మాంసాహారం మరీ ఎక్కువైతే ప్రమాదమా?
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 49 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. మాంసాహారం లేకుండా దాదాపుగా భోజనం చేయను. కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - షరీఫ్, నల్లగొండ
కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్)అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్‌డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్‌డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్ల పాటు ఎదగడానికి ఈ కొలెస్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి.
ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు చాలా మందిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు.
డాక్టర్ అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
ఎప్పుడూ నీరసం, నిస్సత్తువ..! తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. గత ఆరె నెలల నుంచి ఒళ్లు నొప్పులు. కండరాలు లాగుతున్నాయి. ఎప్పుడూ నీరసం. జ్వరంగా కూడా అనిపిస్తోంది. దయచేసి హోమియోపతిలో పరిష్కారం ఇవ్వగలరు. - రమాదేవి, విశాఖపట్నం
క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (సీఎఫ్‌ఎస్) / దీర్ఘకాలిక నీరసం అనేది సాధారణంగా శ్రమతో సంబంధం లేకుండా నీరసానికి కారణమయ్యే వ్యాధి. దీనితో బాధపడేవాళ్లలో కనీసం ఆరు నెలల పాటు నీరసం, నిస్సత్తువ లక్షణాలూ కనిపిస్తాయి. విశ్రాంతి తీసుకున్నా ఉత్సాహంగా లేకపోవడం కూడా గమనించవచ్చు. దీనినే ఇమ్యూన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ లేదా మైయాల్జిక్ ఎన్సెఫాలో మైలైటిస్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (సీఎస్‌ఎఫ్)తో బాధపడేవారిలో నాడీమండలం, రోగనిరోధక వ్యవస్థ, వినాళ గ్రంథుల వ్యవస్థలకు సంబంధించిన అసాధారణతలు కనిపిస్తాయి.
కారణాలు : వయసు ప్రభావం (ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది) ఆందోళన రోగ నిరోధకశక్తి తగ్గడం అంటువ్యాధులు మానసిక వ్యాధులు, డిప్రెషన్ హార్మోన్ సమస్యలు
లక్షణాలు : నీరసం లేదా అలసట విశ్రాంతి తీసుకున్నా ఉత్సాహంగా లేకపోవడం శారీరక శ్రమ చేయలేకపోవడం నిద్ర సరిపోనట్లు అనిపించడం ఏకాగ్రత లోపించడం, తలనొప్పి, కండరాల బలహీనత రోజువారీ పనులు చేయడం కష్టంగా ఉండటం, చిరాకు
వ్యాధి నిర్ధారణ : బ్రెయిన్ ఎమ్మారై, సీబీసీ, ఈఎస్‌ఆర్, టీఎస్‌హెచ్, యూరిన్ టెస్ట్
చికిత్స : హోమియో విధానంలో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా సీఎఫ్‌ఎస్‌కు మేలైన చికిత్స అందించవచ్చు. వ్యాధి మూలకారణాన్ని గుర్తించి, వ్యాధి తీవ్రతను అంచనావేసి, రోగి లక్షణాలను విశ్లేషించి వైద్యనిపుణులు మందులు సూచిస్తారు. సీఎఫ్‌ఎస్‌కు హోమియోలో చైనా, యాసిడ్ ఫాస్, ఆర్సినిక్ ఆల్బ్, కార్బోవెజ్, ఫైమెట్ మొదలైన మందులు ఈ చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్