కోయంబేడు కొంపముంచిందా? | Day By Day Corona Cases Increasing In Tamilnadu | Sakshi
Sakshi News home page

కోయంబేడు కొంపముంచిందా?

Published Wed, May 13 2020 2:41 AM | Last Updated on Wed, May 13 2020 2:41 AM

Day By Day Corona Cases Increasing In Tamilnadu - Sakshi

ఢిల్లీని మించిపోయింది రాజస్తాన్‌ను దాటేసింది దేశంలో మూడో స్థానానికి ఎగబాకింది తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది మొత్తం కేసుల్లో సగం చెన్నైలోనే నమోదయ్యాయి లాక్‌డౌన్‌ సమయానికి రెండు పదులుండే కేసులు ఇప్పుడు 8 వేలు దాటేశాయి. ఎందుకిలా జరిగింది?

తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువైపోవడం దడ పుడుతోంది. అందుకే ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పట్నుంచి రైళ్లు నడపొద్దని కేంద్రానికి మొరపెట్టుకున్నారు. లాక్‌డౌన్‌ కఠినతరం చేస్తున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి 26 కేసులే తమిళనాడులో ఉన్నాయి. వారందరినీ క్వారంటైన్‌ చేస్తే పెద్దగా నష్టం జరగదని అనుకున్నారు. ఏప్రిల్‌ 17 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా అవతరించవచ్చని అంచనా వేశారు.

కానీ కరోనా కేసులు ఏప్రిల్‌లో బాగా పెరిగాయి. మేలో విజృంభించాయి. మే 10 నాటికి ఢిల్లీని దాటేసి జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లినవారిలో 1,100 మందికిపైగా చెన్నైలో ఉంటే అతి పెద్ద కోయంబేడు హోల్‌సేల్‌ కూరగాయల నిర్వహణలో లోపాలతో వైరస్‌ అనూహ్యంగా విస్తరించింది. అయితే మరణాల రేటు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.35 శాతం ఉంటే తమిళనాడులో 0.67 శాతంగా ఉంది.

బజారు బేజారు 
చెన్నైలో కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌ కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్‌ ద్వారా దాదాపుగా 2 వేల మందికి కరోనా వైరస్‌ సోకింది. 1996లో ఏర్పాటైన మార్కెట్లో 3750 దుకాణాలున్నాయి. ఆసియాలోపెద్దదైన ఈ మార్కెట్‌ 65 ఎకరాల్లో విస్తరించింది. పూలు, పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ఇక్కడ నుంచే తీసుకువెళ్లాలి. రిటైల్‌ వర్తకులు, 10 కి.మీ.ల పరిధిలోని జనమంతా ఇక్కడికే వస్తారు. పండగ వేళ దాదాపు రెండులక్షల మందివస్తారు. మొదటి దశ లాక్‌డౌన్‌ సమయంలో మార్కెట్‌లో సజావుగా ఉంది. ఏప్రిల్‌ 14న తమిళనాడు న్యూ ఇయర్‌ని పురస్కరించుకొని జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

లక్షల్లో జనం రావడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనల్ని కఠినతరం చేస్తూ మార్కెట్‌ తెరిచి ఉంచే వేళల్ని తగ్గించింది. కరోనా కట్టడి కోసం తీసుకున్న ఈ చర్య కేసులు పెరిగేలా చేసింది. మార్కెట్‌ తెరిచి ఉన్నప్పుడే అన్నీ కొనుక్కోవాలన్న ఆత్రుతలో జనం భారీగా వచ్చారు. రద్దీ ఎక్కువై భౌతిక దూరం పాటించడం అసాధ్యమైంది. ఈ మార్కెట్‌లో అమ్మకందారుడు ఒకరికి తొలుత కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అలా వారి సంఖ్య 2 వేలకి చేరుకుంది. దీంతో ప్రభుత్వం మే 5 నుంచి మార్కెట్‌ని మూసేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ మార్కెట్‌లో పనిచేసే 10 వేల మంది కూలీలు, సరుకు లోడ్‌ చేసేవారు కొందరు అరియళూర్, పెరంబలూరు, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో సొంత ఊళ్లకు వెళ్లారు. అలా వెళ్లిన కూలీలకు కరోనా పాజిటివ్‌గా తేలడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

తమిళనాడులో ఇలా...
మొత్తం కేసులు: 8002 
కోలుకున్న వారు: 2051 
మృతులు: 53

వచ్చే పది రోజుల్లో చెన్నైలో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అయినా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. నగరంలో జనాభా, చేస్తున్న పరీక్షలతో పోల్చి చూస్తే కేసులు అదుపులో ఉన్నట్టుగానే భావించాలి. పదిరోజులుగా చాలా ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నాం. రోజుకి 3,500 మందికి పరీక్షలు నిర్వహించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. అందుకే కేసుల సంఖ్య పెరుగుతోంది. జే రాధాకృష్ణన్, కోవిడ్‌ ప్రత్యేక అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement