►స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ కెమెరా వెనక పని చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కారణం?
లక్ష్మి: లేడీ ప్రొడ్యూసర్స్ మరింతమంది రావాలి. ఎందుకంటే ఆర్థిక అవగాహన వాళ్లకు చాలా ఉంటుంది. అది మనకు తెలియక ఉమెన్ ప్రొడ్యూసర్స్‌ని తీసుకురావడం లేదు. ఎక్కువ మంది స్త్రీలు నిర్మాతలుగా ఉంటే ఇండస్ట్రీ ఇంకా సాలిడ్‌గా ఉంటుంది.
►స్త్రీలు నిర్మాతలైతే షూటింగ్ లొకేషన్‌లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది?
స్త్రీలు ఏ రంగంలో ఉన్నా వాళ్లకు తెలియకుండానే ఓ రకమైన సున్నితత్వం, సురక్షితమైన వాతావరణం తీసుకువస్తారు. అఫ్‌కోర్స్... ఇండస్ట్రీలోకి ఇంకా ఎక్కువమంది స్త్రీలు రావాలి. మెల్లిగా మార్పు వస్తుంది.
►రామానాయుడుగారు నిర్మాతగా వంద సినిమాలుపైనే నిర్మించారు. లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఆ రికార్డుని అందుకోగలుగుతారా?
సినిమాలు నిర్మించడం అనేది మాములు విషయం కాదు. 500 సినిమాల్లో యాక్ట్ చేశాను.. 1000 సినిమాలు చేశాను అని చెప్పుకునే ఘనత మాకుంటుందో ఉండదో! ఇంతకు ముందు ఓ సినిమా 20–30 రోజుల్లో పూర్తయ్యేది. ఇప్పుడు మూడొందల రోజులయినా అవ్వడం లేదు. అన్ని సినిమాలు నిర్మించడం రామానాయుడు అంకుల్‌కే సాటి.
►నిర్మాణంలో మగవాళ్లకి, ఆడవాళ్లకి ఉండే తేడా ఏంటి?
నిర్మాతగా నేను సెట్స్‌లోకి వెళ్తే చాలామంది ఉమెన్ నా సెట్లో ఉండాలనుకుంటాను. స్క్రిప్ట్ రాసేవాళ్లలో కానీ, ప్రొడక్షన్‌లో కానీ ఎక్కువమందిని ప్రోత్సహించాలనుకుంటాను. ఫిమేల్ టెక్నీషియన్స్ ఎంత ఎక్కువమంది ఉంటే అంత మంచిది అనుకుంటాను.
►నిర్మాణంలో మీరు ఎదుర్కొనే చాలెంజ్‌లు ఏంటి?
ఛాలెంజ్‌లు ప్రతీ రంగంలోనూ ఉంటాయి. నేను సామర్థ్యాన్ని బట్టి పని రావాలని కోరుకుంటాను కానీ ఆడపిల్ల అయినందువల్లో, పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నందువల్లో నాకు పని ఇవ్వాలని కోరుకోను.
►ఝుమ్మంది నాదం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, గుండెల్లో గోదారి, దొంగాట వంటి సినిమాలు నిర్మించారు. ఈ మధ్య నిర్మాతగా స్లో అయ్యారెందుకని?
ఈ కథను కచ్చితంగా చెప్పాలి అని నేను భావించినప్పుడు సినిమా నిర్మించాలనుకుంటాను. అలా అనిపించినప్పుడు సినిమా నిర్మిస్తూనే ఉంటాను. సినిమా నిర్మించకపోయినా టెలివిజన్‌లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అన్నీ ఒకే సమయంలో చూసుకోలేను. కాబట్టి ఒక్కొక్కటీ ఒక్కో సమయంలో చేస్తున్నాను.
►మీకు బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే సినీ నిర్మాణంలో కొనసాగగలుగుతున్నారని అనుకోవచ్చా?
ప్రొడ్యూసర్ అవడానికి బ్యాగ్రౌండ్ కాదు. మనకు ఇంట్రెస్ట్ ఉందా? లేదా అన్నది ముఖ్యం.
►ఫ్యామిలీ లెగసీని మోయడం ఒత్తిడికి గురి చేస్తుందా?
లెగసీ అనేది సమస్య అని నేను అనను. వారసత్వం అనేది మనకు ఫస్ట్ రెడ్ కార్పెట్ వేస్తుందేమో కానీ దానికింద ముళ్లు మాత్రం ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బ్యాగ్రౌండ్‌కి మచ్చ తెచ్చినవాళ్లం అవుతాం. నేను నటించినా, నిర్మించినా లెగసీని గుర్తుపెట్టుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment