపించడానికి చాలాకాలమే డబ్బు కూడబెట్టవలసి వచ్చింది అరివళగన్‌కు. భార్యకు రెండో విడత కీమో ఇప్పించుకుని వచ్చిన నాలుగు రోజులకు కీమో ఇచ్చిన డాక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘నీ భార్యకు ఎలా ఉంది పెద్దాయనా?’’ అని అడిగారు ఆయన. ‘‘ఈసారి వచ్చేముందు ఫోన్ చెయ్యండి. అంబులెన్స్ పంపిస్తాను’’ అని కూడా చెప్పారు. ఆ మాటకు సంతోషపడ్డారు అరివళగన్, ఆయన భార్య మంజుల. ‘‘ఈ వయసులో అంతదూరం డబుల్స్ ఎలా తొక్కావు అరివళ్..’’ అనే ప్రశ్నకు పెద్దగా నవ్వుతాడు అరివళగన్. ‘‘డబుల్స్ కాబట్టే అంత శక్తి వచ్చిందేమో’’ అంటాడు.
Comments
Please login to add a commentAdd a comment